బరువు తగ్గించే మందులతో జుట్టు రాలుతుందా?
ABN , Publish Date - Sep 14 , 2026 | 08:37 PM
బరువు తగ్గేందుకు ఉపయోగించే GLP-1 మందుల వాడకం ఇటీవల పెరుగుతోంది. అయితే ఈ మందులు వాడే పురుషుల్లో, ముఖ్యంగా జన్యుపరంగా బట్టతల వచ్చే అవకాశం ఉన్నవారిలో జుట్టు రాలే ప్రమాదం కొంత పెరగవచ్చని తాజా అధ్యయనం సూచిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: బరువు తగ్గించే మందులు వాడటం వల్ల పురుషుల్లో జుట్టు రాలే సమస్య పెరుగుతుందా? ముఖ్యంగా జన్యుపరంగా బట్టతల వచ్చే అవకాశం ఉన్నవారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉండొచ్చని ఓ కొత్త అధ్యయనం సూచిస్తోంది.
ప్రస్తుతం చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు వీరిలో కొందరు GLP-1 మందులను ఉపయోగిస్తున్నారు. భారత్‌లోనూ ఈ మందుల వినియోగం వేగంగా పెరుగుతోంది. GLP-1 మందులు శరీరంలో సహజంగా ఉండే గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్-1 అనే హార్మోన్ పనితీరును అనుకరిస్తాయి. ఇవి ఆకలిని తగ్గించడంతో పాటు ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు కూడా సహాయపడతాయి.
అయితే, ఈ మందుల వాడకానికి పురుషుల్లో బట్టతల వచ్చే ప్రమాదంతో సంబంధం ఉండొచ్చని తాజా పరిశోధన సూచిస్తోంది. ముఖ్యంగా జన్యుపరంగా బట్టతల వచ్చే అవకాశం ఉన్న పురుషుల్లో ఈ ప్రమాదం సుమారు 7 శాతం ఎక్కువగా ఉండొచ్చని అధ్యయనం తెలిపింది.
అధ్యయనంలో ముఖ్యమైన విషయాలు
GLP1R జన్యువుపై పరిశీలన:
శరీరంలోని GLP-1 రిసెప్టర్ ప్రొటీన్ల పనితీరును నియంత్రించే GLP1R జన్యువును పరిశోధకులు విశ్లేషించారు. ఈ రిసెప్టర్ల స్థాయిలు ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో ఆండ్రోజెనెటిక్ అలోపేసియా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
అధిక రక్తపోటు, ఇన్సులిన్ నిరోధకత, తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు వంటి సమస్యలు కూడా జుట్టు రాలడానికి కారణమయ్యే అవకాశం ఉంది. ఇవి శరీరంలో రక్తప్రసరణపై ప్రభావం చూపవచ్చు. అయితే ఈ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత GLP-1తో సంబంధం ఉన్న అదనపు 7 శాతం ప్రమాదం కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు.
అయితే, ఈ అధ్యయనం GLP-1 మందులు నేరుగా బట్టతలకు కారణమవుతాయని నిర్ధారించదు. మందుల వాడకం, జన్యుపరమైన బట్టతల మధ్య సంబంధాన్ని మాత్రమే సూచిస్తుంది. జుట్టు రాలడం లేదా బట్టతల గురించి ఆందోళన ఉంటే వైద్యులని సంప్రదించి మందుల వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలను చర్చించడం మంచిది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
గ్యాస్, గుండెపోటు మధ్య తేడా ఏంటి? ఈ విషయాలు తెలుసుకోండి
నిద్రలో చెమటలు పడుతున్నాయా? కారణం ఇదే కావచ్చు!