కెనడాలో విషాదం.. విధి నిర్వహణలో భారత సంతతి పోలీసు మృతి
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:21 PM
కెనడాలో విషాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భారత సంతతికి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: కెనడాలో విషాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భారత సంతతికి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన తరుణ్ బాలి ‘ది ఒంటారియో ప్రొవెన్షియల్ పోలీస్ (ఓపీపీ)’లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఓ కేసులో అరెస్ట్ అయిన 18 ఏళ్ల యువకుడిని ‘మెంటల్ హెల్త్ యాక్ట్’ కింద పోలీసులు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆ యువకుడు మంగళవారం ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. ఆస్పత్రి నుంచి పరారైన అతడిని పట్టుకోవడానికి తరుణ్ బాలి ప్రయత్నించాడు.
ఈ నేపథ్యంలోనే హర్స్ట్ సమీపంలో ఆ యువకుడు వాహనంతో తరుణ్ బాలిని ఢీకొట్టాడు. తీవ్ర గాయాలపాలైన తరుణ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తరుణ్ మరణానికి కారణమైన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తరుణ్ మరణంపై పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘తరుణ్ బాలి మరణంతో నా గుండె ముక్కలైంది. అతడు పోలీస్ ఆఫీసర్ కావాలని ఎన్నో కలలు కన్నాడు. తరుణ్‌కు రెండేళ్ల వయసు ఉన్నపుడు పోలీస్ ఆఫీసర్ ఫొటోకు సెల్యూట్ చేశాడు. దీన్ని వాళ్ల కుటుంబసభ్యులు ఫొటో తీశారు. ఆ ఫొటోను నేను చూశాను’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
పిల్లల భవిష్యత్తును మార్చే అలవాట్లు ఇవే
మమతకు షాక్.. టీఎంసీకి మరో ఎంపీ రాజీనామా..