మహిళా బిల్లు చుట్టూ కాంగ్రెస్ రాజకీయం
ABN , Publish Date - Aug 13 , 2026 | 01:14 AM
పార్లమెంట్‌లో ‘మహిళా ప్రాతినిధ్యం, నియోజకవర్గాల డీలిమిటేషన్’ చుట్టూ జరుగుతున్న వివాదాన్ని తీవ్రమైన రాజకీయ యుద్ధంగా మార్చింది కాంగ్రెస్. పైకి మహిళల హక్కుల గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ చరిత్రను పరిశీలిస్తే, మహిళా బిల్లు...
పార్లమెంట్‌లో ‘మహిళా ప్రాతినిధ్యం, నియోజకవర్గాల డీలిమిటేషన్’ చుట్టూ జరుగుతున్న వివాదాన్ని తీవ్రమైన రాజకీయ యుద్ధంగా మార్చింది కాంగ్రెస్. పైకి మహిళల హక్కుల గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ చరిత్రను పరిశీలిస్తే, మహిళా బిల్లు విషయంలో ఆ పార్టీ ప్రదర్శించిన ద్వంద్వ వైఖరి, తాత్సారం, రాజకీయ స్వార్థం... వంటివి ఎన్నో కనిపిస్తాయి. ఇప్పుడు మహిళా బిల్లుకు డీలిమిటేషన్‌ను కారణంగా చూపిస్తున్న కాంగ్రెస్, 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు యూపీఏ అధికారంలో మిత్రపక్షాల ఒత్తిడిని సాకుగా చూపిస్తూ బిల్లును లోక్‌సభలో ఆమోదించకుండా కాలయాపన చేసింది. 2010లో రాజ్యసభలో పాసైన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టకుండా తొక్కిపెట్టింది.
మహిళా బిల్లును కాంగ్రెస్ రాజకీయం చేయడం 1996లో దేవెగౌడ మొదటిసారి బిల్లు పెట్టినప్పటి నుంచి జరుగుతూనే ఉంది. యూపీఏ హయాంలో తమ మిత్రపక్షాలైన సమాజ్‌వాది, ఆర్జేడీలు సభలో బిల్లును వ్యతిరేకిస్తూ ఓబీసీ, మైనారిటీ కోటా ఉండాలని బిల్లు ప్రతులను చించేస్తే అధికార భాగస్వామి కాంగ్రెస్, ఆ నిరసనలకు నిశ్శబ్ద ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. ఇప్పుడు ముప్పై సంవత్సరాల తర్వాత కూడా మహిళా బిల్లు మీద స్పష్టమైన రాజకీయ వైఖరి తీసుకోకుండా, ఏదో ఒక నెపంతో మహిళా హక్కులను వాయిదా వేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాజ్యాంగ 131వ సవరణ బిల్లు–2026 ద్వారా లోక్‌సభ స్థానాల సంఖ్యను 543 నుంచి 850కి పెంచాలని ప్రతిపాదన; ప్రస్తుతం కేవలం 14శాతం ప్రాతినిధ్యంతో ఉన్న మహిళలు 128వ రాజ్యాంగ సవరణ బిల్లు–2023, మహిళా రిజర్వేషన్ల బిల్లుతో 33శాతం స్థానాలతో సుమారు 280 పైగా స్థానాలకు పెంచే ప్రతిపాదన గత ఏప్రిల్ 17న లోక్‌సభ ఓటింగ్‌లో 2/3 వంతుల మెజారిటీ లభించక ‘ఇండియా’ కూటమి వ్యతిరేక ఓటుతో వీగిపోయింది. దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గకుండా, ఏ రాష్ట్రానికీ సీట్లు తగ్గకుండా, మొత్తం సీట్ల సంఖ్యను మాత్రమే పెంచుతూ, 1971 జనాభా నిష్పత్తి ఆధారంగా దక్షిణాది స్థానాల శాతాన్ని యథాతథంగా కాపాడుతూ సీట్లు పెంచే ప్రత్యామ్నాయ ఫార్ములాపై కాంగ్రెస్, విపక్షాలు వారి అభ్యంతరమేమిటో ఇప్పటికీ చెప్పలేదు. ఒకవైపు రాహుల్‌గాంధీ జనాభా ప్రాతిపదికన హక్కులు (జిత్నీ ఆబాదీ, ఉత్నీ హక్) అంటూ నినాదం ఇస్తారు. మరొకవైపు జనాభా ప్రాతిపదికన జరిగే డీలిమిటేషన్‌ను అడ్డుకుంటారు!
2023 సెప్టెంబర్‌లో మోదీ ప్రభుత్వం తెచ్చిన మహిళా బిల్లు ‘నారీ శక్తి వందన్ అధినియం’ 106వ రాజ్యాంగ సవరణ చట్టం ఆమోదం పొందింది. అయితే, రాజ్యాంగంలో కొత్తగా చేర్చిన ఆర్టికల్ 334ఏ స్పష్టమైన నిబంధన విధిస్తోంది. అది కొత్త జనాభా గణన, దాని ఆధారంగా జరిగే నియోజకవర్గాల సరిహద్దుల పునర్విభజన, డీలిమిటేషన్ పూర్తయిన తర్వాతే ఈ 33శాతం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. లోక్‌సభ– ఆర్టికల్ 330ఏ; రాష్ట్ర అసెంబ్లీలతో ఆర్టికల్ 332ఏ తో పాటు ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉప రిజర్వేషన్లు కల్పిస్తూ, 15 ఏళ్ల పరిమితితో సన్‌సెట్ క్లాజ్, స్థానాల రొటేషన్ పద్ధతిని స్పష్టంగా చట్టంలో పొందుపరిచారు. ఈ రాజ్యాంగబద్ధమైన డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తికాకుండా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయమనడం కాంగ్రెస్ చట్టపరమైన నైతికత లేని రాజకీయ విన్యాసమే.
డీలిమిటేషన్ తర్వాతే, ఆమోదించిన మహిళా బిల్లు అమల్లోకి వస్తుంది. ఒకప్పుడు మహిళా బిల్లును ఆమోదించిన కాంగ్రెస్ పార్టీ, మరి ఈ రోజు, డీలిమిటేషన్ లేకుండా మహిళా బిల్లును ఆమోదించాలని ఎలా అడుగుతోంది? ఒకవేళ 2026 జనాభా లెక్కల ప్రకారం జనగణన చేస్తే దక్షిణాదికి లోక్‌సభ సీట్లలో తీవ్ర అన్యాయం జరుగుతుందనే కదా ఇప్పుడు సమస్య. ఆ సమస్యను అసలు పట్టించుకోకుండా, కాంగ్రెస్ సారథ్యంలో కొన్ని ప్రతిపక్షాలు ఏకమై బిల్లును ఓడగొట్టాయి. పైగా కొత్తగా కాంగ్రెస్ ఇప్పుడు డిమాండ్ చేస్తున్న ఓబీసీ కోటాను 2010లో యూపీఏ ప్రవేశపెట్టిన బిల్లులో తామే చేర్చలేదు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు లేని ఓబీసీ కోటా డిమాండ్‌ను కాంగ్రెస్ ఇప్పుడు తెరపైకి ఎలా తెస్తున్నది?
అసలు డీలిమిటేషన్ లేకుండా మహిళా బిల్లు సాధ్యమేనా అంటే, చట్ట ప్రకారం చెల్లదు. ఈ రెండింటినీ వేరు చేయాలని రాహుల్‌గాంధీ, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రాథమిక రాజ్యాంగ, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమయ్యే విషయం ఏమిటంటే, నియోజకవర్గాల సరిహద్దులు మార్చకుండా ఏ సీటు మహిళలకు, ఏ రాష్ట్రంలో ఎంత కేటాయించాలో నిర్ణయించడం అసాధ్యం. డీలిమిటేషన్ లేకుండా 33శాతం కేటాయించాలంటే, ప్రస్తుతం ఉన్న 543 స్థానాల్లో నుంచే 181 స్థానాలను లాటరీ పద్ధతిలో మహిళలకు ఇవ్వాలి. దీనివల్ల రాష్ట్రాల నియోజకవర్గాల సరిహద్దుల్లో, మహిళా ప్రాతినిధ్యంలో, భారీ అసమానతలు వస్తాయి. అసలు కొత్త సీట్లు 850 వరకు విస్తరించకుండా, పాత స్థానాల్లోనే ఇస్తే సిట్టింగ్ ఎంపీల స్థానాలు ఊడిపోయి, తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. ఈ ఆచరణాత్మక సమస్యను కాంగ్రెస్ గమనించడం లేదు.
1976లో ఎమర్జెన్సీ సమయంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పునర్విభజనపై ఇందిరాగాంధీ 2001 వరకు నిషేధం విధించారు. 2001లో వాజపేయి ప్రభుత్వం దీనిని 2026 వరకు పొడిగించింది. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్‌లో తమ సీట్లను కోల్పోకుండా ఉంచాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నుంచి ప్రముఖ రాజకీయ పార్టీలన్నీ డిమాండ్ చేయడంతో ఆ నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్, డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్న సభ్య పార్టీలు ఈ విషయాలను స్పష్టం చేయాలి. ఒకటి– 2026 ప్రకారం జనగణన చేసి, ఆ ప్రకారం పార్లమెంటు సీట్లు ఇస్తే, దక్షిణాదికి సీట్లు తగ్గినా మీకు సమ్మతమేనా?; రెండు– ఎన్డీఏ చెబుతున్న ప్రకారం 50శాతం పెంచితే మీకు కనిపించే నష్టం ఏమిటి? మూడు– పోనీ 50శాతం పెంపు లేకుండా దక్షిణాదికి సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా మీ దగ్గర ఏదైనా ప్రత్యామ్నాయ ప్రతిపాదన ఉన్నదా? చివరిది– ఇవేవీ చేయకుండా మహిళా బిల్లును ఎలా పాస్ చేస్తారు?
రాహుల్‌గాంధీ సోషల్ మీడియాలో మహిళా సాధికారత ఉపన్యాసాలకు, పార్లమెంట్‌లో కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలకు పొంతన లేదు. మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం దక్కాలంటే కేవలం భావోద్వేగ ట్వీట్లు, నినాదాలు సరిపోవు. దానికి తగిన రాజ్యాంగ ప్రక్రియలను పూర్తి చేయనిచ్చే రాజకీయ నిజాయితీ, సంకల్పం కావాలి.
నీలాయపాలెం విజయ్‌కుమార్
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి
ఇవి కూడా చదవండి...
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Latest AP News And Telugu News