Share News

ప్రతీకారం తీర్చుకుంటాం.. అఫ్గానిస్థాన్ హెచ్చరిక

ABN , Publish Date - Feb 22 , 2026 | 01:20 PM

పాక్ వైమానిక దాడులపై అఫ్గానిస్థాన్ మండిపడింది. తగిన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. పొరుగు విషయంలో సఖ్యతతో ఉండాలన్న కనీస ఇస్లామిక్ విలువను కూడా పాక్ మర్చిపోయిందని మండిపడింది.

ప్రతీకారం తీర్చుకుంటాం.. అఫ్గానిస్థాన్ హెచ్చరిక
Afghanistan Warns Pakistan of Retaliantion to Air Strikes

ఇంటర్నెట్ డెస్క్: పాక్ వైమానిక దాడులు జరపడంపై అఫ్గానిస్థాన్ అగ్గిమీద గుగ్గిలమైంది. తగిన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామని తాజాగా హెచ్చరించింది. సరిహద్దుకు సమీపంలోని అఫ్గానిస్థాన్ భూభాగాల్లో శనివారం అర్ధరాత్రి దాటాక పాక్ వాయుసేన దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో అనేక మంది కన్నుమూశారు. అఫ్గానిస్థాన్‌లో దాక్కున్న ఉగ్రవాదులను తాము టార్గెట్ చేశామని పాక్ ప్రకటించుకుంది. ఇటీవల తమ దేశంలో జరిగిన పలు ఆత్మాహుతి దాడులకు ఈ ఉగ్రమూకలే కారణమని పేర్కొంది (Afghanistan Warns of Retaliation).

పాక్ ఆరోపణలను అఫ్గానిస్తాన్ తాజాగా తోసిపుచ్చింది. పాక్ ఎదుర్కొంటున్న అంతర్గత సవాళ్లను ఈ దాడులతో కప్పిపుచ్చలేరని వ్యాఖ్యానించింది. అఫ్గానిస్థాన్‌లో జాతీయ సంస్థలు, ప్రార్థనా కేంద్రాలపై జరిగిన ఈ దాడులు పాక్ నిఘా, భద్రతా వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. తగిన సమయంలో దీటుగా జవాబు చెబుతామని హెచ్చరించింది. అంతర్జాతీయ చట్టాలను పాక్ ఉల్లంఘించిందని మండిపడింది. పొరుగుతో సఖ్యతగా ఉండాలన్న కనీస ఇస్లామిక్ విలువలను నిలుపుకోలేకపోయిందని మండిపడింది. నన్‌గర్హర్, పక్టికా ప్రావిన్సుల్లో జరిగిన ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా డజన్ల కొద్దీ సాధారణ పౌరులు కన్నుమూశారని తెలిపింది.


తమ దేశ ప్రాదేశిక సమగ్రత, ప్రజల భద్రత పరిరక్షణే తమ తొలి ప్రాధాన్యమని అఫ్గానిస్థాన్ రక్షణ శాఖ ఎక్స్ వేదికగా పేర్కొంది. అది తమ చట్టబద్ధ బాధ్యత అని పేర్కొంది. కాబట్టి, తగిన సమయంలో, తగిన రీతిలో దీటుగా బదులిస్తామని వ్యాఖ్యానించింది.

ఇటీవల తమ భూభాగంలో జరిగిన పలు ఆత్మాహుతి దాడుల వెనక అఫ్గానిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర శక్తులు ఉన్నాయని పాక్ ఆరోపిస్తోంది. ఇందుకు తమ వద్ద కచ్చితమైన ఆధారాలు ఉన్నాయని చెబుతోంది. అయితే, తాలిబాన్లు మాత్రం పాక్ ఆరోపణలను ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతున్నారు. తమ భూభాగంలో ఉగ్రకార్యకలాపాలకు స్థానం లేదని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

అఫ్గానిస్థాన్‌లో పాక్ వైమానిక దాడులు

సుంకాల డబ్బును తిరిగివ్వండి! ట్రంప్‌నకు అమెరికన్ల డిమాండ్

Updated Date - Feb 22 , 2026 | 01:20 PM