Share News

Global Wars Impact: ఇలా..యుద్ధాలతో నశిస్తామా

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:41 AM

యుద్ధాలు లేకపోతే, ఉద్రిక్తతలు అంతరిస్తే ప్రపంచం ఎంతో అందంగా మారిపోతుంది, ఆర్థికంగా కళకళలాడుతుంది. ప్రపంచ జీడీపీ ఒక్కసారిగా అయిదు శాతం వరకూ ఎగబాకుతుంది. 2021లో...

Global Wars Impact: ఇలా..యుద్ధాలతో నశిస్తామా

యుద్ధాలు లేకపోతే, ఉద్రిక్తతలు అంతరిస్తే ప్రపంచం ఎంతో అందంగా మారిపోతుంది, ఆర్థికంగా కళకళలాడుతుంది. ప్రపంచ జీడీపీ ఒక్కసారిగా అయిదు శాతం వరకూ ఎగబాకుతుంది. 2021లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం యుద్ధాలు, ఘర్షణలే లేకపోతే– కృత్రిమ మేధ (ఏఐ), బయోటెక్నాలజీ, ఇంధన రంగాలు చాలా ఏళ్లక్రితమే మానవాళికి అందుబాటులోకొచ్చేవి. ఆకలి, అనారోగ్యం, దారిద్య్రం అంతమయ్యేవి. మానవజాతి ఇంకా ఎంతో ప్రగతి సాధించి, ఆనందదాయక ప్రపంచం ఏర్పడి ఉండేది.

చరిత్రలో నమోదైన తొలి రాజ్య విస్తరణ యుద్ధం క్రీస్తు పూర్వం 336–323 మధ్య జరిగింది. వ్యూహం, ఎత్తుగడల్లో ఆరితేరిన అలెగ్జాండర్‌ సాగించిన యుద్ధమది. అతడిని గ్రీకువీరుడిగా, జగజ్జేతగా నిలబెట్టడానికి ఆ యుద్ధం తోడ్పడి ఉండొచ్చు గానీ, అందులో మరణించిన సైనికులు, ప్రజల సంఖ్య లక్షల్లో ఉండవచ్చని అంటారు. ఇక దానివల్ల వచ్చిపడిన కరువు కాటకాలు, అంటువ్యాధుల సంగతి చెప్పనవసరం లేదు. ప్రపంచ జనాభా అప్పటికి దాదాపు 10 కోట్లకు మించదు. చాలా సమాజాలు ఈ యుద్ధం తర్వాత నిర్మానుష్యంగా మారడం లేదా బానిసలుగా పరాయి దేశాలకు పోవడం జరిగాయంటే జన నష్టం ఎంతగా జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు. అటుతర్వాత ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేకానేక యుద్ధాలు, వాటి పర్యవసానాలు లక్షలమంది ఉసురుతీశాయి.

ఆధునిక ప్రపంచానికి పూర్వదశలో 1618–1648 మధ్య యూరప్‌లో మూడు దశాబ్దాలపాటు సాగిన నిరంతరాయ యుద్ధాలు దాదాపు 80 లక్షల మందిని బలిగొన్నాయి. ఇందులో ఆ యుద్ధాలు తెచ్చిన కరువు, వ్యాధుల కారణంగా అకాల మరణం చెందినవారు కూడా ఉన్నారు. అప్పటికి ప్రపంచ జనాభా దాదాపు 60 కోట్లు. ఇక ఇరవయ్యో శతాబ్దానికి వస్తే– యుద్ధతంత్రం, మారణాయుధాల విన్యాసం కొత్త పోకడలు పోయాయి. మొదటి ప్రపంచయుద్ధ సమయానికి ప్రపంచ జనాభా 200 కోట్లయితే, ఆ యుద్ధంలో దాదాపు 2 కోట్లమంది మరణించారు. రెండో ప్రపంచ యుద్ధం వల్ల సాగిన నరమేధంతోపాటు అది సృష్టించిన కరువు కాటకాలు, విరుచుకుపడిన వ్యాధుల వల్ల మృతి చెందినవారి సంఖ్య 8.5 కోట్లు! ఇది చరిత్రలో నమోదైన అతిపెద్ద ఉత్పాతం. ప్రస్తుతం సాగుతున్న రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇప్పటికే లక్షలాది మంది మరణించారు. గాజాలో ఇజ్రాయెల్‌ జన హననం, ఇతరేతర యుద్ధాలు ఈ సంఖ్యను మరిన్ని లక్షలకు పెంచాయి.


వరుస యుద్ధాలు, ఘర్షణలు మానవ జీవితాన్ని ఇక్కట్లపాలు చేస్తూ, కోలుకోలేని నష్టాలు కలగజేస్తున్నాయి. సాధించుకున్న అభివృద్ధినంతా నీరుగారుస్తూ దశాబ్దాలూ, శతాబ్దాలూ వెనక్కి తీసుకెళ్తున్నాయి. చరిత్ర నేర్పిన గుణపాఠాలు ఈ పరీక్షా సమయంలో సమష్టితత్వాన్ని బోధిస్తున్నాయి. యుద్ధాల పర్యవసానంగా కలిగే నష్టాలను కనిష్ఠ స్థాయిలో ఉంచాలని, ప్రపంచ పౌరుల రక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరుతున్నాయి. విని, జీవితాలను నిలబెట్టుకోవడమా? విస్మరించి నశించిపోవడమా? అన్నది తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

ధరిత్రి చరిత్రలో ఇంతవరకూ అయిదుసార్లు జీవుల సమూల నిర్మూలనలు (extinctions) జరిగాయంటారు. వాటిని ‘బిగ్‌ ఫైవ్‌’గా పిలుస్తారు. తొలిసారి 44.4 కోట్ల సంవత్సరాల క్రితం, ఆ తర్వాత 36 కోట్ల సంవత్సరాల క్రితం, ఆ తర్వాత 25 కోట్ల సంవత్సరాల క్రితం, దరిమిలా 20 కోట్ల సంవత్సరాల క్రితం, మరలా 6.6 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్ల వంటి అభివృద్ధి చెందిన జీవులు సమూలంగా అంతరించాయని ఆ సిద్ధాంతం చెబుతోంది. వంద అణు బాంబులు పేలితే ఈ భూ మండలం మొత్తం భస్మీపటలమై మానవజాతి పూర్తిగా అంతరించిపోక తప్పదు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం క్రమంగా నాటో దేశాలకూ విస్తరించి, అది అణ్వస్త్ర దాడులకు దారి తీసే ప్రమాదం పొంచి ఉంది. రాచరికాలు అంతరించి, జనస్వామ్యాలు అవతరించి వర్ధిల్లుతున్న ఈ యుగంలో సామూహిక హననం వైపు మానవాళి ప్రయాణం సాగిస్తుందా? సమష్టిలోనే తనకు బంగారు భవిత ఉంటుందని గ్రహిస్తుందా? చూద్దాం.

బి.టి.గోవిందరెడ్డి

ఈ వార్తలు కూడా చదవండి...

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ

Tirupati Incident: తిరుపతి జిల్లాలో బీర్ల పోటీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 20 , 2026 | 12:41 AM