మినీ కవితకు నెలనెలా వెన్నెల
ABN , Publish Date - Oct 16 , 2026 | 03:15 AM
కొల్లూరి సూర్యనారాయణమూర్తి ‘ఎక్స్రే కొల్లూరి’గా సాహిత్య లోకానికి చిరపరిచితులు. ఆయన ప్రాథమికంగా కవి. కొల్లూరి రాసిన పడగ కింద పసితనం, స్త్రీ దీర్ఘకావ్యాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి....
కొల్లూరి సూర్యనారాయణమూర్తి ‘ఎక్స్రే కొల్లూరి’గా సాహిత్య లోకానికి చిరపరిచితులు. ఆయన ప్రాథమికంగా కవి. కొల్లూరి రాసిన పడగ కింద పసితనం, స్త్రీ దీర్ఘకావ్యాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. అమలాపురం కేంద్రంగా ఎక్స్రే సాహిత్య పత్రికను స్థాపించి, ఎందరో ప్రవర్ధమాన కవులను ప్రోత్సహించారు. ఎక్స్రే కవితల పోటీ నిర్వహించి ఏటా బహుమతులిచ్చేవారు. ఆ బహుమతులు గెలుచుకున్న ఎందరో ఇప్పుడు కవులుగా లబ్ధప్రతిష్ఠులయ్యారు. మిత్రులతో కలిసి సమతా రచయితల సంఘం స్థాపించి ఏటా ఒక ఉత్తమ కవితా సంపుటికి సరసం అవార్డు ఇచ్చేవారు. అలా నా తొలి కవితా సంపుటి ‘మువ్వల చేతికర్ర’ 1987లో తొలి అవార్డును అందుకుంది. సరసం తరఫున ‘సమతా జ్యోతులు’ కవితా సంకలనం వెలువరించారు. మినీ కవిత్వం ఉద్యమ రూపం దాల్చడానికి ‘ఎక్స్రే’ ఎంతో దోహదం చేసింది. సినారె లాంటి కవులు సైతం మినీ కవిత్వం పట్ల ఆకర్షితులయ్యారు. అలిశెట్టి ప్రభాకర్ను తెలంగాణ నుంచి అమలాపురానికి ఆహ్వానించి, ఆయన చిత్రాలతో మినీ కవితా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఎక్స్రేలో సాహిత్య చర్చలు, వాదోపవాదాలు విరివిగా సాగేవి. అద్దేపల్లి, గోదావరి శర్మ వంటి వారు సమీక్షా వ్యాసాలు రాసేవారు.
కొల్లూరి తన సంపాదకత్వంలో ‘మినీ కవితా విప్లవం’ పేరుతో ఒక బృహత్ సంకలనం తీసుకొచ్చారు. దానికి అద్దేపల్లి విలువైన విపుల పీఠిక రాశారు. ఆ సంకలనంతో మినీ కవిత్వం ఒక కవితా ప్రక్రియగా నిలదొక్కుకుంది. అది ఒక రకంగా మినీ కవిత్వానికి మేనిఫెస్టో వంటిది. తర్వాత కాలంలో ఎక్స్రే పత్రికలో వచ్చిన మంచి మినీ కవితలతో కొల్లూరి ‘ఆహ్వానం’ పేరుతో ఒక సంకలనం వెలువరించారు. ఆయన విజయవాడలో స్థిరనివాసం ఏర్పరచుకున్నాక ఎక్స్రే సాహిత్య సంస్థగా అవతరించింది. ‘నెలనెలా వెన్నెల’ పేరుతో కవితా గోష్ఠులు నిర్వహించారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమాన్ని ఆ సంస్థ ద్వారా నిర్వహించేవారు. ఎక్స్రే పాతికేళ్ల పండుగకు అద్దేపల్లి, శివారెడ్డి, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ వంటి వారితోపాటు అనేకమంది కవులు హాజరయ్యారు. ఆ సందర్భంగా 24 గంటల కవి సమ్మేళనం నిర్వహించి రికార్డు స్థాపించారు. విజయవాడ కవి మిత్రులకు నోటిలో నాలుకలా ఉండేవారు.
కవిసంధ్య విజయవాడలో నిర్వహించిన అవార్డు సభలు, ఆవిష్కరణలకు కొల్లూరి తెరవెనక తోడ్పాటు అందించేవారు. కవిసంధ్య ప్రతిభా పురస్కారం తీసుకోవాలని ఆయన్ను ఆహ్వానించగా ఒప్పుకుని, సభకు రాలేకపోయారు. ఎక్స్రే అంటే కొల్లూరి. కొల్లూరి అంటే ఎక్స్రే అనేంతగా పర్యాయపదాలు. అయితే కార్యక్రమాల నిర్వహణలో పడి తనలోని కవిని నిర్దాక్షిణ్యంగా చంపేసుకున్నారు. కవితా సంపుటి తెచ్చే ప్రయత్నంలో ఉండగా మధ్యలో మరణించడం విషాదం. కుందుర్తి వచన కవితా పితామహుడైనట్టు, కొల్లూరి ‘మినీ కవితా పితామహుడు’. ప్రథమ వర్ధంతి సందర్భంగా కొల్లూరికి కవిసంధ్య నివాళులు.
డా. శిఖామణి
(నేడు కొల్లూరి ప్రథమ వర్ధంతి)
Also Read:
సిక్కిం గవర్నర్ నియామకంపై నిరసన.. అంకిత భండారీ తల్లిదండ్రుల విడుదల
జంతర్ మంతర్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు
గుజరాత్లో దారుణం.. నగల కోసం ప్రాణాలు తీసేశారు