World Telugu Conferences: భాషాభివృద్ధికి ప్రపంచ తెలుగు మహాసభలు
ABN , Publish Date - Jan 02 , 2026 | 01:38 AM
ప్రపంచ తెలుగు మహాసభలు కేవలం ఒక సాంస్కృతిక కార్యక్రమం మాత్రమే కాదు. ఇది తెలుగు భాషకు, తెలుగు జాతికి, తెలుగు వారి ఆత్మగౌరవానికి సంబంధించిన మహోత్సవం. తెలుగు భాష వెలుగును...
ప్రపంచ తెలుగు మహాసభలు కేవలం ఒక సాంస్కృతిక కార్యక్రమం మాత్రమే కాదు. ఇది తెలుగు భాషకు, తెలుగు జాతికి, తెలుగు వారి ఆత్మగౌరవానికి సంబంధించిన మహోత్సవం. తెలుగు భాష వెలుగును మరోసారి ప్రపంచ వేదికపై నింపే చారిత్రక సందర్భం. తెలుగు భాష వేల సంవత్సరాల చరిత్ర, సాహిత్య సంపద కలిగినది. ప్రపంచీకరణ యుగంలో అనేక భాషలు తమ గుర్తింపును కోల్పోతున్న సమయంలో, తెలుగు మాత్రం తన శక్తిని మరింత పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో తెలుగు ఒకటిగా నిలవడమే కాకుండా, అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు విస్తరించిన తెలుగు వలస సమాజాల ద్వారా అంతర్జాతీయ గుర్తింపు సాధిస్తోంది. టెక్నాలజీ, కృత్రిమ మేధ, డిజిటల్ కమ్యూనికేషన్ రంగాల్లో తెలుగుకు మరింత స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది.
ప్రపంచమంతా విస్తరించి ఉన్న కోట్లాది తెలుగు హృదయాలను దోచుకొన్న తెలుగు భాష ఎన్నో శతాబ్దాలుగా వికసిస్తూ వస్తుంది. గొప్ప కవులు, పండితులు, రచయితలు, గాయకులు, నాటక రచయితలు తెలుగు సాహిత్యధనాన్ని ఎంతో ఎత్తుకు చేర్చారు. నన్నయ, తిక్కన, యర్రా ప్రగడలతో ప్రారంభమైన ఆంధ్ర మహాభారతం నుంచి గురజాడ, విశ్వనాథ, శ్రీశ్రీ వరకు... పొట్టి శ్రీరాములు నుంచి గిడుగు వెంకటరామమూర్తి వరకు, ఇంకా నేటి ఆధునిక రచయితల వరకు తెలుగు భాష అభివృద్ధికి చేసిన సేవలు అమూల్యం. ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది మాట్లాడే భాష తెలుగు. ఆరువేలకు పైగా భాషల్లో అందమైన లిపి వున్న రెండో భాష ఇది. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు... తేనె లోలికే తెలుగు భాష కమ్మదనం చూసి మనం గర్వపడాలి. ప్రపంచంలో అతి మధుర భాషల జాబితాలో చోటు సంపాదించిన మహత్తరమైన మాతృభాష మనది. మరి అటువంటి భాషను మనం ఈ రోజు ఎంతగా కాపాడుతున్నాం? ప్రపంచీకరణ యుగంలో ఇంగ్లిష్–హిందీ ప్రాముఖ్యత పెరుగుతున్న కొద్దీ మన తెలుగుకు మనమే దూరమవుతున్న ప్రమాదాన్ని గుర్తించాలి. కుటుంబాలలో పిల్లలతో తెలుగులో మాట్లాడకపోవడంతో పాటు, తెలుగు పుస్తకాలు చదవడం తగ్గిపోతోంది.
భాషాభివృద్ధి కోసం నేటికీ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు అధికార భాషా సంఘాలు ఉన్నాయి. ఆగస్టు 29 తెలుగు భాషాదినోత్సవం, ప్రపంచ తెలుగు మహాసభలు, వివిధ దేశాలలో తెలుగు సంఘాలు, తెలుగు డిజిటల్ నిఘంటువులు, డిజిటల్ లైబ్రరీలు, యూనికోడ్, ఏఐ, డిజిటల్ అనువాద సాధనాల ద్వారా తెలుగు అభివృద్ధికి కృషి జరుగుతూనే ఉన్నది. ప్రస్తుత సమాజంలో తెలుగు భాష ఆంగ్లీకరణ అవుతుంది. మార్కెట్ వలయంలో మన మాతృభాష చిక్కుకున్నది. ఈ నేపథ్యంలో తెలుగు భాష అభివృద్ధికి కృషి జరగాలి. ప్రధానంగా పరిపాలనలో తెలుగు కనపడితే తెలుగు భాషాభివృద్ధికి అవరోధాలు తొలగిపోతాయి. 1955 సెప్టెంబర్ 20న మొదటిసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభ తెలుగును పాలనా భాషగా తీర్మానం చేసింది. 1966లో అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేశారు. వావిలాల గోపాలకృష్ణయ్య, డా. సి.నారాయణ రెడ్డి, ఎబికె, బుద్ధప్రసాద్ వంటి వారు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉన్న కాలంలో వ్యక్తిగత పలుకుబడితో భాషాభివృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు భాషను ఆధునీకరించడం, తెలుగేతరులకు తెలుగు బోధించడం, విశ్వవిద్యాలయాల స్థాయి వరకు తెలుగు మాధ్యమంలో చదువు చెప్పడం అనే లక్ష్యాలతో తెలుగు అకాడమీ ఏర్పడింది. అది చివరికి పాఠ్యపుస్తకాల ప్రభుత్వ ప్రచురణ సంస్థగా మారిపోయింది.
తెలుగు భాష అభివృద్ధి కోసం వివిధ కాలాలలో ఎందరో మహనీయులు శ్రమించారు. తెలుగు భాషా పరిరక్షణకు కృషి చేసిన పాలకుల్లో ప్రముఖులు స్వాతంత్ర్యానికి పూర్వం శ్రీకృష్ణదేవరాయలు కాగా, స్వాతంత్ర్యానంతరం నందమూరి తారకరామారావు భాషాభివృద్ధికి కృషి చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాక ముందు దేశ రాజధానిలో తెలుగువారికి గుర్తింపు లభించేది కాదు. తెలుగువారు ఎవరైనా ఢిల్లీ వెళ్తే మదరాశీయులుగానే తెలుగువారిని సంభోదించేవారు. తెలుగు కలల వికాసానికి 1985లో ఎన్టీఆర్ తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. కొన్నేళ్ల క్రితం వరకు తెలుగంటే ఆంధ్ర, తెలంగాణకే పరిమితం అని భావించే వారున్నారు. కానీ నేడు పరిస్థితి మారింది. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, యూరప్ నుంచి ఆఫ్రికా వరకు 120కి పైగా దేశాలలో తెలుగు సంఘాలు భాషాభివృద్ధికి పనిచేస్తున్నాయి. అమెరికాలో తెలుగు భాషకు అధికారిక, సామాజిక అకడమిక్ గుర్తింపు. అమెరికాలోని పలు స్కూల్స్, యూనివర్సిటీలలో తెలుగు సెకండ్ లాగ్వేజీగా బోధన జరుగుతోంది.
విదేశాలలో తెలుగు సంఘాలు పిల్లలకు తెలుగును బోధిస్తూ భాషను పరిరక్షిస్తుంటే, స్వదేశంలో తెలుగు మాట వినిపించని ఇళ్ళ సంఖ్య పెరగడం ప్రమాదకరం. తెలుగు భాషను అధికారిక పాలనా వ్యవహారాల్లో తప్పనిసరి చేయాలి. భాషను రక్షించడం ప్రతి తెలుగువారి, ముఖ్యంగా యువత బాధ్యత. తెలుగు భాషను కాపాడడానికి చేయాల్సినవి కుటుంబంలో తెలుగు మాట్లాడటం, తెలుగు పుస్తకాలు, పత్రికలు చదవడం, పాఠశాలల్లో మాతృభాష బలోపేతం చెయ్యడం, యువతలో కవిత్వం, రచన ప్రోత్సహించడం చేయాలి. తెలుగు భాషకు చరిత్ర ఉంది. అమ్మ భాషకు విలువ ఇచ్చినప్పుడే జన్మభూమి విలువ తెలుస్తుంది. మాతృభాషలోనే ప్రాథమిక విద్య నేర్పితే వారికి మిగతా భాషలు తేలిగ్గా అర్థమవుతాయని విద్యావేత్తలు, భాషావేత్తల అభిప్రాయం. తెలుగు భాషను కట్టుదిట్టంగా అమలు చెయ్యడానికి వీలుగా తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసి స్వతంత్ర ప్రతిపత్తితో ప్రజలకు, శాసనసభకు, ప్రభుత్వానికి జవాబుదారీ చెయ్యాలి. ప్రతి ఇంట్లో తెలుగు మాట్లాడాలి. ప్రతి పాఠశాలలో తెలుగు బోధన బలోపేతం కావాలి.
మన భాష గొప్పదని చెప్పుకోవడం కాదు ఆ గొప్పదనాన్ని తరతరాలకు అందించడం నిజమైన బాధ్యత. తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వాలు కొంతవరకే చేయగలవు. భాషను కాపాడుకోవడం ప్రజల చేతుల్లోనే ఉంది. కావున ప్రతి ఒక్కరూ తమ మాతృభాష తెలుగును ప్రచారం చేయాలి. ఇతర భాషలతో పోటీపడి తెలుగు వినియోగం పెంచాలి.
తొండపు దశరథ జనార్దన్
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు
(జనవరి 3 నుంచి గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు)
ఇవి కూడా చదవండి...
రైతులకు గుడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..
సంస్కరణల పథంలో అభివృద్ధి రథం:పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News