నేషనల్ ఎడ్యుకేషన్ డే: భారత విద్యావ్యవస్థకు మౌలానా ఆజాద్ అందించిన సేవలివే!
ABN , Publish Date - Nov 11 , 2026 | 10:58 AM
భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నేడు. ఆయన విద్యారంగానికి ఎన్నో సేవలు అందించారు.
ఇంటర్నెట్ డెస్క్: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని భారత్లో ప్రతి సంవత్సరమూ నవంబరు 11న మనం నేషనల్ ఎడ్యుకేషన్ డే జరుపుకొంటాం. ఆయన విద్యారంగానికి అందించిన సేవలను గుర్తుచేసుకుంటాం. భారత్కు మొట్టమొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా మౌలానా ఆజాద్ వ్యవహరించిన విషయం తెలిసిందే. 1947 నుంచి 1958 వరకు ఆయన భారతావనికి విశేష సేవలు అందించారు. పాఠశాల విద్యను బలోపేతం చేశారు. విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కృషి చేశారు. శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించారు. స్త్రీ విద్య కోసం పరితపించారు.
చిన్నారులకు ఉచిత విద్య
ఆర్థిక, సామాజిక భేదాలతో సంబంధం లేకుండా విద్య చిన్నారులందరికీ అందాలని మౌలానా ఆజాద్ భావించారు. అలాగే 14 ఏళ్ల వరకు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా విద్యను అభ్యసించాలని బలంగా నమ్మేవారు. ఇందుకోసం ప్రాథమిక స్థాయి పాఠశాలల సంఖ్యను పెంచటానికి ఆయన అన్ని విధాలా ప్రయత్నించారు.
స్త్రీ విద్య
చదువు విషయంలో పురుషులకు ఎన్ని అవకాశాలున్నాయో.. స్త్రీలకూ అన్ని అవకాశాలు ఉండాలని మౌలానా ఆజాద్ ఆశించారు. పాఠశాలల్లో, కళాశాలల్లో మహిళలు చేరాలని ఆయన ఆరాటపడేవారు. సమాజం అభివృద్ధి చెందాలంటే స్త్రీలకు విద్య అందాలని నమ్మేవారు.
ఉన్నత చదువులకు పెద్దపీట
భారత్లో పారిశ్రామిక రంగాలు అభివృద్ధి కావాలంటే బలమైన విద్యాసంస్థలు అవసరమని మౌలానా ఆజాద్ అర్థం చేసుకున్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఐఐటీ ఖరగ్పూర్ స్థాపన జరిగింది. ఇదే భారత్లో మొదటి ఐఐటీ. అలా మౌలానా ఆజాద్ ఉన్నత చదువులకు పెద్దపీట వేశారు.
యూజీసీ ఏర్పాటు
భారతదేశంలోని ఉన్నత విద్యా ప్రమాణాలను పర్యవేక్షించటంలో విశ్వవిద్యాలయాలను సమన్వయం చేయటంలో, వాటికి నిధులు సమకూర్చటంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంస్థను మౌలానా ఆజాద్ 1953, డిసెంబరు 28న ప్రారంభించారు. 1956లో ఇది చట్టబద్ధ సంస్థగా మారింది.
ఈ వార్తలూ చదవండి
సోనియాగాంధీ ఆత్మకథలో మూడు తప్పులు.. తేదీల్లో పొరపాట్లు
30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!