వస్త్రధారణలో మహిళా స్వేచ్ఛ హక్కులు, హద్దులు
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:37 AM
సమాజ జీవితాన్ని ప్రభావితం చేసే ఏదైనా ఒక అంశంపై అనుకూల, ప్రతికూల వాదనలు రెండూ ఉంటాయి. ఈ సత్యం తెలిసినందునే, సమకాలీన సమస్యలను సౌమ్యంగాను, నిష్పాక్షికంగాను, మృదు హాస్యంతో...
సమాజ జీవితాన్ని ప్రభావితం చేసే ఏదైనా ఒక అంశంపై అనుకూల, ప్రతికూల వాదనలు రెండూ ఉంటాయి. ఈ సత్యం తెలిసినందునే, సమకాలీన సమస్యలను సౌమ్యంగాను, నిష్పాక్షికంగాను, మృదు హాస్యంతో చర్చించిన 18వ శతాబ్ది ఆంగ్ల రచయితలు జోసెఫ్ ఎడిసన్, రిచర్డ్ స్టీల్ సృష్టించిన కాల్పనిక పాత్ర సర్ రోజర్ డి కవర్లీ ‘రెండు వైపులా చాలా చెప్పవచ్చు’ అని వ్యాఖ్యానిస్తుంది. ఒక సమస్యను పాఠకులు భిన్న దృక్కోణాలతో చూసే వెసులుబాటు కల్పిస్తూ పల్లెటూరి పెద్ద మనిషి అయిన సర్ రోజర్ ఒక సున్నితమైన విమర్శ సమకూర్చాడు. ఆంగ్లేయుల సహజ వివేకానికి నిదర్శనమైన ఈ తీర్పులేని దృక్పథం (Non– judgmental view– ఆలోచనలు, భావాలు, పరిస్థితులను మంచి, చెడు ముద్రవేయకుండా గమనించడం, వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి వాస్తవాలను పరిశీలించడం, తక్షణ విమర్శ లేదా ముగింపు లేకుండా ఇతరుల దృక్పథాలను అనుమతించడం) ప్రస్తుతం మన సామాజిక మాధ్యమాలలో, వస్త్రధారణలో స్త్రీ స్వేచ్ఛపై కొనసాగుతున్న రభసకు కూడా వర్తిస్తుంది.
బహిరంగ ప్రదేశాల్లో సినీ హీరోయిన్లపై కొందరు అనుచితంగా ప్రవర్తించిన అంశంపై ఇటీవల ఒక సినీ నటుడు ప్రతిస్పందిస్తూ... బహిరంగ సభలు, కార్యక్రమాలలో పాల్గొనే నటీమణులు అభిమానుల మితిమీరిన అల్లరి ప్రవర్తనల మూలంగా ఎటువంటి ఇబ్బందులపాలు కాకుండా ఉండేందుకు గౌరవప్రదమైన రీతిలో, యుక్తమైన వస్త్రధారణతో రావడం మంచిదని వ్యాఖ్యానించాడు. ఇది నిరపాయకరమైన మాట కనుకనే చాలా మంది ఆ నటుడి సలహాను మెచ్చుకున్నారు. అయితే ఆ సూచన చేయడంలో ఆయన మర్యాదగాలేని రెండు మాటలను వాడటంతో, తన తప్పును అంగీకరిస్తూ ఆ తరువాత తెలంగాణ మహిళా కమిషన్‌కు క్షమాపణలు చెప్పారు.
తెలుగు టీవీ యాంకర్ ఒకరు తన అర్ధనగ్న చిత్రాలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడంపై వస్తున్న విమర్శలకు ప్రతిస్పందిస్తూ, ఆ చిత్రాలు తన వ్యక్తిగత స్వేచ్ఛకు తార్కాణాలంటూ వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. ఆమె వైఖరిని తీవ్రంగా ఖండించిన పలువురు స్త్రీ వాదుల అభిప్రాయాలకు టీవీ చానెల్స్ అమిత ప్రాధాన్యమిస్తూ వాటిని ప్రసారం చేశాయి. ఆ యాంకర్ అర్ధనగ్న చిత్రాలను పదేపదే తెరపై చూపిస్తూ ఆమె వ్యాఖ్యలను, వాటిపై ప్రతిస్పందనలను మరింత సంచలనశీలం చేశాయి. మనస్తాపం చెందిన ఆ యాంకర్, క్రిమినల్ కేసు దాఖలు చేశారు. భారతీయ న్యాయ సంహిత (ఇండియన్ పీనల్ కోడ్), ఐటీ చట్టం కింద సైబరాబాద్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ జారీ చేశారు.
19వ శతాబ్ది బ్రిటిష్ పాత్రికేయ ప్రముఖుడు ఎ.జి.గార్డినర్ తన సుప్రసిద్ధ వ్యాసం ‘On the Rule of the Road’లో స్వేచ్ఛను సంపూర్ణ వ్యక్తిగత స్వేచ్ఛగా కాకుండా పరస్పర సర్దుబాటు అవసరమయ్యే సామాజిక ఒప్పందంగా విపులీకరించారు. వ్యక్తిగత స్వేచ్ఛ తప్పనిసరిగా ఇతరుల హక్కులను గౌరవించి తీరాలని, సమష్టి శ్రేయస్సుకోసం వ్యక్తిగత ఆకాంక్షలను అదుపు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ వివేకశీల అభిప్రాయాన్ని ప్రజాస్వామ్య సమాజాలు అన్నీ అంగీకరించాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే వ్యక్తిగత స్వేచ్ఛలు అపరిమితమైనవి కావు, షరతులు లేనివీ కావు. హక్కులు సైతం సంపూర్ణమూ, నిరపేక్షమైనవి కావు. అవి అనివార్యంగా ఇతరుల హక్కులతో ముడివడి ఉంటాయి. మహిళల గౌరవం, ప్రజానైతికత, వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛలకు భారతీయ న్యాయవ్యవస్థ సమతూకంలో ప్రాధాన్యమిస్తోంది. మహిళా సమస్యలకు సంబంధించిన వివిధ కేసులలో సుప్రీంకోర్టు నిర్ణయాలు మనకొక ఆవశ్యక అంతర్దృష్టినిస్తున్నాయి. సమాజ జీవితంలో మహిళల సంపూర్ణ, సురక్షితమైన భాగస్వామ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయాలు నిర్ధారిస్తున్నాయి.
‘బాండిట్ క్వీన్’ సినిమాలో పూలన్‌దేవి పాత్రను ఎటువంటి ఆచ్ఛాదనా లేని స్థితిలో చూపించడం సబబేనని బాబీ ఆర్ట్ ఇంటర్నేషనల్ వెర్సెస్ ఓమ్‌పాల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇది అణగారిన వర్గాల మహిళల కఠోర జీవనవాస్తవాలను చూపించడంగా భావించింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కింద ఆ సినిమాపై అభ్యంతరాలను తోసిపుచ్చింది. మహిళలను నగ్నంగా చూపించడం అన్ని సందర్భాలలోనూ అసభ్యతకు కిందకు రాదని, ముఖ్యంగా సామాజిక దౌష్ట్యాలను దృష్టాంతీకరించడంలో అలా చూపించవలసివస్తే అది అసభ్యకరమైన చిత్రణ కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భారతమాతను నగ్నమూర్తిగా చిత్రించడం ప్రజాసభ్యత (పబ్లిక్ డీసెన్సీ) ప్రమాణాలను ఉల్లంఘించడం లేదా మహిళల గౌరవాన్ని కించపరచడం కాదని, ఎమ్.ఎఫ్.హుస్సేన్ వెర్సెస్ రాజ్‌కుమార్ కేసు (2008)లో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. హుస్సేన్ కళా సృజనలో అభ్యంతరకరమైనదేమీ లేదని పేర్కొంది.
రంజిత్ ఉదేషి వెర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు తీర్పు మన దేశంలో అశ్లీల చట్టాలను అర్థం చేసుకునేందుకు తగు ప్రాతిపదికలను నెలకొల్పింది. ఆంగ్ల నవలా రచయిత డి.హెచ్.లారెన్స్ నవల ‘లేడీ చాటర్లీస్ లవర్’ విక్రయాలకు సంబంధించిన కేసు ఇది. ఐపీసీ 292 కింద ఆ నవలను అశ్లీల రచనగా భావించవచ్చని ఆ తీర్పు పేర్కొంది. సుప్రీంకోర్టు ఆ కేసుకు హిక్లిన్ పరీక్ష (అత్యంత దుర్బల మనస్కులపై ప్రభావ పరిశీలన) ఉపయోగించి నగ్నత్వ వర్ణన, చిత్రణతో ప్రమేయమున్న కళా సృజన అనైతిక ప్రభావాలను నెరపిన పక్షంలో అది అశ్లీలమైనది అవుతుందని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ‘మహిళల అసభ్య చిత్రణ (నిషేధ) చట్టం–1986 (ఐఆర్‌డబ్ల్యూఏ)కు న్యాయప్రాతిపదిక నేర్పాటుచేసింది.
ఒక మ్యాగజైన్‌లో ప్రచురితమైన అర్ధనగ్న ఛాయా చిత్రాన్ని సమకాలీన సమాజ ప్రమాణాలకు, సందర్భానికి అనుగుణంగా మూల్యాంకనం చేయాలని అవీక్ సర్కార్ వెర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన ఈ అభిప్రాయం కళాసృజన, భావ వ్యక్తీకరణలో మహిళలకు గౌరభంగం కలిగించడాన్ని నిరోధించేందుకు ఉద్దేశించిన పైన పేర్కొన్న చట్టంతో ఏకీభవిస్తుంది. అసభ్యకర చిత్రీకరణ అంటే ఏమిటో ఈ చట్టం నిర్వచించింది: ‘స్త్రీ రూపాన్ని లేదా శరీరాన్ని అవమానకరంగా, దిగజారుడుగా లేదా ప్రజానైతికతకు హాని కలిగించే విధంగా ప్రదర్శించడం’.
అశ్లీలతను అమెరికా చట్టం అభ్యంతరకర, అనుచిత, అవమానకరమైనదిగా ప్రస్తావిస్తున్నది. ఇది తరచూ లైంగికత, నగ్నత్వంతో ముడివడి ఉంటుంది. ఏదైనా ఒక కళాకృతి లేదా సాహిత్యరచన అశ్లీలమైనది అని నిర్ధారించేందుకు మిల్లర్ టెస్ట్ ఉపయోగిస్తారు. అశ్లీలమైనది అని నిర్ధారణ అయితే అమెరికా రాజ్యాంగ మొదటి సవరణ కింద ఆ అశ్లీలతకు కారకులైనవారికి రక్షణ ఉండదు.
వ్యక్తిగత స్వేచ్ఛ పేరిట సామాజిక మాధ్యమాలలో అర్ధనగ్న చిత్రాలను పోస్ట్ చేయడం, మరులు గొలిపే ఆ చిత్రాలను టీవీ చానెల్స్ పదేపదే ప్రసారం చేయడం చట్టబద్ధంగా సమర్థించలేనివి. ఈ విషయంలో కేసు దాఖలు చేసినవారు, ఆ కేసులో ప్రతివాదిగా ఉన్నవారు ఇరువురూ ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను ఉల్లంఘించినవారే. వస్త్రధారణలో స్త్రీ స్వేచ్ఛ విషయమై రేగిన రభసతో ప్రమేయమున్న ఇరుపక్షాల తరఫున ఎంతైనా చెప్పవచ్చు.
ఇ.దామోదర్
రిటైర్డ్ ఐపీఎస్
ఈ వార్తలు కూడా చదవండి.
అబూ సలేంకు పెరోల్ ఇవ్వొద్దు.. ముంబై కోర్టుకు తెలిపిన మహారాష్ట్ర ప్రభుత్వం
నితిన్ నబీన్‌కు జడ్ కేటగిరీ సెక్యూరిటీ
Read Latest National News