Share News

ఆహారం విలువ తెలుసుకుందాం!

ABN , Publish Date - Oct 16 , 2026 | 03:17 AM

మనిషికి ఎంత సంపద ఉన్నా, ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా, ఆకలి వేసినప్పుడు అవసరమయ్యేది ఒక్క ముద్ద అన్నమే. అందుకే ఆహారం విలువను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఆకలితో...

ఆహారం విలువ తెలుసుకుందాం!

మనిషికి ఎంత సంపద ఉన్నా, ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా, ఆకలి వేసినప్పుడు అవసరమయ్యేది ఒక్క ముద్ద అన్నమే. అందుకే ఆహారం విలువను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఆకలితో బాధపడుతున్న వారి పరిస్థితిని అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆకలిని నిర్మూలించడం, పోషకాహారంపై అవగాహన పెంపొందించడం, ఆహార భద్రతను సాధించడం, ప్రతి ఒక్కరికీ సరిపడా ఆరోగ్యకరమైన ఆహారం అందేలా కృషి చేయడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశాలు.

ఒక పూట భోజనం కోసం ఎదురుచూసే కుటుంబాలు, రాత్రి ఆకలితో నిద్రపోయే పిల్లలు, తమను ఆదరించేవారు లేక ఆహారం కోసం ఇతరులపై ఆధారపడే వృద్ధులు కూడా నేటి సమాజంలో ఉన్నారు. ప్లేటులో మిగిలిపోయే అన్నం మరొకరి ఆకలిని తీర్చగలదనే ఆలోచన మనలో ఎంతమందికి వస్తుంది? మనం తినకుండా పారవేసే ఆహారం వెనుక రైతు శ్రమ, భూమి, నీరు, విద్యుత్తు, విత్తనాలు, రవాణా, వంట చేసిన వారి కష్టం దాగి ఉన్నాయి. ఒక అన్నం మెతుకు మన చేతికి చేరే వరకు ఎన్నో దశల్లో ఎంతోమంది శ్రమిస్తారు. కాబట్టి ఆహారాన్ని గౌరవించడం అంటే రైతును గౌరవించడం, ప్రకృతిని గౌరవించడం, మానవ శ్రమకు విలువ ఇవ్వడం.

పిల్లల్లో మంచి అలవాట్లు పెంపొందించాలి. చిన్నప్పటి నుంచే అన్నం వృథా చేయకూడదని, రైతు కష్టాన్ని గౌరవించాలని, అవసరమైన వారికి సహాయం చేయాలని వాళ్లకు నేర్పాలి. పాఠశాలల్లో ఆహార విలువ, పోషకాహారం, పరిశుభ్రత, ఆహార వృథా నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. రైతులను గౌరవించాలి. ఆహార ఉత్పత్తికి రైతే ప్రధాన ఆధారం. కడుపు నిండటం మాత్రమే సరిపోదు. సమతుల్యమైన పోషకాహారం కూడా అవసరం. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి తగిన ఆహారం అందేలా శ్రద్ధ చూపాలి. ప్రభుత్వ పథకాలను బలోపేతం చేయాలి. ప్రజాపంపిణీ వ్యవస్థ, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ పోషకాహార కార్యక్రమాలు వంటి సేవలు అర్హులైన వారికి సక్రమంగా అందేలా పర్యవేక్షించాలి.


ప్రపంచ ఆహార దినోత్సవం ఒక గొప్ప సందేశాన్ని అందిస్తోంది. ఆహారాన్ని గౌరవించాలి, ఆకలిని అర్థం చేసుకోవాలి, వృథాను అరికట్టాలి, అవసరమైన వారికి తోడుగా నిలవాలి. ఇంట్లో ఆహారం ఉన్నప్పుడు పక్కింట్లో ఆకలి ఉందేమో ఆలోచించాలి. వేడుకలలో విందులు జరుగుతున్నప్పుడు రహదారి పక్కన భోజనం కోసం ఎదురుచూస్తున్నవారిని గుర్తుచేసుకోవాలి. ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్క మంచి ఆలోచనను ఆచరణలో పెట్టినా సమాజంలో మార్పు ప్రారంభమవుతుంది.

వై. సంజీవకుమార్

స్కై ఫౌండేషన్

(నేడు ప్రపంచ ఆహార దినోత్సవం)

Also Read:

సిక్కిం గవర్నర్ నియామకంపై నిరసన.. అంకిత భండారీ తల్లిదండ్రుల విడుదల

జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు

గుజరాత్‌లో దారుణం.. నగల కోసం ప్రాణాలు తీసేశారు

Updated Date - Oct 16 , 2026 | 03:17 AM