Share News

ఆకాశంలో సగానికి అవకాశాల్లో సగం వద్దా?

ABN , Publish Date - Apr 21 , 2026 | 03:30 AM

చట్టసభల్లో మహిళలకు కల్పించే 33శాతం రిజర్వేషన్ల బిల్లు ఎంతో కాలం నుంచి ఎదురుచూడగా, ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ పేరున మరోమారు ముందుకు వచ్చి మళ్లీ చతికిలబడింది. ఒకవేళ నెగ్గినా ఈ...

ఆకాశంలో సగానికి అవకాశాల్లో సగం వద్దా?

చట్టసభల్లో మహిళలకు కల్పించే 33శాతం రిజర్వేషన్ల బిల్లు ఎంతో కాలం నుంచి ఎదురుచూడగా, ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ పేరున మరోమారు ముందుకు వచ్చి మళ్లీ చతికిలబడింది. ఒకవేళ నెగ్గినా ఈ చట్టంతో కూడా లోక్‌సభలో, అసెంబ్లీలలో మహిళల ప్రాతినిధ్యం పెరిగేదే తప్ప రాజ్యసభలో, శాసనమండళ్లలో మహిళలకు రిజర్వేషన్లు లేవు. దేశ పరిపాలనలో, అత్యున్నత స్థాయిలో అహర్నిశలూ పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగంలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్న దాఖలాలు ఈ బిల్లులోనే కాదు, ఏ విధంగానూ ఎక్కడా లేవు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఎంత ముఖ్యమో, ప్రభుత్వ పాలనను నడిపే వ్యవస్థలో మహిళలు ఉండటం కూడా అంతే ముఖ్యం.

ప్రస్తుత ప్రభుత్వ గణాంకాలు ఆశావహుల దృక్పథాన్ని నీరుకారుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని మొత్తం ఉద్యోగాలలో మహిళల ప్రాతినిధ్యం 11 నుంచి 13శాతం మధ్యనే ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 2011లో ఇది మరీ దారుణంగా ఏడు శాతం దాటలేదు. మహిళలు పట్టుదల, అంకితభావంతో ఎన్నో కష్టనష్టాలకోర్చి, తమ సొంత కాళ్ల మీద ఇప్పుడు 13శాతానికి రాగలిగారు. కేంద్ర ప్రభుత్వంలో నిర్ణయాత్మక పదవులయిన తొంబై రెండు సెక్రటరీ స్థాయి పదవుల్లో కేవలం ముగ్గురు మహిళలు మాత్రమే ఉండటం మరీ దారుణం. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మనకు రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు మహిళలయ్యారే కానీ, ఇప్పటికీ ఒక్క మహిళ కూడా క్యాబినెట్ సెక్రటరీ స్థాయికి చేరుకోలేదు. రక్షణ, ఆర్థిక వంటి కీలక శాఖల్లో మహిళా సెక్రటరీలు లేరు. ఇది సప్లై వైపు సమస్యా? డిమాండ్ వైపు సమస్యా? విజ్ఞులే ఆలోచించాలి.

మన న్యాయ వ్యవస్థను చూస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే! దేశ అత్యున్నత న్యాయస్థానంలో 34 మంది న్యాయమూర్తులలో ఒకే ఒక్క మహిళా న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న సేవలందిస్తున్నారు. ఇక, హైకోర్టుల్లో అయితే దేశం మొత్తం మీద ఉన్న 813 మంది జడ్జీల్లో కేవలం 116 మంది మాత్రమే మహిళలు. ఇంకా కింద న్యాయవ్యవస్థలో 35శాతం పైగా న్యాయాధికారులు ఉన్నా, హైకోర్టుకు వచ్చేటప్పటికి వారు ఎక్కడ జారిపోతున్నారో తెలియడం లేదు.


ఇది కూడా దేశం మొత్తం మీద ఒకేలాగా లేదు. తెలంగాణ, సిక్కిం లాంటి రాష్ట్రాల్లో మూడో వంతుకు పైగా మహిళా న్యాయమూర్తులుంటే, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లలో తక్కువగా ఉన్నారు. 2018లో దాదాపు 94శాతం లిస్టెడ్ ప్రభుత్వరంగ సంస్థల బోర్డుల్లో మహిళా డైరెక్టర్లు ఉన్నా, 2025 నాటికి ఆ సంస్థల సంఖ్య 67శాతానికి పడిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల బోర్డుల్లో మహిళలు 28శాతం పైగా ఉన్నా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వంటి కీలక స్థానాల్లో వారి శాతం ఐదు మాత్రమే.

భారత పరిపాలన సేవ (ఐఏఎస్)లో 2023 బ్యాచ్‌లో 41 శాతం మహిళలు ఎంపికైనా, వారు పదోన్నతులు పొంది పై పదవులను అధిష్ఠించేలోపు ఎన్ని ఆర్థిక, సామాజిక, రాజకీయ, పరిపాలన ఒడిదుడుకులు ఎదుర్కోవాలో తెలియదు. కేవలం చట్టసభలకు మాత్రమే పరిమితం చేయకుండా అన్ని రంగాల్లోనూ ఆకాశంలో సగమైన మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది. అతి చిన్న దేశమైన రువాండా పార్లమెంటులో 67శాతం మహిళలు ఉండగా, మనం ఎందుకు తీసిపోవాలి?

పొద్దున లేస్తే ఏ అవకాశాన్నీ విడవకుండా మనపై దుమ్మెత్తి పోస్తున్న పాకిస్థాన్‌లో కూడా ప్రభుత్వ ఉద్యోగాలను బట్టి, పరిస్థితులను బట్టి 11 నుంచి 14శాతం వరకు రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, సిక్కిం తదితర రాష్ట్ర ప్రభుత్వాల్లో 30–35శాతం వరకు రిజర్వేషన్లు ఇస్తుండగా, కేంద్ర ప్రభుత్వానికి ఏమైంది? మహిళలను పైకి తీసుకురాకూడదనా? వారు ఈ పరిపాలనలో పాలు పంచుకోవద్దనా? లేక మగవారి కన్నా మహిళలు తక్కువన్న భావనా? ఆకాశంలో సగం అని అన్ని దేశాలు గొంతెత్తి చాటుతున్నప్పుడు మన గొంతు ఎందుకు మూగపోయింది?

ఇప్పటికైనా ప్రభుత్వరంగ సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే సర్వీస్ కమిషన్ లాంటి అనేక సర్వీసుల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే అనేక సమస్యలు దూరమవుతాయి. మహిళలు స్వయం సమృద్ధలవుతారు. ఆర్థిక స్వాతంత్ర్యం వస్తుంది. ముఖ్యంగా ఇళ్ళల్లో, కార్యాలయాల్లో, రవాణా సాధనాల్లో వారి సంఖ్య పెరిగినప్పుడు వారి పట్ల జరిగే నేరాలు కూడా చాలా వరకు తగ్గుతాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు కేవలం చట్టసభలకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో మహిళలకు సమాన భాగం ఇవ్వాలని ఆశిద్దాం.

జి. జ్యోతిరావు

అమిక మధ్యవర్తిత్వ కేంద్రం

ఈ వార్తలు కూడా చదవండి...

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఏం చర్చించారంటే..

కేసీఆర్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు: మంత్రి వివేక్

33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: కిరణ్ కుమార్ రెడ్డి

Read Latest Telangana News And AP News And International

Updated Date - Apr 21 , 2026 | 03:30 AM