క్యాట్: ఈ తప్పులు చేయవద్దు
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:23 AM
సుప్రసిద్ధ మేనేజ్‌మెంట్ కళాశాలల్లో ప్రవేశానికి ఉద్దేశించిన క్యాట్(కామన్ అడ్మిషన్ టెస్ట్)ని ఆప్టిట్యూడ్ పరీక్షగా అభివర్ణిస్తారు. అయితే ఒక్క తెలివితేటలతోనే ఇందులో నెగ్గుకురాలేమన్నది ఒక వాస్తవం
సుప్రసిద్ధ మేనేజ్‌మెంట్ కళాశాలల్లో ప్రవేశానికి ఉద్దేశించిన క్యాట్(కామన్ అడ్మిషన్ టెస్ట్)ని ఆప్టిట్యూడ్ పరీక్షగా అభివర్ణిస్తారు. అయితే ఒక్క తెలివితేటలతోనే ఇందులో నెగ్గుకురాలేమన్నది ఒక వాస్తవం. సరైన వ్యూహం క్రమశిక్షణ, డెసిషన్ మేకింగ్, కచ్చితత్వం, ఉద్వేగ నియంత్రణ కలగలిస్తేనే విజయం సొంతమవుతుందని భువనేశ్వర్‌లోని జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌కు చెందిన చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ కల్పనా సాహు చెబుతున్నారు. ఈ పరీక్షకు సంబంధించి అందరూ చేసే కొన్ని సాధారణ తప్పిదాలను నివారించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆమె తెలిపారు. ముఖ్యంగా...
ఈ టెస్ట్‌లో మూడు విభాగాలు - వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్(వీఏఆర్‌సీ), డేటా ఇంట్రప్రెటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్(డీఐఎల్‌ఆర్), క్వాంటిటేటివ్ ఎబిలిటీ(క్యుఏ) ఉంటాయి. ప్రతి విభాగానికి నిర్దేశిత కాలపరిమితి కూడా ఉంటుంది. అయితే ఈ మూడింటిని సాల్వ్ చేసే క్రమంలో అభ్యర్థులు కొన్ని తప్పిదాలను చేస్తూ ఉంటారు.
అభ్యర్థుల్లో చాలా మంది తమ బలాలు, బలహీనతలను మొదట అంచనా వేసుకోకుండా క్యాట్‌కు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను సేకరిస్తారు. బుక్స్‌లోని ప్రాబ్లెమ్స్‌ను సాల్వ్ చేస్తుంటారు. లెక్చర్లు వింటారు. ఇదే చివరకు అసమర్థ ప్రిపరేషన్‌గా పరిణమిస్తుంది. ఆరంభలోనే క్యాట్ మాక్ టెస్ట్‌కు హాజరైతే అభ్యర్థి ఎదుర్కొంటున్న సమస్యలు బైటపడతాయి. కాన్సెప్ట్‌ను అవగాహన చేసుకోవడం నుంచి వేగం, కచ్చితత్వం, ప్రశ్నల ఎంపిక వరకు లోపం ఎక్కడ అన్నది తెలుస్తుంది. ర్యాండమ్‌గా కాకుండా, ఒక అంచనాకు ముందే వచ్చి లోపాలను సవరించుకునే విధంగా ప్రాక్టీస్‌ను అవలంభిస్తే మంచిది.
తాము మెరుగ్గా ఉన్న అంటే క్వాంటిటేటివ్ ఎబిలిటీపై పట్టు ఉన్న అభ్యర్థి మ్యాథ్స్ ప్రాబ్లెమ్స్‌ను సాల్వ్ చేస్తూ కూర్చుంటాడు. రీడింగ్ సౌకర్యం అనిపించిన అభ్యర్థి క్వాంటిటేటివ్ ఎబిలిటీని నిర్లక్ష్యం చేస్తాడు. ప్రిపరేషన్‌లో ఇదే అన్నింటికన్నా ప్రమాదకరం. క్యాట్‌లో సాధించిన గ్రాడ్ పర్సంటైల్ ఒక్కటే కాదు, సెక్షనల్ పర్ఫార్మెన్స్ కూడా ముఖ్యమే. అహ్మదాబాద్ ఐఐఎంనే తీసుకుంటే గ్రాండ్‌కు తోడు సెక్షనల్ పర్ఫార్మెన్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది.
ఇరవై నుంచి ముప్పయ్ మాక్ టెస్టులు రాశామని కొందరు అభ్యర్థులు గర్వంగా చెబుతూ ఉంటారు. వాటినుంచి ఏమీ నేర్చుకోని పక్షంలో అన్ని రాసి ప్రయోజనం ఉండదు. మాక్ టెస్ట్ అంటే అదో డయాగ్నిస్టిక్ లేబరేటరీ. లోపాలను గుర్తించేందుకు ఉపయోగపడే సాధనం. దాన్నుంచి నేర్చుకోవాలి. అందులో భాగంగా అభ్యర్థి కొన్ని తనకు తాను ప్రశ్నించుకోవాలి. ఏ ప్రశ్నలకు సంబంధించి తప్పు జరిగింది, కాన్సెప్ట్ విషయంలో ఎక్కడ ఏమి చోటుచేసుకుంది, నిర్లక్ష్యంతో జరిగినవేమిటి, సమయం వృథా, ప్రశ్నలు లేదా సెట్స్ ఎంపిక ఎలా చేశాం సహా అన్నీ తెలుసుకోగలగాలి. మాక్ టెస్టుల్లో సాధించిన మార్కులను లెక్కించుకోవడం కంటే పర్ఫార్మెన్స్‌ను మెరుగుపర్చుకునేందుకు సంబంధిత విశ్లేషణ ఉపయోగపడితే మంచిది.
నేనిది కచ్చితంగా చేయగలను అని దృడంగా నమ్మడం వరకు ఓకే. అయితే దానిపై ఎక్కువ సమయాన్ని వృథా చేయడం మాత్రం అతి పెద్ద ట్రాప్. పట్టుదలకు కాదు, సరైన ప్రశ్నలను ఎంపికతోనే క్యాట్‌లో ప్రయోజనం లభిస్తుంది. ఒక ప్రాబ్లెమ్ సాల్వింగ్ కోసం తీసుకునే నాలుగు నిమిషాల్లో సులువైన వాటిని రెంటిని పరిష్కరించవచ్చు. సరైన సమయంలో కఠినమైన ప్రశ్నను వదిలిపెట్టడంలోనే కాంపిటేటివ్ స్కిల్ బైటపడుతుంది. ప్రశ్నతో యుద్ధం చేయకు, పేపర్‌ను మేనేజ్ చేయడం నేర్చుకో అన్నది ఉపయోగపడే సూత్రం.
సవాలు విసిరే విభాగం డిఐఎల్‌ఆర్. ప్రాబ్లెమ్‌ను సాల్వ్ చేయడం ఒక ఎత్తు. అంటె్‌ప్టకు సరైన సెట్స్‌ను కనుగొనడం మరొక ఎత్తు. పైకి ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ సంక్లిష్టంగా ఉండే ఒక సెట్‌పై అధిక సమయాన్ని కేటాయిస్తే అది ఈ విభాగం మొత్తాన్నే దెబ్బతీయచ్చు. ప్రతి సెట్‌నూ చేస్తూ కూర్చోకూడదు. ఈ విషయంలో స్కానింగ్, ఎంపిక, సెట్ ప్రయారిటీ వంటివి సరైన ప్రాక్టీస్‌తోనే లభిస్తుంది.
వ్యాకరణ నిబంధనలు ఒక్కటీ తెలిస్తే వీఏఆర్‌సీలో గట్టెక్కవచ్చన్నది భ్రమ. రీడింగ్ కాంప్రహెన్షన్‌లో పాసేజ్‌కు సంబంధించి వాదనలు, ధోరణి, అనుమితి, నిర్మాణం తెలియాలి. మాక్ టెస్టులు రాయడం మొదలుపెట్టిన తరవాత కొందరు చదవడాన్ని ఆపేస్తారు. సరిగ్గా గమనిస్తే ఆ వెంటనే కాంప్రహెన్షన్‌లో వేగం తగ్గుతుంది. భిన్నమైన, అత్యున్నత నాణ్యత కలిగిన మెటీరియల్‌ను చదువుతూ ఉంటే కాంప్రెహెన్షన్ విషయంలో పర్ఫార్మెన్స్ మెరుగుపడుతుంది, ఆత్మవిశ్వాసం సైతం పెరుగుతుంది.
కొత్తవి నేర్చుకునే క్రమంలో పాత వాటిని రివైజ్ చేసుకోవడం నిర్లక్ష్యం మరో తప్పిదం. ఫార్ములాలు, షార్ట్‌కట్స్, ప్రాబ్లెమ్ సాల్వింగ్ అప్రోచ్ వంటివి చాలా సులువుగా మర్చిపోతుంటాం. దీనికోసం ఎర్రర్ అండ్ రివిజన్ బుక్‌ను మెయింటైన్ చేయాలి. తరుచూ చేసే తప్పిదాలను అందులో నోట్ చేసుకోవాలి. వాటిని పునశ్చరణ చేసుకోవాలి. అంతేతప్ప చేసిన తప్పులనే మళ్ళీ మళ్ళీ చేయకూడదు.
ఎక్కువ యత్నాలతో ఆటోమేటిక్‌గా హయ్యర్ పర్సంటైల్ లభిస్తుందని అర్థం కానేకాదు. కచ్చితత్వాన్ని విస్మరించి, గుడ్డిగా ఊహించి సమాధానాలను గుర్తించడం, సులువైన ప్రశ్నలను కూడా తొందరపాటుతో పోగొట్టుకోవడం, వ్యక్తిగత సామర్థ్యానికి మించిన ప్రశ్నలను అటెంప్ట్ చేయడంతో స్కోర్ తగ్గుతుందని గ్రహించాలి.
కొన్ని నెలలుగా ఒక అప్రోచ్‌లో ఉండి, ఉన్నట్టుండి ఆ ధోరణిని మార్చుకోవడం మంచిది కాదు. అలా చేస్తే మెరుగుదలకు బదులు అయోమయం నెలకొంటుంది. మాక్ అనేది తుది తీర్పు కాదు, రిహార్సల్ మాత్రమే. మాక్ టెస్టుల్లో సాధించే స్కోరుల్లో ఎగుడుదిగుడులు ఉంటాయి. భావోద్వేగాలను సంతృప్తిపర్చే స్కోరుల కంటే కచ్చితత్వం, ప్రశ్నల ఎంపిక, టైమ్ మేనేజ్‌మెంట్‌లో మెరుగుదల కోసం అభ్యర్థులు కృషి చేయాలి.
అన్నింటికీ మించి ఆరోగ్యం చాలా ముఖ్యం. నిద్రించే సమయం తగ్గకూడదు. స్ర్కీన్ టైమ్ ఎక్కువ సేపు మంచిది కాదు. అలసటతో కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది. అది డెసిషన్ మేకింగ్‌పై ప్రభావం చూపుతుంది. రివిజన్, రియలిస్టిక్ మాక్స్, సరైన నిద్ర, పౌష్టికాహారం, భావోద్వేగపరంగా స్థిరత్వం మంచిది. బెంబేలెత్తడంతో ఎలాంటి ప్రయోజనం ఉండదు.
ప్రాబ్లెమ్ సాల్వింగ్ ఒక్కటే క్యాట్ ఎన్నటికీ కాదు. సరైన ప్రశ్నలను, సరైన సమయంలో అత్యంత కచ్చితత్వంతో పరిష్కరించడమే క్యాట్. అభ్యర్థులు తమ బలహీనతలను తామే గుర్తించాలి. తప్పులను కూలంకుషంగా విశ్లేషించుకోగలగాలి. టైమ్ మేనేజ్‌మెంట్‌ను తెలుసుకోవాలి. పరీక్ష సమయంలో ప్రశాంతంగా ఉండటాన్ని అలవర్చుకోవాలి. గంటలకొద్దీ చదవడంలో ఏమంత గొప్పదనం ఉండదు. తప్పులు పదేపదే దొర్లకుండా చూసుకోవడంలోనే క్యాట్ జర్నీలో సంతోషం మిగులు తుంది. ఫలితమూ దానంతట అదే లభిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలు.. ఎన్డీయే నేతల తీవ్ర ఆగ్రహం