వయసు మళ్లిన లోకం..!
ABN , Publish Date - Sep 07 , 2026 | 05:47 AM
ప్రపంచం జనాభా సంక్షోభం దిశగా పయనిస్తోంది..! జననాల రేటు దారుణంగా పడిపోవడం, వృద్ధుల జనాభా బాగా పెరిగిపోవడంతో జపాన్, దక్షిణ కొరియా, చైనా, భారత్‌తోపాటు ఐరోపా దేశాలు ఇప్పటికే ఈ పరిస్థితిని ఎదుర్కొంటుండగా... ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ ముప్పు దిశగా అడుగులు వేస్తున్నాయి..!
ప్రపంచ చరిత్రలో తొలిసారి 5 ఏళ్లలోపు
పిల్లల సంఖ్యను దాటేసిన వృద్ధులు
2025 నాటికి వృద్ధుల సంఖ్య 85.2 కోట్లు
2060 నాటికి ఇది 200 కోట్లకు పెరగొచ్చు
యూఎస్ సెన్సస్ బ్యూరో నివేదిక వెల్లడి
వాషింగ్టన్, సెప్టెంబరు 6: ప్రపంచం జనాభా సంక్షోభం దిశగా పయనిస్తోంది..! జననాల రేటు దారుణంగా పడిపోవడం, వృద్ధుల జనాభా బాగా పెరిగిపోవడంతో జపాన్, దక్షిణ కొరియా, చైనా, భారత్‌తోపాటు ఐరోపా దేశాలు ఇప్పటికే ఈ పరిస్థితిని ఎదుర్కొంటుండగా... ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ ముప్పు దిశగా అడుగులు వేస్తున్నాయి..! అమెరికాకు చెందిన యూఎస్ సెన్సస్ బ్యూరో ‘యాన్ ఏజింగ్ వరల్డ్: 2025’ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. మానవ చరిత్రలోనే తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా 5 ఏళ్లలోపు వయసున్న చిన్నారుల కంటే వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది. అంతేకాదు 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారి సంఖ్య 85.2 కోట్లు ఉండగా... 2060 నాటికి అది 200 కోట్లకు చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది.
నివేదికలో కీలకాంశాలు
ప్రతి ఐదుగిరిలో ఒకరు వృద్ధులే..: 2025లో ప్రపంచ జనాభాలో 10.5 శాతంగా ఉన్న వృద్ధులు.. 2060 నాటికి 19.6 శాతానికి పెరగనున్నారు. అంటే అప్పటికి ప్రతి ఐదుగురు జనాభాలో ఒకరు వృద్ధులే ఉంటారు. కొన్ని దశాబ్దాలుగా వేగంగా తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు, పెరుగుతున్న ఆయుర్దాయం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది. రాబోయే సంవత్సరాల్లో ఈ ధోరణి మరింత వేగవంతం కానుంది. ప్రపంచ జనాభాలో 71 శాతం కంటే ఎక్కువ మంది పునఃస్థాపన రేటు (ఒక మహిళకు 2.1 జననాలు) లేదా అంతకంటే తక్కువ సంతానోత్పత్తి స్థాయి ఉన్న దేశాల్లో నివసిస్తున్నారు.
మార్పునకు కారణాలు
ఈ మార్పునకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అనేక దేశాల్లో కుటుంబాలు తక్కువ మంది పిల్లల్ని కంటున్నాయి. అలాగే ఆరోగ్య సంరక్షణ, జీవన ప్రమాణాలు పెరగడం వల్ల ప్రజల ఆయుర్దాయం పెరిగింది. దీనివల్ల వృద్ధులు పెరుగుతున్నారు.
భారత్, చైనాపై అధిక ప్రభావం
ఆసియాలో వృద్ధుల జనాభా 48.7 కోట్ల నుంచి 2060 నాటికి 120 కోట్లకు చేరుతుందని అంచనా. అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో టాప్-2లో ఉండే భారత్, చైనాలపై ఈ ప్రభావం ఎక్కువగా పడనుంది. ఈ రెండు దేశా ల్లో ఇప్పటికే సంతానోత్పత్తి రేటు పునఃస్థాపక స్థాయి (ఒక మహిళకు 2.1 జననాలు) కంటే దిగువకు పడిపోయింది. 2050 నాటికి భారత్‌లో వృద్ధ జనాభా (60ఏళ్లు పైబడినవారు) 35 కోట్ల కు చేరుకుంటుందని అంచనా. కాగా, వృద్ధులు ఎక్కువగా పెరుగుతున్న ధోరణి ఆసియా, యూరప్ దేశాల్లో అధికంగా కనిపిస్తోంది. వృద్ధుల పెరుగుదల కేవలం సంపన్న దేశాలకే పరిమితం కాలేదు. యూఎస్ సెన్సస్ బ్యూరో అంచనా ప్రకారం 2060 నాటికి ఆఫ్రికాలో 65 ఏళ్లు పైబడినవారి సంఖ్య 24.9 కోట్లకు చేరుకోనుంది. వృద్ధుల జనాభా పెరగడం వల్ల ప్రభుత్వాలు పింఛన్లు, సామాజిక భద్రత వంటి సంక్షేమ పథకాల కోసం ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. యువత, పనిచేసే వయసుగల వారి జనాభా తగ్గిపోవడం వల్ల శ్రామికశక్తికి కొరత ఏర్పడుతుంది. దీనివల్ల దేశ ఆర్థిక వృద్ధి మందగిస్తుందని సెన్సస్ బ్యూరో నివేదిక పేర్కొంది.