నారీశక్తి కోసం నిలబడాల్సిన తరుణం!
ABN , Publish Date - Apr 09 , 2026 | 02:36 AM
మరికొన్ని రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో పండుగల సందడి మొదలవబోతున్నది. అస్సాం ప్రజలు రొంగాలి బిహు జరుపుకొంటే, ఒడిశా ప్రజలు మహా బిషుబ పాన సంక్రాంతి జరుపుకుంటారు. పశ్చిమ బెంగాల్లో...
మరికొన్ని రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో పండుగల సందడి మొదలవబోతున్నది. అస్సాం ప్రజలు రొంగాలి బిహు జరుపుకొంటే, ఒడిశా ప్రజలు మహా బిషుబ పాన సంక్రాంతి జరుపుకుంటారు. పశ్చిమ బెంగాల్లో పొయిలా బైశాఖ్ బెంగాలీల నూతన సంవత్సరానికి నాంది పలికితే, కేరళలో విషు పండుగను సంబరంగా చేసుకుంటారు. తమిళనాడులో పుత్తాండు పర్వదినాన్ని, పంజాబ్‌తోపాటు ఉత్తర భారతంలోని ఇతర ప్రాంతాల్లో బైశాఖీ వేడుకను చేసుకుంటారు. ఇవన్నీ ఆశాభావాన్ని, సానుకూల దృక్పథాన్ని పెంపొందించే పండుగలు. దేశవిదేశాల్లో ఈ పండుగలు జరుపుకొనే వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పవిత్ర వేడుకలు అందరి జీవితాల్లో ఆనందాన్నీ, సౌభాగ్యాన్నీ తీసుకురావాలని కోరుకుంటున్నాను. వీటితోపాటు, ఏప్రిల్ 11 నుంచి మహాత్మా ఫూలే 200 జయంతి ఉత్సవాలు కూడా మొదలవుతున్నాయి. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా యావత్ భారతదేశం ఆయనకు నివాళి అర్పించబోతున్నది. మన మనసులనూ, ఆలోచనలనూ నూతన స్ఫూర్తితో నింపివేసే ఈ ప్రత్యేక సందర్భాలతోపాటు, మన దేశం మరో చరిత్రాత్మక సందర్భానికి సిద్ధమవుతున్నది. ప్రజాస్వామ్య పునాదులను మరింత పటిష్టం చేయడానికి, సమానత్వం పట్ల మన నిబద్ధతను నొక్కి చెప్పడానికి లభించిన గొప్ప అవకాశమిది.
మహిళల రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్లే ముఖ్యమైన బిల్లుపై చర్చించేందుకు, ఆమోదించేందుకు ఏప్రిల్ 16న పార్లమెంటు సమావేశమవుతున్నది. దీనిని ఓ శాసన సంబంధమైన కార్యక్రమంగా భావిస్తే ఈ బిల్లు ప్రాధాన్యాన్ని తగ్గించినట్టే! దేశంలోని కోట్లాది మంది మహిళల ఆకాంక్షలకు ఇది ప్రతిబింబం. మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే సమాజం పురోగమిస్తుందనే మన చిరకాల నాగరికతా స్ఫూర్తికి ఇది నిదర్శనం.
మన దేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళలే ఉన్నారు. వారు ఈ దేశానికి అందిస్తున్న సేవలు అపారం, అమూల్యం. ప్రతి రంగంలోనూ మహిళలు సాధిస్తున్న అద్భుతమైన విజయాలకు దేశమంతా గర్వపడుతున్నది. శాస్త్ర, సాంకేతిక రంగాలు మొదలుకొని ఔత్సాహిక పారిశ్రామిక రంగం వరకు, క్రీడల నుంచి రక్షణ బలగాల వరకు, సంగీతం నుంచి కళల వరకు దేశాభివృద్ధిలో మహిళలు ఎంతో కీలకంగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా స్థిరంగా కొనసాగుతున్న అనేక ప్రయత్నాల వల్ల మహిళా సాధికారతకు సానుకూలమైన వాతావరణం ఏర్పడింది. చదువుకునేందుకు అవకాశాలు విస్తృతం కావటం, ఆరోగ్యసేవలు మెరుగుపడటం, సంపద సృష్టిలో సమాన భాగస్వామ్యం, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావటం... ఈ మార్పుల వల్ల ఆర్థిక, సామాజిక జీవితాల్లో మహిళల వంతు పెరిగింది. కానీ, సమాజంలో పెరుగుతున్న ఈ మహిళా భాగస్వామ్యానికి అనుగుణంగా రాజకీయ రంగంలోనూ, శాసనసభల్లోనూ వారి ప్రాతినిధ్యం పెరగలేదు. ఇది ఎంతో దురదృష్టకరం, ఎందుకంటే– పాలనలోనూ, నిర్ణయాధికారంలోనూ మహిళలు పాలుపంచుకొన్నప్పుడు వారిదైన ఆలోచనలతోనూ, అనుభవాలతోనూ సామాజిక చర్చలు మరింత నిశితమవుతాయి, పాలనా సామర్థ్యం మరింత బాగుపడుతుంది.
2029లో లోక్‌సభకు, వివిధ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగే నాటికల్లా మహిళా రిజర్వేషన్లు అమలులోకి రావటం అనివార్యం. ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలకు దక్కాల్సిన ప్రాధాన్యాన్ని దక్కేలా చేసేందుకు గత ప్రభుత్వాలు దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. కమిటీలు ఏర్పాటయ్యాయి. ముసాయిదా బిల్లులను ప్రవేశపెట్టారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. అయినప్పటికీ, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్న అంశంలో మాత్రం అందరికీ ఏకాభిప్రాయం ఉంది. ఈ ఏకాభిప్రాయ స్ఫూర్తితోనే 2023 సెప్టెంబరులో నారీ శక్తి వందన్ అధినియమ్‌ను పార్లమెంటు ఆమోదించింది. నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన సందర్భాల్లో ఒకటిగా నేను దీన్ని భావిస్తాను.
మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఈ సందర్భం మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైనది. సమానత్వం అత్యున్నత విలువగా ఉన్న సమాజాన్ని నిర్మించాలని మన రాజ్యాంగ నిర్మాతలు, ముఖ్యంగా రాజ్యాంగ పరిషత్తులోని మహిళా సభ్యులు, ఆకాంక్షించారు. శాసన వ్యవస్థల్లో మహిళల పాత్రను బలోపేతం చేయడమన్నది ఈ ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ఒక కీలకమైన ముందడుగు. దేశ భవిష్యత్తును మలచడంలో ప్రతి పౌరుడికీ సమానమైన అవకాశముండే సమాజాన్ని ఏర్పాటు చేసే దిశగా మా చిత్తశుద్ధికి ఇది తార్కాణం.
ఇది ఇక ఎంతమాత్రమూ వాయిదా వేసేందుకు వీల్లేని విషయం. మహిళల సమాన ప్రాతినిధ్యాన్ని బలపరచటంలో జరిగే ఏ ఆలస్యమైనా, అది మన ప్రజాస్వామ్యాన్ని సమానత్వ స్ఫూర్తి దిశగా తీసుకువెళ్ళటంలో జరిగే ఆలస్యం కిందే లెక్క! శాసన వ్యవస్థల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని దశాబ్దాల క్రితమే గుర్తించారు, దానిపై చర్చలు జరిపారు, అది తప్పనిసరి కర్తవ్యంగా నిర్ధారించారు. ఇప్పుడు ఇంకా ఈ విషయంపై ఒక చర్య తీసుకోవటంలో ఆలస్యం జరిగితే, మనం ఇప్పటికే గుర్తించిన, సరిదిద్దగలిగిన వివక్షను మరింతకాలం కొనసాగించినట్టే అవుతుంది. మన దేశం ఒక నిర్దిష్ట లక్ష్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తున్న ఈ తరుణంలో, దేశంలోని అన్ని వ్యవస్థలూ ఇక్కడి సమస్త పౌరుల, ముఖ్యంగా జనాభాలో సగభాగంగా ఉన్న మహిళల, ఆకాంక్షలను ప్రతిబింబించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తక్షణం ఈ చర్య చేపట్టడం వల్ల ఎంతోకాలంగా పూచీపడి ఉన్న వాగ్దానాలు నెరవేరడమే కాదు, అభివృద్ధి వైపు సాగుతున్న వేగం కూడా నెమ్మదించకుండా అలాగే కొనసాగుతుంది. మన ప్రజాస్వామ్యాన్ని మరింత సమాన ప్రాతినిధ్యం కల్పించేదిగా, స్పందించేదిగా, భవిష్యత్తుకు అనుగుణమైనదిగా తీర్చిదిద్దేందుకు ఇది ఒక చరిత్రాత్మకమైన అవకాశం.
ఇప్పుడు సమిష్టి కార్యాచరణకు సమయం ఆసన్నమైంది. ఇది ఏ ఒక్క ప్రభుత్వానికో, పార్టీకో లేదా వ్యక్తికో సంబంధించిన విషయం కాదు. దేశం మొత్తం ఈ అంశంలో ముందడుగు ఎంత ముఖ్యమో గుర్తించాలి, దీన్ని సాకారం చేయటానికి ఏకం కావాలి. మన దేశ నారీశక్తికి ఇదే మనం చేయగలిగింది. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లుకు లభించే ఆమోదంలో విస్తృత ఏకాభిప్రాయం వ్యక్తం కావాలి. జాతీయ ప్రయోజనాలే పరమావధి కావాలి. ఇది మనం మన కోసం కాక, మన భావి తరాల కోసం పని చేసే సదవకాశం లభించిన సందర్భం. మార్పులను స్వీకరిస్తూ, మరింత సమ్మిళితత్వాన్ని సాధించడంలోనే అసలైన ప్రజాస్వామ్య స్ఫూర్తి దాగి ఉందన్న సంగతిని గుర్తు చేసే సందర్భం.
చరిత్రాత్మకమైన ఈ పార్లమెంటు సమావేశం సమీపిస్తున్న నేపథ్యంలో– భారతీయ మహిళల కోసం చేపడుతున్న ఈ ముఖ్యమైన కార్యక్రమానికి మద్దతు అందించాలని పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బాధ్యతగా వ్యవహరించేందుకు ముందుకు వద్దాం. అత్యున్నత ప్రజాస్వామ్య విలువల కోసం కలిసి నడుద్దాం.
జాతీయ ప్రయోజనాల విషయంలో విబేధాలను పక్కన పెట్టి, కలిసికట్టుగా పనిచేయగలదని భారత్ ఎప్పుడూ రుజువు చేసుకుంటూనే ఉన్నది. ఇది అలాంటి సందర్భమే. అందరం కలసికట్టుగా ముందుకు సాగుదాం. రాజ్యాంగ విలువలను బలోపేతం చేద్దాం. దేశ ప్రగతి కోసం మహిళాశక్తికి సాధికారత కల్పిద్దాం.
నరేంద్ర మోదీ
భారత ప్రధానమంత్రి
ఈ వార్తలు కూడా చదవండి..
హోంగార్డుల సమస్యలు పరిష్కరించండి: సీఎం చంద్రబాబుకు ఏపీ బీజేపీ చీఫ్ లేఖ
తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా ప్రత్యేక రైళ్లు
For More AP News And Telugu News