ప్రోటీన్ కంటే పెప్టైడ్స్ బెటరా? అసలు నిజాలివే!
ABN , Publish Date - Jul 15 , 2026 | 09:48 AM
ఇటీవల వెల్‌నెస్ ప్రపంచంలో 'పెప్టైడ్స్' అనే పదం విపరీతంగా వినిపిస్తోంది. బరువు తగ్గడం, యవ్వనంగా కనిపించడం, త్వరగా కోలుకోవడం వంటి ప్రయోజనాలు దీనితో సాధ్యమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, అసలు పెప్టైడ్స్ అంటే ఏమిటి? ఇవి ప్రోటీన్ కంటే మెరుగైనవా అనే విషయాలపై నిపుణులు క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం...
ఇంటర్నెట్ డెస్క్: కొంతకాలం క్రితం వరకు హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ప్రపంచంలో 'ప్రోటీన్' అనే పదం పెద్ద బజ్‌ను క్రియేట్ చేసింది. ప్రోటీన్ బార్లు, పౌడర్లు, స్నాక్స్‌తో మార్కెట్ నిండిపోయింది. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని 'పెప్టైడ్స్' ఆక్రమిస్తున్నాయి. బరువు తగ్గడం, మెరిసే చర్మం, దీర్ఘాయువు, కండరాల రికవరీ ఇలా అన్నింటికీ పెప్టైడ్స్ ఓ అద్భుత పరిష్కారమంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇది తాత్కాలిక ట్రెండ్ మాత్రమే కాదని, దీని వెనుక సైన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
శాస్త్రీయంగా చూస్తే పెప్టైడ్స్ అనేవి మన శరీరంలో సహజంగానే ఉత్పత్తయ్యే అమైనో యాసిడ్ల చిన్న గొలుసులు. ఇవి శరీరంలోని కణాలు ఒకదానితో మరొకటి కమ్యూనికేట్ చేసుకోవడానికి 'సిగ్నలింగ్ మాలిక్యూల్స్'లా పనిచేస్తాయి. కణజాలాల మరమ్మతు, రోగనిరోధక శక్తి, జీవక్రియ, ఆకలి నియంత్రణ వంటి అనేక శారీరక ప్రక్రియలను సమన్వయం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. మన శరీరం సక్రమంగా పనిచేయడానికి ఇవి అంతర్గత సహాయకులుగా నిలుస్తాయి.
ప్రస్తుతం బరువు తగ్గడానికి వాడుతున్న కొన్ని రకాల ఇంజెక్షన్లలో ఉండే 'జీఎల్పీ-1' పెప్టైడ్స్ ఆకలిని నియంత్రించి, కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారిలో వీటికి ఆదరణ పెరిగింది. అలాగే వృద్ధాప్య ఛాయలను తగ్గించడానికి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి కూడా ఇవి ఉపయోగపడతాయని పరిశోధనల్లో తేలింది. జబ్బులు వచ్చాక వైద్యం చేయించుకోవడం కంటే, రాకుండా చూసుకోవాలనే ఆలోచన ప్రజల్లో పెరగడం వల్ల కూడా ఈ పెప్టైడ్స్ ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది.
అయితే.. పెప్టైడ్స్ అనేవి అన్ని సమస్యలనూ పరిష్కరించేది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన పోషకాహారం, తగినంత నిద్ర, ఒత్తిడి లేని జీవితం, క్రమబద్ధమైన వ్యాయామం వంటి ప్రాథమిక ఆరోగ్య సూత్రాలను పక్కనబెట్టి, కేవలం పెప్టైడ్స్ వల్లనే ఆరోగ్యం వచ్చేస్తుందని నమ్మడం పొరపాటు అంటున్నారు. ఇవి ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రత్యామ్నాయం కావని, కేవలం దానికి అదనపు బలాన్ని ఇచ్చే సాధనాలేనని చెబుతున్నారు. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలోనే వీటిని వాడటం సురక్షితం.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఫ్రిజ్ లేకుండానే టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా?
ఈ తేదీల్లో పుట్టినవారిది రాజసమైన వ్యక్తిత్వం..!