Share News

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ సిలబస్సే సరిహద్దు

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:42 AM

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎపీపీఎస్సీ) గ్రూప్‌ 1 డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. సంబంధిత సన్నాహాలు జోరందుకున్నందున అభ్యర్థులు ప్రిపరేషన్‌కు పదనుపెట్టాలి. పరీక్ష తేదీలతో నిమిత్తం లేకుండా...

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ సిలబస్సే సరిహద్దు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎపీపీఎస్సీ) గ్రూప్‌ 1 డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. సంబంధిత సన్నాహాలు జోరందుకున్నందున అభ్యర్థులు ప్రిపరేషన్‌కు పదనుపెట్టాలి. పరీక్ష తేదీలతో నిమిత్తం లేకుండా ఈ ప్రక్రియను నిరంతరంగా కొనసాగించాలి. ఈ నేపథ్యంలో గ్రూప్‌ 1 విజేత, పోటీ పరీక్షల కోసం ఉద్దేశించిన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పుస్తక రచయిత డి. మల్లీశ్వరి రెడ్డి అందించిన ప్రిపరేషన్‌ టిప్స్‌ను ఒకసారి పరిశీలిద్దాం.

గ్రూప్‌ 1లో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ అనే మూడు దశలు ఉంటాయి. అన్నింటికన్నా ముందు ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ సిలబ్‌సను ఆసాంతం అర్థం చేసుకోవాలి. వాటిలో ఉన్న సబ్జెక్టులు, ఒక్కోదానికి ఉన్న వెయిటేజ్‌ అలాగే ఎన్ని పేపర్లు వంటివన్నీ సవివరంగా తెలుసుకోవాలి. ప్రిపరేషన్‌కు సంబంధించి సిలబస్‌ సరైన సరిహద్దని గుర్తుంచుకోవాలి.

  • సిలబస్‌ అర్థమైన వెంటనే ప్రీవియస్‌ ప్రశ్నత్రాలను పరిశీలించాలి. ప్రశ్నలు ప్రిలిమ్స్‌లో ఎలా వచ్చాయి, మెయిన్స్‌లో ఏ విధంగా అడిగారో తెలుసుకోవాలి. ప్రశ్నల స్వభావాన్ని గమనించాలి. ప్రీవియస్‌ ప్రశ్న పత్రాలను ఒకసారి చూసి వదిలేయడం మంచి పద్ధతి కాదు. ప్రిపరేషన్‌ మధ్యలోనూ వాటిని పరిశీలించాలి. అప్పుడే మన ప్రిపరేషన్‌ ఏ విధంగా సాగుతోందో అర్ధమవుతుంది. అడుగుతున్న ప్రశ్నలకు అనుగుణంగా సన్నద్ధం కాకపోతే మన ప్రిపరేషన్‌ పూర్తిగా వృథా. అందుకే ప్రీవియస్‌ క్వశ్చన్‌ పేపర్లను ఒక గైడ్‌గా పరిగణించాలని నిపుణులు తరచూ చెబుతుంటారు.

  • ఇప్పటి పరిస్థితుల్లో ప్రిపరేషన్‌ను హైబ్రిడ్‌ పద్ధతిలో కొనసాగించవచ్చు. టెక్నాలజీని బాగా ఉపయోగించుకోవాలి. అదే సమయంలో ప్రామాణిక పుస్తకాలను మర్చిపోకూడదు. నమ్మదగిన ఆన్‌లైన్‌ సోర్సెస్‌, కరెంట్‌ అఫైర్స్‌, అవసరమైన చోట్ల ఏఐ టూల్స్‌- ఇలా అన్నింటినీ ఉపయోగించుకోవచ్చు. సోర్సులను మార్చుకుంటూ వెళితే అసలు విషయం నుంచి దూరంగా జరిగే ప్రమాదం ఎక్కువ.

  • సిలబస్‌ నుంచి ఒక టాపిక్‌ తీసుకుంటే అది పూర్తి చేశామని కాకుండా అర్థం కావాలనే లక్ష్యంతో చదవాలి. వాటికి సంబంధించి ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో ఉంటే మొదట అవి చదవాలి. మంచి ఆన్‌లైన్‌ సోర్సు ఉంటే తీసుకోవచ్చు.


  • మెయిన్స్‌ ప్రిపరేషన్‌లో షార్ట్‌ రివిజన్‌ నోట్స్‌ బాగా ఉపయోగపడుతుంది. మెయిన్స్‌ పూర్తిగా రాత పరీక్ష. ఒక విషయాన్ని చాలాసార్లు రివైజ్‌ చేయాలి. అలాగే జవాబు రాసేటప్పుడు రీకాల్‌ చేసుకోగలగాలి. అందుకే మొదటిసారి చదివినప్పుడే అతి పెద్దగా నోట్స్‌ తయారు చేసుకోకూడదు. అందుకుబదులు రివిజన్‌ సమయంలో షార్ట్‌ నోట్స్‌ రూపొందించుకోవాలి. ముఖ్యమైన నిర్వచనాలు, కీవర్డ్స్‌, డేటా ఉదాహరణలు, రిపోర్టులు, కరెంట్‌ అఫైర్స్‌, డయాగ్రమ్స్‌ వంటి వాల్యూ ఎడిషన్‌ అంశాలను అందులో పెట్టుకోవాలి.

  • మెయిన్స్‌లో ప్రశ్నకు తగ్గట్టు జవాబు రాయడం ప్రధానం. మనకు ఎంత తెలుసు అన్నది విషయమే కాదు. ఎంత సమర్ధంగా జవాబును ప్రజెంట్‌ చేస్తున్నాం అన్నదానిపైనే దృష్టి కేంద్రీకరించాలి. జవాబును చక్కగా నిర్మించుకోవడం, అవసరమైన చోట డయాగ్రమ్స్‌, ఫ్లో చార్టులు జోడించడం, మంచి ఉదాహరణలు ఇవ్వగలిగితేనే సమాధానం సంపూర్ణమవుతుంది. డేటా లేదా రిపోర్టులను ఉపయోగించడం, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఉదాహరణలను జోడించడం, కరెంట్‌ అఫైర్స్‌ను కలిపి అదనపు విలువను ఆపాదించడం వంటివన్నీ ప్రాక్టీ్‌సతోనే వస్తాయి. అందుకే మెయిన్స్‌కు సంబంధించి ప్రిపరేషన్‌లో భాగంగా చదవడమే కాదు, ఆన్సర్‌ ప్రాక్టీసింగ్‌పై కూడా నిరంతరం ఫోకస్‌ పెట్టాలి.

  • ప్రతి సబ్జెక్టుకు టైమ్‌ కేటాయింపులోనూ కొద్దిపాటి లాజిక్‌ అవసరం. అందుకుగాను సబ్జెక్టుకు ఉన్న పరిధి, వెయిటేజ్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. అందుకు అనుగుణంగా టైమ్‌ కేటాయించుకోవాలి. తక్కువ వెయిటేజ్‌ ఉన్న సబ్జెక్టుకు రెండు నెలలు కేటాయించుకోవడం, ఎక్కువ ఉన్న వాటికి సమయం లేకుండా చేసుకోవడం సరైన పద్ధతి కానేకాదు. సబ్జెక్టుకు ఉండే వెయిటేజ్‌, సిలబ్‌సను అనుసరించి మాత్రమే ప్రిపరేషన్‌ టైమ్‌ ఒకదానికి ఒకటి సరిపోయే నిష్పత్తిలో ఉండాలి.

  • రోజుకు పది గంటలా, పదిహేను గంటలా అనేది ఎన్నడూ పాయింట్‌ కాదు. ఒకటి చదివిన తరవాత అర్థమైందా లేదా అన్నదే పాయింట్‌. ప్రిలిమ్స్‌ లేదంటే మెయిన్స్‌లో ఎక్కడ వచ్చినా సమాధానం ఇవ్వగలమా లేదా అన్నదే అసలు విషయం. రీడింగ్‌లో ఒకొక్కరిది ఒక్కో స్టయిల్‌. సబ్జెక్టుపై పట్టు సాధించే విషయంలోనూ అదే ప్రాతిపదిక అవుతుంది. ప్రిపరేషన్‌లో నిలకడ (కన్సిస్టెన్సీ)ను సాధించడమే ముఖ్యం. మిగతావన్నీ అప్రస్తుతం.

  • మొత్తంగా చూసుకుంటే మన మైండ్‌ ఎప్పుడూ సిలబస్‌, ప్రీవియస్‌ క్వశ్చన్స్‌, సరైన సోర్స్‌, కాన్సెప్ట్యుల్‌ లెర్నింగ్‌, కరెంట్‌ అఫైర్స్‌, రివిజన్‌, ప్రాక్టీస్‌ అన్న సైకిల్‌లోనే ఉండాలి. ఎక్కువ సోర్సుల కంటే సరైన మెటీరియల్‌ను పదేపదే చదవాలి.

  • చాట్‌ జీపీటీ, క్లాడ్‌, ఏఐ టూల్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ముఖ్యమైన కాన్సెప్టులను సరళీకరించుకునేందుకు అదే సమయంలో రెండు భావనలను బేరీజు వేసుకునేందుకు, సందేహా నివృత్తికి, రివిజిన్‌ను పద్ధతిగా రూపొందించుకునేందుకు ఈ టూల్స్‌ ఉపయోగపడతాయి. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్దేశిత వాస్తవాలు, ఉదాహరణలను మిస్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని ఏఐని ప్రధాన సోర్స్‌గా చేసుకోరాదు. ప్రిపరేషన్‌లో సపోర్టింగ్‌ టూల్‌గా మాత్రమే ఉపయోగించుకోవాలి.


  • పరీక్ష ఎప్పుడు అన్న ఊహాగానాలను అస్సలు పట్టించుకోవద్దు. ప్రక్రియ మొదలైనందున, అది ఎప్పుడు అన్న విషయంతో సంబంధం లేకుండా ప్రిపరేషన్‌ను ఆరంభించాలి. సిలబ్‌సను పూర్తి చేయడం, పట్టుసాధించడం, ఎలా అడిగినప్పటికీ సమాధానం గుర్తించేలా, మెయిన్స్‌ అయితే రాసేలా సన్నద్ధం కావడమే మన లక్ష్యం కావాలి. మహా భారతంలో పక్షి కన్నుపైనే అర్జునుడి దృష్టి. అదే మనకూ ఆదర్శం కావాలి. మిగిలినవి అనవసరం.

  • కరెంట్‌ అఫైర్స్‌ను ప్రత్యేక సబ్జెక్టుగా చూడకూడదు. ప్రిలిమ్స్‌లో దీనికి ప్రత్యేక వెయిటేజ్‌ ఉంటుంది. ఎస్సేలో సమకాలీన అంశంగా ఉంటుంది. పాలిటీ, ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్‌, జాగ్రఫీ.... ఇలా ప్రతి సబ్జెక్టులోనూ కరెంట్‌ అఫైర్స్‌ను లింకప్‌ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో కరెంట్‌ అఫైర్స్‌ నుంచి నేరుగా ప్రశ్నలు రావచ్చు. ఒక స్టాటిక్‌(మార్పులు లేని) ప్రశ్నకు కరెంట్‌ ఇష్యూ నేపథ్యం కూడా కావచ్చు. మెయిన్స్‌ ఆన్సర్‌కు ఉదాహరణ లేదంటే వాల్యూ అడిషన్‌గా ఉపయోగపడవచ్చు. అందుకే కరెంట్‌ అఫైర్స్‌ను స్టాటిక్‌ సబ్జెక్టులతో కలిపి చదువుకోవడాన్ని అలవర్చుకోవాలి.

  • ఒక ప్రణాళిక, అంతకుమించి తర్కం, నిలకడగా తదేక దృష్టితో ప్రాక్టీస్‌ కొనసాగిస్తే తప్పకుండా విజయం సాధించవచ్చని అభ్యర్థులు గ్రహించాలి.

ఈ వార్తలూ చదవండి

పాక్ హనీట్రాప్‌లో భారత నేవీ ఉద్యోగి.. రక్షణ రహస్యాల లీక్ ఆరోపణలపై అరెస్ట్

క్షణాల్లో ఘోరం.. 100 మీటర్ల లోయలో పడ్డ కారు!

Updated Date - Oct 05 , 2026 | 05:42 AM