సవర్ణ ‘మహిళా బిల్లు’ను అడ్డగించే శక్తులేవీ?
ABN , Publish Date - Apr 25 , 2026 | 03:27 AM
భారతదేశంలో మహిళా హక్కుల రక్షణల్ని చట్టబద్ధం చేయడానికి హిందూ కోడ్ బిల్లును రూపొందించినవారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్. మహిళా బిల్లు వీగిపోతే మనస్తాపంతో మంత్రి పదవిని...
భారతదేశంలో మహిళా హక్కుల రక్షణల్ని చట్టబద్ధం చేయడానికి హిందూ కోడ్ బిల్లును రూపొందించినవారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్. మహిళా బిల్లు వీగిపోతే మనస్తాపంతో మంత్రి పదవిని కూడా వదిలేసిన గొప్ప మహిళోద్ధారకుడాయన. అప్పుడు ఆ బిల్లును వ్యతిరేకించిన ఆధిపత్య కులాల మగ, మహిళా శక్తులే, సబ్ కోటాతో ఉండాలన్న మహిళా బిల్లును అడ్డుకున్నాయి. ముప్పై ఏళ్ల తాత్సారం తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళల అస్తిత్వ రాజకీయాల తర్వాత కూడా మళ్లీ అదే సబ్ కోటా లేని ‘మహిళా (సవర్ణ) బిల్లు’ మహిళా బిల్లుగా 2023లో పార్లమెంట్‌లో ఏకగ్రీవంగా ఆమోదం పొందడం బహుజన సమాజానికి ఒక రాజకీయ చారిత్రక విషాదం.
భారత జనాభాలో మహిళలు సగం. వారిలో శ్రామిక శక్తులైన బహుజన కులాల మహిళలు (90శాతం) మెజారిటీ. సామాజిక శ్రమలలో లేని ఆధిపత్య కుల (ఓసీ) మహిళల (10శాతం) జనాభా చాలా తక్కువ. మొదటి పార్లమెంటు (1952) ఎన్నికల నుంచి 2024 ఎన్నికల దాకా గమనిస్తే మైనారిటీ ఓసీ మహిళలు చట్టసభల్లో 95శాతం ప్రాతినిధ్యాలు కలిగివుంటే, మెజారిటీ జనాభాగా ఉన్న బహుజన మహిళలు తమకు జరిగే అన్యాయాలపై, హక్కులకై చట్టసభల్లో పోరాడే అవకాశం లేకుండా నష్టపోయారు. మొదటి పార్లమెంటు సభలో ఓసీ మహిళలు–33, ఎస్సీ మహిళలు–నలుగురు. ఈ అసమాన పరంపర 2024 దాకా కొనసాగుతూనే ఉంది. 18వ (2024) లోక్‌సభలో ఓసీ మహిళలు–55, ఎస్సీ మహిళలు–11, ఎస్టీ మహిళలు–ఐదుగురు, బీసీ మహిళలు–నలుగురు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బహుజన కులాల మహిళల ప్రాతినిధ్యం మరీ దారుణం. 119 ఎమ్మెల్యేలలో మహిళలు 9 మందే! వారిలో ఓసీ మహిళలు–ఐదుగురు, బీసీ మహిళ–ఒకరు, ఎస్సీ మహిళ–ఒకరు, ఎస్టీ మహిళలు–ఇద్దరు.
మహిళా ప్రాతినిధ్యాలంటే ఏ కులాల మహిళల ప్రాతినిధ్యాలు? అనే స్పష్టత పాలక రాజకీయ పార్టీలతో పాటు ఆయా మహిళలు కూడా సమాజాన్ని ఏమారుస్తున్నారు. మహిళలంటే ఆధిపత్య కుల స్ర్తీలనే ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఆధిపత్య కులాల మగవారి నియంత్రణలో ఉన్నాయి. వ్యవస్థల్ని నడిపిస్తున్న వీరు సామాజిక జెండర్ ప్రజాస్వామ్యాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా తమ కుటుంబాల్లోని మహిళలకు ఆస్తి వారసత్వం లాగా, రాజకీయ వారసత్వాన్ని లెక్కకు మిక్కిలిగా ఇచ్చి చట్టసభలకు పంపడం ఏడు దశాబ్దాలుగా జరుగుతోంది. అట్లా అతి తక్కువగా ఉన్న ఓసీ మహిళలదే చట్టసభల్లో పెద్ద మెజారిటీ. బహుజన కులాల మహిళల పట్ల, చట్టసభల్లో వారి ప్రాతినిధ్యాల పట్ల ఆధిపత్య కుల రాజకీయం కొనసాగుతోంది.
నిజానికి చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యానికి సంబంధించిన, మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళల జనాభా దామాషా ప్రకారం రూపొందలేదు. గీతా ముఖర్జీ, ప్రమీల దండావతే వంటి సవర్ణ మహిళా ప్రజాప్రతినిధులు బిల్లు రూపకల్పనలో బహుజన మహిళను భాగం చేయలేదు. ఓసీ మహిళలనే ప్రాతిపదికగా తీసుకుని ఓబీసీ, మైనారిటీ మహిళలను విస్మరించి రూపొందించిన బిల్లు అది. ఈ బిల్లు రూపకర్తల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు ఉండివుంటే సబ్ కోటాతో మహిళా బిల్లు రూపొందేది. రాజకీయ పార్టీల మగస్వామ్య కనుసన్నల్లో ఓసీ మహిళల కోసం రూపొందిన బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు. దీనిని పార్లమెంట్‌లో పెట్టినప్పుడు చట్టసభల్లోని రిజర్వేషన్లలో బహుజన మహిళలకు కూడా వాటా ఉండాలని, సబ్ కోటా చేర్చాలని, సబ్ కోటా లేని బిల్లును ఆమోదించేది లేదని ఎస్పీ, బీఎస్పీ పార్టీ నాయకులు ఈ బిల్లును వ్యతిరేకించడంతో సవర్ణ ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’ ఆగిపోయింది. ఈ బిల్లును వ్యతిరేకించిన వారిని అభివృద్ధి నిరోధకులనీ, మహిళా విరోధులనీ, సబ్ కోటా కోరుతున్న వారి వల్లనే మహిళా బిల్లు వీగిపోయిందని ప్రచారం చేశారు. మార్క్సిస్ట్, ఫెమినిస్ట్ మహిళా సంఘాలు కూడా మహిళలను కులాల వారీగా విభజించొద్దని, ఐక్యత చెడుతుందని, సబ్ కోటా లేని సవర్ణ మహిళా యథాతథ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని వాదించాయి.
సమాజంలో పురుషులు వివిధ కులాలు, మతాలుగా ఉన్నట్లే మహిళలు కూడా భిన్న సామాజికంగా ఉన్నారు. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చుతూ ఆధిపత్య కులాలు మహిళా రాజకీయాలు చేస్తున్నాయి. 1952 నుంచి ఏడు దశాబ్దాలుగా నిరవధికంగా చట్టసభల్లో అధిక సంఖ్యాకులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సవర్ణ మహిళల వల్ల బహుజన కులాల మహిళలకు ప్రయోజనం జరగలేదు. ఆధిపత్య కులాల మహిళలకు అన్యాయం జరిగినప్పుడు, అత్యాచారాలూ హత్యలూ జరిగినప్పుడు మాత్రమే ఈ మహిళల గొంతు ఎంత తీవ్రంగా స్పందిస్తుందో, గగ్గోలు పెడుతుందో... నిర్భయ, దిశ ఘటనల్లో చూశాం. కానీ నిత్యం ఎస్సీ, ఎస్టీ మహిళల మీద జరిగే అత్యాచారాలూ హత్యల మీద వారి గొంతులు పెగలవు. ఆ మహిళల సమస్యల మీద మాట్లాడరు, చర్చించరు.
అందుకే– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు తమ కోసం తామే నిలబడాలి. తమ రాజకీయ, ఆర్థిక, సామాజిక హక్కుల కోసం చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం ఉండే బహుజన ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’కై మూడు దశాబ్దాలుగా పోరాడారు. అయినా 1996 నుంచి బిల్లులో సబ్ కోటా చేర్చకుండా చట్టసభల్లో ఓసీ మహిళల ప్రాతినిధ్యం ఏ అడ్డంకులు లేకుండా సజావుగా సాగింది. 2004 పార్లమెంట్ ఎలక్షన్స్‌కు ముందు, 2023 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం 106వ రాజ్యాంగ సవరణ చేసి ఓబీసీ, మైనారిటీ మహిళల కోటా లేకుండానే ‘నారీ శక్తి వందన్ అధినియం’ పేరుతో సవర్ణ ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’ను పార్లమెంట్‌లో ఏకగ్రీవంగా ఆమోదింపజేసింది. బలమైన బహుజన రాజకీయ పార్టీల గొంతులు లేనందువల్ల ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.
ఎస్సీ, ఎస్టీ మహిళల్ని బిల్లులో చేర్చింది వారి మీద ప్రేమతో కాదు, ఉద్ధరణకు కాదు. (బీజేపీ 31 మంది మహిళా ఎంపీలను గెలిపిస్తే... వారిలో ఒకే ఒక ఎస్సీ మహిళా ఎంపీ ఉన్నారు!) ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు రాజ్యాంగ ఆదేశంగా ఉన్నవే. ఓబీసీ, ముస్లిం మహిళలు కూడా ఈ దేశ మహిళలే కదా! వారిని ఎందుకు బిల్లులో విస్మరించినట్టు? బలీయమైన కుల, మగ, మనువాద రాజకీయశక్తులు సబ్ కోటాను అణచివేసి, తమ మహిళల ప్రాతిపదికగా రూపొందించిన బిల్లును యథావిధిగా పాస్ చేయించాయి. బిల్లు అమలు కావాలంటే సెన్సెస్, డీలిమిటేషన్ జరిగిన తర్వాతే అని వాటితో లింకు పెట్టింది.
కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ నెల (16, 17, 18 తేదీలు)లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి మహిళా బిల్లును 2029లోనే అమలు చేయాలని ప్రచారం చేసుకుంది. మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును ఆమోదించుకునే కుతంత్రం వీగిపోయింది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలన్నీ మహిళా బిల్లును వెంటనే అమలు చేయాలని, డీలిమిటేషన్‌తో కలపవద్దని మాట్లాడాయి. కానీ మహిళా బిల్లు సబ్ కోటా మీద ఒత్తిడి తేలేదు. కారణం– వారి మహిళల ప్రాతినిధ్యాలకు జరిగిన నష్టమేమీ లేదు కనుక. నష్టపోతున్న బహుజన మహిళల పోరాటాలు నిర్మించాలి. ఓబీసీ, మహిళా శ్రేణుల జనాభా దామాషా ప్రకారం మహిళా రిజర్వేషన్స్ లేనంత వరకు ఈ మహిళా బిల్లు సవర్ణ మహిళా రిజర్వేషన్ బిల్లే.
జూపాక సుభద్ర
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News