వానాకాలం.. జాగ్రత్త! ఈ చిట్కాలతో వ్యాధులకు చెక్ పెట్టండి
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:31 PM
వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. ఈ సీజన్‌లో మన శరీరాన్ని బ్యాక్టీరియా, వైరస్ దాడుల నుంచి రక్షించుకోవడానికి కొన్ని ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు, వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
ఇంటర్నెట్ డెస్క్: వర్షాకాలం రానే వచ్చింది. ఈ సమయంలో వాతావరణంలో అనేక రకాల మార్పులు రావడంతో పాటు, మన శరీరంలో కూడా కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ఉష్ణోగ్రతల్లో వచ్చే తీవ్రమైన హెచ్చుతగ్గుల కారణంగా రోజురోజుకీ ఆరోగ్య సమస్యలు పెరుగుతుంటాయి. మన శరీరం సులభంగా బ్యాక్టీరియా, వైరల్ దాడులకు గురవుతుంది. ఈ సీజన్‌లో అంటువ్యాధుల గురించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా జలుబు, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లు సర్వ సాధారణంగా వేధిస్తుంటాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే.
కాచి చల్లార్చిన నీటినే తాగాలి:
వర్షాకాలంలో తాగే నీరు కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీటిని బాగా మరిగించి, ఫిల్టర్ చేసుకుని తాగడం వల్ల డయేరియా వంటి జలజనిత వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు.
వేడి ఆహారానికే ప్రాధాన్యత:
చల్లారిన ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. ఎప్పటికప్పుడు ఇంట్లో వండుకున్న వేడివేడి వంటకాలను మాత్రమే తినాలి. రోడ్డు పక్కన అమ్మే నిల్వ ఉంచిన జంక్ ఫుడ్‌కు ఈ సీజన్‌లో పూర్తిగా దూరంగా ఉండాలి.
శాఖాహారమే మేలు:
వర్షాకాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది. అందువల్ల సులభంగా అరిగే శాఖాహారానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. మాంసాహారం వల్ల ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పరిసరాల శుభ్రత ముఖ్యం:
ఇల్లే కాకుండా ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమలు చేరకుండా నివారించడం ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర జ్వరాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
వ్యక్తిగత పరిశుభ్రత:
చేతులను ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ లేదా లిక్విడ్ సోప్‌తో శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా మూత్ర విసర్జనకు ముందు, తర్వాత చేతులు కడుక్కోవడం తప్పనిసరి.
వర్షంలో తడవకండి:
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అలర్జీలు ఉన్నవారు వానలో తడవకుండా జాగ్రత్తపడాలి. లేదంటే నిమోనియా, జలుబు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.
వైద్యుల సలహా తప్పనిసరి:
జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఫ్రిజ్ లేకుండానే టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా?
ఈ తేదీల్లో పుట్టినవారిది రాజసమైన వ్యక్తిత్వం..!