వంటగదిలో గంటల తరబడి నిలబడి పని చేస్తున్నారా? డేంజర్లో పడినట్లే..
ABN , Publish Date - Oct 25 , 2026 | 08:35 AM
దాదాపుగా ప్రతి ఇంట్లో గృహిణులు వంటగదిలో అధిక సమయం గడుపుతారు. వంట చేయడం నుంచి గిన్నెలు శుభ్రం చేయడం వరకు.. ప్రతీదీ గ్యాస్ స్టవ్ వద్దే గంటల తరబడి నిలబడి పని చేయాల్సి ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: దాదాపుగా ప్రతి ఇంట్లో గృహిణులు వంటగదిలో అధిక సమయం గడుపుతారు. వంట చేయడం నుంచి గిన్నెలు శుభ్రం చేయడం వరకు.. ప్రతీదీ గ్యాస్ స్టవ్ వద్దే గంటల తరబడి నిలబడి పని చేయాల్సి ఉంటుంది. దీంతో కాళ్ళు బరువుగా అనిపిస్తాయి. పాదాలు నొప్పిగా ఉంటాయి. చీలమండలు వాస్తాయి. చాలా మంది మహిళలు రోజంతా చేసిన పని వల్ల కలిగే అలసటగా భావించి దీనిని నిర్లక్ష్యం చేస్తారు.
ఈ నొప్పిని తగ్గించుకునేందుకు రాత్రి వేళల్లో ఏదైనా బామ్ రాసుకుంటారు లేదా కాళ్ళకు కొబ్బరి నూనె రాస్తారు. ఇలా చేయడం వల్ల ఉదయం వరకు బాగానే ఉంటుంది. మళ్లీ సమస్య ప్రారంభమవుతుంది. అయితే వారి కాళ్ళులోని సిరలు వాచి, నీలం లేదా ఊదా రంగులోకి మారుతాయి. కాళ్ళ వాపు ఉంటే దానిని అలసటగా భావించి పొరపాటు చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి వెరికోస్ వీన్స్ లక్షణాలు కావచ్చని హెచ్చరిస్తున్నారు.
కాళ్ళలోని సిరలలో చిన్న కవాటాలు ఉంటాయి. ఇవి రక్తం తిరిగి గుండెకు ప్రవహించడానికి సహాయపడతాయి. ఈ కవాటాలు సరిగ్గా పని చేయనప్పుడు సిరల్లో రక్తం పేరుకుపోవడం మొదలవుతుంది. సిరలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. గంటల తరబడి ఒకే చోట నిలబడినప్పుడు మొత్తం భారం ఈ సిరలపై పడుతుంది. అంతేకాకుండా వాటిపై ఒత్తిడి పెరుగుతుంది. సిరల కవాటాలు సరిగ్గా పనిచేయని వారికి, సిరల్లో రక్తం పేరుకుపోయి.. అవి ఉబ్బి సమస్యలు రావచ్చు.
మొదట్లో కాళ్ళలో కొద్దిగా దురదగా, బరువుగా అనిపిస్తాయి. సాయంత్రానికి చీల మండలు వాస్తాయి. దీనిని మహిళలు సాధారణ నొప్పిగా భావిస్తారు. కానీ సిరలు రంగు మారడం ప్రారంభమైన తర్వాత అసలు సమస్య వస్తుంది. కాళ్ళ చర్మం నల్లగా లేదా గట్టిగా మారవచ్చు. దీనికి సకాలంలో చికిత్స చేయకుంటే పుండ్లు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాళ్ళలో సమస్య అకస్మాత్తుగా ప్రారంభమైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా అధికంగా నిలబడడం వల్ల.. చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
వంటగదిలో గంటల పాటు నిలబడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఉల్లిపాయలు, టమాటాలు తరిగేటప్పుడు, చపాతీ కోసం పిండి లాంటి కలిపేటప్పుడు.. ఓ ఎత్తైన స్టూల్‌పై కూర్చుని ఈ పనుల చేయాలి.
ప్రతి అరగంటకు రెండు నిమిషాలు కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల నరాలపై ఒత్తిడి పెరగదు.
కాలి వేళ్లపై లేవండి..
కూర్చుని పైకి లేచేటప్పుడు.. కాలి వేళ్లపై లేవాలి. ఆ తర్వాత మడాలను కిందకి దించాలి. ఇలా చేయడం వల్ల పిక్క కండరాలు చురుకుగా ఉంటాయి. ఈ సున్నితమైన ప్రక్రియ.. రక్త ప్రసరణకు సహాయపడుతుంది.
రాత్రి నిద్ర పోయేటప్పుడు..
మీ పాదల కింద రెండు దిండ్లు పెట్టుకోవాలి. ఇది చాతీ కంటే కొద్దిగా ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. అందువల్ల కాళ్లవాపుతోపాటు బరువు నుంచి ఉపశమనం లభిస్తుంది.
కంప్రెషన్ స్టాకింగ్స్..
వెరికోస్ వీన్స్ వల్ల ఇబ్బంది పడుతున్న వారిని కంప్రెషన్ స్టాకింగ్స్ ధరించమని సూచిస్తున్నారు. ఇది కాళ్లపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అసౌకర్యం తగ్గుతుంది.