ఇంట్లో మిగిలిపోయిన మందులను ఇలా పారేస్తున్నారా? ఈ ప్రమాదాలు తప్పవు.!
ABN , Publish Date - Sep 09 , 2026 | 03:33 PM
ఇంట్లో మిగిలిపోయిన మందులు గడువు ముగిసిన తర్వాత వాటిని ఏం చేయాలో చాలామందికి తెలియదు. సాధారణంగా చెత్తలో వేస్తుంటారు. ఇలా పడేయడం వల్ల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి కూడా నష్టం కలిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంట్లో అనారోగ్యం కోసం కొనుగోలు చేసిన మందులు చికిత్స పూర్తయ్యాక మిగిలిపోతుంటాయి. కొంతకాలానికి వాటి గడువు కూడా ముగిసిపోతుంది. ఇలాంటి మందులను చాలామంది సాధారణంగా చెత్తలో పడేస్తారు. అయితే ఇలా చేయడం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం కలగవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గడువు ముగిసిన మందులను నేరుగా చెత్తలో పడేయడం వల్ల.. వర్షపు నీటి ద్వారా వాటిలోని రసాయనాలు నేలలోకి, భూగర్భ జలాల్లోకి, నదుల్లోకి చేరే అవకాశం ఉంది. దీంతో నీరు కలుషితం కావడమే కాకుండా జలచరాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా యాంటీబయాటిక్ మందుల అవశేషాలు పర్యావరణంలోకి చేరితే.. బ్యాక్టీరియాపై ఆ మందులు పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. దీనినే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు. గడువు ముగిసిన మందులను సింక్‌లో, మురుగు కాలువలో లేదా టాయిలెట్‌లో వేయడం కూడా మంచిది కాదు. అలాగే వాటిని బయట కాల్చడం కూడా సురక్షితం కాదు. వీలైనంత వరకు గడువు ముగిసిన లేదా ఇక అవసరం లేని మందులను ఫార్మసీలు, ఆసుపత్రులు లేదా మందుల సేకరణ కేంద్రాల్లో అప్పగించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అలాంటి మందుల సేకరణ కేంద్రం అందుబాటులో లేకపోతే, సాధారణ మాత్రలు, క్యాప్సూల్స్‌ను నలిపి మట్టి లేదా వాడిన కాఫీ పొడి వంటి వాటితో కలిపి ఒక సంచిలో వేసి పాడేయవచ్చు. అలాగే మందుల ప్యాకెట్లపై ఉన్న పేరు వంటి వివరాలను తొలగించడం కూడా మంచిది. సూదులు, సిరంజిలను సాధారణ చెత్తలో వేయకుండా ప్రత్యేక షార్ప్స్ కంటైనర్‌లో వేయాలి. క్యాన్సర్ మందులు, ఇంజెక్షన్లు, ఓపియాయిడ్లు వంటి అధిక ప్రమాదకర మందులను తప్పనిసరిగా ఆసుపత్రి లేదా ఫార్మసీకి తిరిగి ఇవ్వడం సురక్షితమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
గ్యాస్, గుండెపోటు మధ్య తేడా ఏంటి? ఈ విషయాలు తెలుసుకోండి
నిద్రలో చెమటలు పడుతున్నాయా? కారణం ఇదే కావచ్చు!