Share News

విజేత వ్యూహం

ABN , Publish Date - May 25 , 2026 | 05:36 AM

రోజూ అయిదు ప్రశ్నలకు సమాధానాలు రాసేవాడిని సివిల్స్‌ మెయిన్స్‌ ప్రిపరేషన్‌ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌లో మొదటి అంకమైన ప్రిలిమ్స్‌ నిన్న ముగిసింది. రెండో దశ మెయిన్స్‌...

విజేత వ్యూహం

రోజూ అయిదు ప్రశ్నలకు సమాధానాలు రాసేవాడిని సివిల్స్‌ మెయిన్స్‌ ప్రిపరేషన్‌ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌లో మొదటి అంకమైన ప్రిలిమ్స్‌ నిన్న ముగిసింది. రెండో దశ మెయిన్స్‌. దీనికి ఎంపిక అవుతామని భావించే అభ్యర్థులు ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్‌ మొదలుపెట్టాలని అనుభవజ్ఞులు చెబుతుంటారు. దరిమిలా ఇటీవల విడుదలైన ఫలితాల్లో 23వ ర్యాంక్‌ సాధించిన జీను శ్రీ జశ్వంత్‌ చంద్ర తన ప్రిపరేషన్‌ వ్యూహాన్ని వివరించారు.

ఆరో ప్రయత్నంలో ఐఏఎ్‌సకు ఎంపికయ్యాను. ఒకటోది మినహా తదుపరి ప్రతి యత్నంలోనూ ఏదో ఒక సర్వీస్‌ వచ్చింది. అందువల్లే నేను ఎన్నడూ నిరాశపడ లేదు. ఓటమి ఎదురైన ప్రతిసారి చేసిన తప్పిదాలు గుర్తుకువచ్చేవి. వాటిని సవరించుకుని, మరింత మెరుగ్గా కష్టపడితే కోరుకున్న సర్వీసు వస్తుందన్న విశ్వాసం కలిగేది.

  • సిలబస్‌ యావత్తు పూర్తి చేసిన తరవాత మాక్‌ టెస్టులు రాయడం కొందరి ఎత్తుగడ. అయితే నేను కంప్లీట్‌ చేసిన పరిధిలో అడిగే ప్రశ్నలకు జవాబులు రాసేవాడిని. అంతా పూర్తికావడం, అంతా కలిపి రాస్తామనుకోవడం మంచిది కాదనిపించేది. రోజుకు కనీసం అయిదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్న నిబంధన పెట్టుకునేవాడిని. అలా ఎప్పటిది అప్పుడు పూర్తి చేసేవాడిని. సిలబ్‌సను పూర్తిచేసిన తరవాత ఆ పేపర్‌కు సంబంధించి వారానికి ఒక ఫుల్‌ మాక్‌ టెస్ట్‌ రాసేవాడిని.

  • టాపర్ల కాపీలు గూగుల్‌లో లభిస్తాయి. టెలిగ్రామ్‌ చానల్‌లో టాపర్ల వ్యూహాలను తెలుసుకోవచ్చు. వాటితో సరి చూసుకుంటే, మన లోపాలు అర్థమవుతాయి. ఏవి విడిచిపెట్టామో, కలుపుకోవాలో, అసలు మరేవి వదిలేయాలో కూడా తెలుస్తుంది. మన సమాధానాన్ని ఎలా మెరుగుపర్చుకోవాలో కూడా అర్థమవుతుంది.

  • నా ఆప్షనల్‌ సబ్జెక్టు కెమిస్ట్రీ. ఇంటర్‌లో అది నా సబ్జెక్టు. నాకు ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌పై గట్టిపట్టు ఉంది. అంతకుమించి అందులో ఆసక్తి ఉంది. ఇది స్కోరింగ్‌ సబ్జెక్టుల్లో ఒకటి. అందుకే కెమిస్ట్రీని ఆప్షనల్‌ పేపర్‌గా ఎంచుకున్నాను. ఇక్కడ మన బలమే ముఖ్యం. ఎవ్వర్నీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం, చివరి యత్నంలో కూడా జనరల్‌ స్టడీ ్‌సలో నా శక్తియుక్తులు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని గ్రహించాను. అంతకు మించి చేయగలిగింది లేదని భావించాను. ఆ సమయంలో కెమిస్ట్రీలోనే మార్కులు పెంచుకోవచ్చన్న అభిప్రాయం కలిగింది. ఆ దిశగా యత్నించి విజయం సాధించాను.

  • జనరల్‌ స్టడీస్‌ నుంచి ఆప్షనల్‌ సబ్జెక్టు వరకు సమాధానాలు రాసేటప్పుడు కొందరు గణాంకాలను జోడిస్తారు. మరికొందరు కీవర్డ్స్‌ గుర్తుపెట్టుకుని రాస్తారు. ఇందులో ఎవరి స్టయిల్‌ వారిది. నేను గణాంకాలను కలుపుకొంటూ రాసేవాడిని. ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకుని రాయనిపక్షంలో మార్కులు గణనీయంగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా గడచిన రెండేళ్ళలో ఇది బాగా కనిపించింది కూడా.


  • రెండు వ్యాసాలు రాయాలి. ఇక్కడ ఎంపిక జాగ్రత్తగా ఉండాలి. ప్రశ్నలో కొన్ని పదాలు అర్థం కాకున్నా, అసలు సబ్జెక్టు తెలుసుకదా అని అటెంప్ట్‌ చేయకూడదు. చేతులారా మార్కులు పోగొట్టుకుంటాం. సందేహం తలెత్తితే, దాన్ని పక్కన పెట్టేయడమే మంచిది. ప్రశ్నను బాగా అర్థం చేసుకుని అందుకు తగ్గట్టు వ్యాసానికి ఒక రూపకల్పన చేసుకుని రాస్తే మంచి మార్కులు వస్తాయని నేను నమ్మాను. అదే చేశాను.

  • మెయిన్స్‌కు సంబంధించి ప్రిపరేషన్‌ ఒక ఎత్తు, పరీక్ష రోజున వాటిని కాగితంపై పెట్టడం మరొక ఎత్తు. నిజానికి మొత్తం సిలబస్‌ను కవర్‌ చేయాలి. అలాగని లోతుగా అవసరం లేదు. సిలబ్‌సలోని ప్రతి అంశం ముఖ్యమే. అడిగిన ప్రశ్నకు సంబంధించి అన్ని కోణాలను మన సమాధానంలో స్పృశించాలి. ఆ మేరకు అవగాహన ఉంటే సరిపోతుంది.

  • పది మార్కుల ప్రశ్నకు ఏడు నిమిషాలు, పదిహేను మార్కుల ప్రశ్నకు పది నిమిషాలు కేటాయించుకుని మరీ రాసేవాడిని. ప్రతి ప్రశ్నకు సమాధానం రాసిన తరవాత టైమ్‌ ఒక సారి చెక్‌ చేసుకోవడం మంచిది. అందుకే ప్రిపరేషన్‌ ఆరంభం నుంచి రైటింగ్‌ ప్రాక్టీస్‌ని సమయపాలనతో జోడించి చేయాలి.

  • నేను ప్రత్యేకించి నోట్స్‌ రాసేవాడిని కాదు. చదువుతున్న మెటీరియల్‌లోనే ముఖ్యమైన పాయింట్స్‌ను అండర్‌లైన్‌ చేసుకునేవాడిని. అలా రివిజన్‌ చేయడం కొద్దిగా కష్టం. అయితే ఆ లైన్స్‌ చూసుకుంటే మొత్తం జవాబు నాకు గుర్తుకు వచ్చేది.

  • సందేహ నివృత్తి ఈ రోజుల్లో చాలా సులువు. గూగుల్‌ నుంచి చాట్‌ జీపీటీ, జెమిని తదితర సౌలభ్యాలు ఉన్నాయి. ఒక్కసారి వాటిలో ఏదైనా చూసుకుంటే చాలు సందేహం పటాపంచలవుతుంది.

  • ఇంతకమునుపు సంవత్సరాల్లో అడిగిన ప్రశ్నపత్రాలతో ప్రయోజనాలే ఎక్కువ. అసలు ఎలా ప్రశ్నిస్తున్నారు నుంచి ఏయే ప్రశ్నలు రిపీట్‌ ఎలా అవుతున్నాయో అర్థం చేసుకోవడానికి వీలు ఉంటుంది. ప్రిపరేషన్‌ను మెరుగుపర్చుకునేందుకు అవి చాలా ఉపయోగపడతాయి.

  • రివిజన్‌లో బ్రెయిన్‌ స్టార్మింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చేవాడిని. ప్రశ్నకు తగ్గట్టు జవాబు రూపకల్పన, ఆపై రాసేందుకు ఈ ప్రక్రియ నాకు బాగా ఉపయోగపడింది.


ఎథిక్స్‌ విషయానికి వస్తే ఒరిజినాలిటీ, ఇన్నోవేషన్‌ ప్రతిబింబించాలి. ఉదాహరణలు వేర్వేరుగా ఉండేలా చూసుకున్నాను. అంటే ఒకే ప్రశ్నకు సమాధానంలో భాగంగా ఉదాహరణలను పురాణాల నుంచి ఒకటి, క్రీడల నుంచి ఇంకొకటి, స్వాతంత్య్ర ఉద్యమం నుంచి మరొకటి అలా వేర్వేరుగా తీసుకుని రాసేవాడిని. ఎథిక్స్‌లో కీవర్డ్స్‌ ముఖ్యం. నిజానికి ఈ పేపర్‌ను జనరల్‌గా రాయవచ్చు. అలా రాస్తే మంచి స్కోర్‌ సాధిండం కష్టం. ప్రతి మార్కు ర్యాంక్‌ ఆపై సర్వీ్‌సకు దోహదపడుతుందన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో అరుదైన ఫీట్.. కోహ్లీ, సెహ్వాగ్ సరసన శ్రేయస్ అయ్యర్

ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. పంజాబ్ ఓపెనర్ అరుదైన ఘనత

Updated Date - May 25 , 2026 | 05:36 AM