యువ రచయితల ముందున్న మార్గం మునుపటి కంటే సంక్లిష్టం
ABN , Publish Date - Feb 23 , 2026 | 05:51 AM
తెలుగు సాహిత్య రంగంలో ఇటీవల చోటు చేసుకుంటూన్న కొన్ని ఆసక్తికర ధోరణుల గురించి 16 ఫిబ్రవరి 2026 నాటి ‘వివిధ’లో ‘అసలు ఊహించామా ఇంతమంది పాఠకులను!’ అనే వ్యాసంలో మిత్రుడు పవన్ సంతోష్ సూరంపూడి...
తెలుగు సాహిత్య రంగంలో ఇటీవల చోటు చేసుకుంటూన్న కొన్ని ఆసక్తికర ధోరణుల గురించి 16 ఫిబ్రవరి 2026 నాటి ‘వివిధ’లో ‘అసలు ఊహించామా ఇంతమంది పాఠకులను!’ అనే వ్యాసంలో మిత్రుడు పవన్ సంతోష్ సూరంపూడి ప్రస్తావించారు. దానికి కొనసాగింపుగా, ఆయా ధోరణుల మూలాలను అన్వేషించే ప్రయత్నం ఈ వ్యాసం.
ప్రింట్ మీడియా నిస్సందేహంగా వెనుకంజ వేసింది. ఒకప్పుడు తెలుగు భాషనీ, సాహిత్యాన్నీ నిర్వచించి నిర్వహించిన పత్రికలు నేడు లేవు; అలాగే బాల్యదశ నుండీ పాఠకుల చేయిపట్టుకొని అభ్యుదయం వైపుగా నడిపించిన సోవియట్ సాహిత్యమూ లేదు. మరోవైపు గ్రంథాలయ వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఈ రెండు ధోరణులూ – నెమ్మదిగానైనా పెరుగుతూ వస్తూన్న గ్రామీణ అక్షరాస్యత నడుమ సంభవించడం ఒక విషాదం. కొత్త తరం అక్షరాస్యులకు ప్రింటు మీడియా సాహిత్యం అందుబాటు లేకుండా పోయింది; డిజిటల్ మీడియాని అందుకొనే స్తోమత, అవకాశాలూ కొద్దిమందికే ఏర్పడ్డాయి. ఇందుకు ప్రతిస్పందనగా పుస్తకాల ‘తోపుడు బండి,’ ‘మరో గ్రంథాలయ ఉద్యమం’ వంటి క్షేత్రస్థాయి ప్రయత్నాలు జరిగాయి; జరుగుతున్నాయి. ప్రభుత్వాల వైఫల్యాన్ని ఈ చెదురుమదురు ప్రయత్నాలు పూడ్చలేవు. ఇతర దక్షిణాది రాష్ట్రాలలోనూ, బెంగాల్, కేరళలలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నది. గ్రంథాలయాల అభివృద్ధికీ, సాహిత్యవికాసానికీ ఈ రాష్ట్రాలు, యావద్భారతదేశానికి మార్గదర్శకంగా నిలిచాయి.
తెలుగు రాష్ట్రాల విద్యా విధానానికిగల ప్రత్యేకత – సామాజిక శాస్త్రాలపై చిన్నచూపు. సాంకేతిక విద్యకు సముచిత స్థానం ఇవ్వడం సరైనదే అని భావించినా, ఈ రెండిటిమధ్యా పోటీ ఉండనవసరం లేదని పొరుగు రాష్ట్రాల అనుభవాలు తెలియజేస్తున్నాయి. ఈ ధోరణులన్నీ రాజకీయాలకు అతీతంగా, కేవలం పాలకుల అసమర్థత మూలంగానే చోటు చేసుకుంటున్నాయనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. నేటి బుల్‌డోజర్ పాలనలో – గ్రంథాలయాల నిధులను తొక్కిపెట్టడం, హిందీని బలవంతంగా రుద్దడం, సామాజిక శాస్త్రాల నుండి యువతరాన్ని దూరం పెట్టడం– ఇవన్నీ ఒక పథకం ప్రకారమే జరుగుతున్నాయి. యువతరాన్ని సమాజానికీ, సమిష్టితత్వానికీ ఎడంగా, కేవలం వ్యక్తిగత విజయాలపైనే దృష్టి పెట్టేవారిగా కట్టడి చేయడం పాలకుల లక్ష్యం.
పైన పేర్కొన్న అవలక్షణాలకు ప్రతిస్పందనగానే నేడు ద్రవిడ సాంస్కృతికోద్యమాలు బలపడుతున్నాయి. బుక్ బ్రహ్మ ఉత్సవానికీ, తదితర దక్షిణభారత భాషల సాహితీ కార్యక్రమాలకూ లభిస్తూన్న ఆదరణ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, హిందీయేతర భాషలకు జాతీయస్థాయి సాహిత్య పురస్కారాలని ప్రకటించడం – ఇవేవీ కాకతాళీయంగా జరిగిపోతున్న పరిణామాలు కాదు. ప్రముఖ దక్షిణాది నటులు ప్రకాష్ రాజ్ సాహిత్య సభల్లో చేస్తూన్న ప్రసంగాలను, అలాగే కమల్ హసన్ పార్లమెంటులో శ్రీశ్రీని ఉటంకించడాన్ని కూడా ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి.
నేటి యువతరం రచనలో కనిపిస్తూన్న ధోరణులను – ఈ వ్యాస లక్ష్యాల పరిధిలో పరికిస్తే, రెండు రకాల రచనలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. మొదటగా – సాహిత్యం ఏకకాలంలో సాగే బాహ్యసమాజ సందర్శనం, అంతర్ముఖ ప్రయాణం అనుకుంటే – నిబద్ధతతో కూడిన నేటి తరం చేస్తూన్న రచలను శ్రద్ధగా పరిశీలించాలి. అవి చుట్టూ ఉన్న సంక్షోభ శకలాలతో తలపడుతూ, నిత్యం సంఘర్షిస్తూ రాసుకున్నవి; ఆధునిక సమాజపు అనిశ్చతలతోనూ, మానవసంబంధాల విచ్ఛిన్నంతోనూ, అత్యంత వేగవంతంగా మారిపోతూన్న పరిస్థితులతోనూ తలపడుతూ రాసుకున్నవి. నగరజీవన ఆకర్షణలు పైపై తళుకుబెళుకులే అని వాళ్లకి తెలుసు. వాళ్లని నిలదీసేవి స్త్రీ–పురుష సంబంధాలు, లైంగికత్వం, పెళ్లి – వీటి చుట్టూ పేరుకుపోయిన అస్థిరతలు. అనేక రకాల వివక్షలు ఆధారంగా నిర్మితమైన ప్రపంచం తన ఆధునిక రూపంలో సృష్టిస్తూన్న అసంబద్ధ అయోమయాలలో తామెవరో తెలుసుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలు వారివి. ముందుతరంలో ఉండిన సుస్థిరతలు ఇప్పుడు లేవు. సంప్రదాయాలే మనకు శ్రీరామరక్ష అనిగాని, విప్లవమే అన్నిటికీ పరిష్కారం అనిగానీ ఎవరైనా అంటే అది వాళ్లకి ఆమోదయోగ్యం కాదు. యువతరం రచనల్లో దిక్కుతోచని విషాదం ఇమిడి ఉన్నది.
ఇక రెండవ తరహా రచనలకు వొస్తే– నేటి వాణిజ్య ప్రపంచపు విజయాలకు కొలమానాలైన తక్షణ కీర్తి, విశేషమైన ధనార్జన– ఇవే వీటి పరమావధి. ఇవి సహజం గానే రూప–సారాల్లో మార్కెట్ శక్తులతోనూ, సినిమా పరిశ్రమతోనూ ముడిపడి ఉంటాయి; ఆయా రచయితలు సినిమారంగ ప్రవేశానికై ఉవ్విళ్లూరుతుంటారు. రచనల్లో ఏముంది అనే చర్చకన్నా ఎన్ని కాపీలు అమ్ముడు పోయాయి? అనేదే చర్చాంశంగా నిలిచిపోతుంది. ఏ రచయిత అయినా ఎక్కువమంది పాఠకులను చేరుకోవాలనే అనుకుంటాడు. రచనలో సత్తా ఉంటే అది ఎప్పటికైనా చేరాల్సిన పాఠకులను చేరుకుంటుంది. ఏది ఏమైనా పాఠకుల సంఖ్య పెరగడం, సాహిత్య కార్యక్రమాలకు, పుస్తక ప్రదర్శనలకు పెద్దఎత్తున యువతీయువకులు హాజరుకావడం ఆహ్వానించాల్సిన పరిణామమే. పుస్తకపఠనం అలవాటుగా మారాలేగానీ, అది తనంటతానే పరిణితి చెందుతుంది.
సినిమాలకు సాహిత్యంతో అవసరం ఎప్పుడూ ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ సినిమాల నిర్మాణానికి నవలలు, కథలు ఆధారంగా నిలిచాయి. అయితే అవేవీ సినిమా మాధ్యమాన్ని లక్ష్యంగా పెట్టుకొని చేసిన రచనలుకావు. ఉత్తమ సాహిత్యం యథాస్థితిని ప్రతిఘటిస్తుంది; కట్టు బాట్లని ప్రశ్నిస్తుంది. ఇతివృత్తపరంగానూ, శైలిలోనూ మూసపద్ధతిని వొదిలించుకొనే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇందుకు తెలుగు సాహిత్యంలో ఎన్నో ఉదా హరణలున్నాయి. ఈ మేరకు నేటి యువ రచయితల మార్గం కూడా భిన్నం కాదు. అయితే కచ్చితంగా పూర్వం కన్నా సంక్లిష్టం. రాబోయే రోజుల్లో బాహ్య, అంతర్జాతీయ సామాజిక సందర్శనం కూడగట్టే ప్రతిఘటన వైపుగా, అంతర్ముఖ ప్రయాణం ఏర్పరచే స్పష్టత దిశలో మన యువ రచయితలు ప్రయాణించబోతున్నారు. వారికి డిజిటల్ ప్రపంచం అవరోధంగా కాకుండా, సర్వవ్యాపిత సాధనంగా ఉండబోతోంది. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహమూ ఉండనక్కరలేదు.
ఉణుదుర్తి సుధాకర్
90006 01068
ఈ వార్తలు కూడా చదవండి..
తపాలాశాఖ సేవలను మరువలేం: సీఎం చంద్రబాబు
శ్రీవారి లడ్డూలో నెయ్యికి బదులు రసాయనాలు కలిపారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం..
Read Latest Telangana News And AP News And Telugu News