అమెరికాకు హెచ్-1బీ డాక్టర్లు అవసరం.. చట్టసభల సభ్యుల లేఖ
ABN , Publish Date - Feb 12 , 2026 | 09:38 PM
భారీగా పెంచిన హెచ్-1బీ ఫీజు నుంచి విదేశీ డాక్టర్లకు కొంత మేరకైనా ఉపశమనం కలిగించాలంటూ అమెరికాకు చెందిన 100 మంది చట్టసభ సభ్యులు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రెటరీకి లేఖ రాశారు. ఈ లేఖకు అమెరికన్ హాస్పిటల్ అసోసియేషన్ కూడా మద్దతు తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసాపై అమెరికాలో చర్చ పతాకస్థాయికి చేరింది. ఈ వీసాకు ఫుల్ స్టాప్ పెట్టాలని కొందరు ప్రజాప్రతినిధులు పట్టుబడుతున్నారు. హెచ్-1బీ అమెరికాకు ఎంత అవసరమో గుర్తించిన మరికొందరు ఈ వీసాను కాపాడుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
హెచ్-1బీ వీసా ఆవశ్యకతను తెలుపుతూ తాజాగా 100 మంది ప్రజాప్రతినిధులు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ క్రిస్టీ నోయెమ్‌కు లేఖ రాశారు (US Lawmakers Letter). లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజు నుంచి కనీసం విదేశీ డాక్టర్లకు కొంతమేరకైనా మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు (Relief From H-1b Fee). న్యూయార్క్ రిప్రజెంటేటివ్‌లు ఈవెట్ క్లార్క్, మైఖేల్ లాలెర్ సారథ్యంలో చట్టసభల సభ్యులు ఈ లేఖ రాశారు.
వైద్య వసతులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో హెచ్-1బీ వీసా డాక్టర్లే అమెరికన్లకు కీలక వైద్య సేవలు అందిస్తున్నారని వారు తెలిపారు. అనేక ఆసుపత్రులు విదేశీ డాక్టర్లపైనే ఎక్కువగా ఆధారపడ్డాయని గుర్తు చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. ఇటీవల పెంచిన ఫీజు కారణంగా ఆసుపత్రుల్లో వైద్యుల కొరత మరింత పెరుగుతుందని హెచ్చరించారు. విదేశీ వైద్యుల విషయంలో ఈ ఫీజును కొంత మేరకైనా తగ్గించాలని కోరారు. చట్టసభల ప్రయత్నానికి అమెరికన్ హాస్పిటల్ అసోసియేషన్, అమెరికన్ మెడికల్ కాలేజెస్ అసోసియేషన్‌తో పాటు పలు ప్రధాన సంస్థలు మద్దతు తెలిపాయి. హెచ్-బీ వీసా ముగింపు కోసం గ్రెగ్ స్టూబే ఇటీవల ఓ బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ లేఖకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇవీ చదవండి:
హెచ్-1బీ వీసా రద్దు కోసం అమెరికాలో మరో ప్రయత్నం!