మూడు దశాబ్దాలుగా ఎదురుచూపులే!
ABN , Publish Date - May 08 , 2026 | 12:24 AM
పార్లమెంట్, శాసనసభల స్థాయిలో కూడా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలనే ప్రయత్నం మూడు దశాబ్దాలుగా సాగుతున్న కథగా మారింది. 1992–93లో గ్రామపంచాయతీలు, పట్టణ, స్థానిక సంస్థల్లో 33శాతం...
పార్లమెంట్, శాసనసభల స్థాయిలో కూడా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలనే ప్రయత్నం మూడు దశాబ్దాలుగా సాగుతున్న కథగా మారింది. 1992–93లో గ్రామపంచాయతీలు, పట్టణ, స్థానిక సంస్థల్లో 33శాతం మహిళా రిజర్వేషన్ అమలు ఒక గొప్ప ముందడుగు. ఆ తర్వాత 2010లో 108వ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. ఇది మహిళా రిజర్వేషన్ చరిత్రలో ఒక కీలక ఘట్టం. అయితే, లోక్‌సభలో ఆమోదం పొందకపోవడం, 2014లో ప్రభుత్వం మారడంతో నారీ లోకానికి మరోసారి నిరాశే మిగిలింది. తరువాత ‘నారీ శక్తి వందన్ అధినియం’ పేరుతో 2023లో 128వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో భారీ మెజారిటీతో (454/543), రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొంది చట్టంగా మారింది. ఇది మూడు దశాబ్దాల పోరాటానికి ఒక విజయంలా కనిపించింది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఈ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురాలేదు. దీనిని జనగణన, నియోజకవర్గాల పునర్విభజనతో ఆర్టికల్ 334–ఎ ద్వారా అనుసంధానం చేశారు. ఫలితంగా 2026 నాటికి కూడా మహిళలకు రిజర్వేషన్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అసలు మహిళా రిజర్వేషన్ నిజంగా అమలు చేయాలనే సంకల్పమా, లేక రాజకీయ లెక్కలతో వాయిదా వేయాలనే ప్రయత్నమా? ప్రస్తుత 543 లోక్‌సభ సీట్లలోనే 33శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా సీట్లను పెంచాలనే ఆలోచన ముందుకు తేవడం, ఇప్పటికే ఉన్న పురుషాధిపత్యాన్ని కదిలించకుండా సమస్యను పక్కకు నెట్టే ధోరణిగా కనిపిస్తుంది. మహిళా రిజర్వేషన్‌ను భవిష్యత్ ప్రక్రియలకు కట్టిపెట్టకుండా, ప్రస్తుత శాసన వ్యవస్థలోనే వెంటనే అమల్లోకి తేవాలి. ఓబీసీ మహిళలకు ప్రత్యేక సబ్–కోటా ఇవ్వాలి.
స్వాతి కొత్త
పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్
ఈ వార్తలు కూడా చదవండి..
డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష
Read Latest AP News And Telugu News