ప్రతిపక్షాల ధర్మాగ్రహాన్ని ప్రజలెందుకు పట్టించుకోలేదు?
ABN , Publish Date - May 28 , 2026 | 03:16 AM
ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల గల్లంతు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్), డీలిమిటేషన్, చొరబాటుదారులు... వంటి విషయాలే ప్రధాన అంశాలుగా పైకి తేలాయి. నిజం చెప్పాలంటే ఇవేవీ...
ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల గల్లంతు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్), డీలిమిటేషన్, చొరబాటుదారులు... వంటి విషయాలే ప్రధాన అంశాలుగా పైకి తేలాయి. నిజం చెప్పాలంటే ఇవేవీ సాధారణ ఓటరు ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్న సమస్యలు కానే కావు. ఇవి ఓటర్ల సామాజిక, ఆర్థిక, సంక్షేమ సంబంధమైన డిమాండ్ల నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ చేసుకున్న ఏర్పాటు మాత్రమే.
నిజానికి, బిహార్‌లో నితీష్‌కుమార్ ప్రభుత్వంపై ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుదల ప్రస్ఫుటంగా కనిపించింది. కానీ రాహుల్‌గాంధీ, తేజస్వి యాదవ్ నిర్దేశకత్వంలో సాగిన ‘ఓట్ చోరీ’ ఉదంతం ఎన్నికల ప్రచారంలో ప్రధాన కథనంగా మారడం వల్ల, ప్రభుత్వ వ్యతిరేకత, ఇతర అంశాలు దారి మళ్ళిపోయాయి. చివరకు బీజేపీ–జేడీ(యు) కూటమి బృహత్ విజయాన్ని సాధించింది. సూక్ష్మస్థాయి పాలనాంశాల నుంచి బీజేపీ స్థూలస్థాయి కథనాలను విడదీసింది. ప్రతిపక్షాల ఎన్నికల ప్రచారం అంతా తమ మనుగడ కోసం అన్నట్టుగా సాగగా, బీజేపీ మాత్రం క్షేత్రస్థాయిలో తాను ప్రవేశపెట్టిన పథకాల సమాచారాన్ని ఓటర్ల దృష్టిలో ఉంచుతూ, తాము గెలిస్తే వాటిని ఇంకా మెరుగ్గా అమలుపరుస్తామన్న వాగ్దానాన్ని ప్రధానాంశం చేయగలిగింది. ఫలితంగా ప్రజల దృష్టిలో ప్రతిపక్షాలు అధికారం కైవసం చేసుకునే లక్ష్యంతో మాత్రమే ఓటర్ల జాబితా అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయనీ, వాటికి ప్రజల అవసరాలు పట్టవనే భావన ఏర్పడింది. ఒకవైపు బీజేపీ మళ్ళీ అవకాశం ఇస్తే ఇంకా బాగా సేవలు అందిస్తామని వాగ్దానం చేస్తూంటే, ప్రతిపక్షాలు మాత్రం తమ మనుగడ కోసం ఓట్ల అక్రమాల సంగతి మాట్లాడుతున్నాయని ప్రజలు అర్థం చేసుకున్నారు. అలా బీజేపీ గెలుపుకు రంగం సిద్ధమైంది!
రాజకీయ పార్టీల సభ్యులు, కార్యకర్తలూ ఐతే ఏ సందర్భంలోనైనా పార్టీ పిలుపుకు స్పందిస్తారు. కానీ, ప్రజలు తమ తక్షణ అవసరాల కోసం మాత్రమే ఏ ఉద్యమంతోనైనా కలిసి రావటానికి సిద్ధమవుతారు. నోయిడాలోని కార్మికులు వారి వేతనాలలో పెంపు కోసం సంఘటితంగా పోరాడడానికి ముందుకు వచ్చారు. కానీ ఎన్నికలలో అక్రమాలను వ్యతిరేకిస్తూ చేసే పోరాటాన్ని వారు తమ తక్షణ అవసరాలు తీరడానికి ఉపయోగపడనిదిగానే చూస్తారు. నిజానికి, బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పట్ల, తమిళనాడులో డీఎంకే పట్ల ఎంతో అసంతృప్తి ప్రజల్లో గూడుకట్టుకునే ఉంది. కాని ఆ పార్టీలు ప్రజల అసంతృప్తికి కారణాలేంటో కనుక్కొని, వారి సమస్యలను దూరం చెయ్యటానికి బదులు, తమ రాజకీయ అస్తిత్వం కోసం పోరాడటంలో బిజీ అయిపోయాయి. ఆ ధోరణిని క్షేత్రస్థాయిలోని వాస్తవ సమస్యల గురించి స్పష్టత లేకపోవడంగా సామాన్య ప్రజానీకం భావించింది. డీఎంకే పట్ల తమిళులు అసంతృప్తితో ఉన్నప్పుడు ఆ పార్టీ డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా జరిపిన పోరాటానికి వారు ఎందుకు మద్దతిస్తారు?
అలాగే బెంగాల్‌లో ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ ప్రకారం రావల్సిన నిధులను కేంద్రంలోని బీజేపీ అడ్డుకున్నది. కానీ బీజేపీ పట్ల ప్రజల్లో ఎక్కడా ఆగ్రహం కనిపించలేదు. ఎందుకు? ప్రభుత్వ పాలనలో నయా ఉదారవాద వ్యవహార శైలికి, ఆ రాజకీయాలకు తార్కికమైన కొనసాగింపుగా ‘డబుల్ ఇంజన్ సర్కార్’ అనే నమూనాను బీజేపీ రూపొందించింది. మెరుగైన నిధుల కేటాయింపు జరగాలంటే కేంద్రంతో కలిసి పనిచేసే రాష్ట్ర ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అని దీని అసలు అర్థం. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఏ మాత్రం పనిచేయనివ్వకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా అవరోధాలు సృష్టించి జంకూ గొంకూ లేకుండా బీజేపీ ఒక ప్రయోగం చేసింది. తమ పార్టీ అధికారంలోకి వస్తేనే ఢిల్లీలో అభివృద్ధి జరుగుతుందన్న సందేశాన్ని స్పష్టంగా ఢిల్లీ వాసులకు ఇచ్చింది. ఢిల్లీ వాసులు కూడా అదే మార్గంలో క్యూ కట్టారు. ఆచరణాత్మకమైన, రోజువారీ లావాదేవీలకు సంబంధం ఉండే రాజకీయ స్వభావాన్ని ప్రదర్శించింది కాబట్టి నిధులను అడ్డుకున్నప్పటికీ కేంద్రంపై ఢిల్లీ ప్రజలకు కోపం రాలేదు.
నయా ఉదారవాదం ఒక ఆర్ధిక అభివృద్ధి నమూనా మాత్రమే కాదు, అది ప్రజలు రాజకీయ ప్రక్రియలను అంచనా వేసి, విలువకట్టే పద్ధతిని ప్రభావితం చేసే సాంస్కృతిక అంశం కూడా. ప్రజల రోజువారీ లావాదేవీలకు సంబంధించిన నమూనాలో అన్యాయానికి వ్యతిరేకంగా, అది వారి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తే తప్ప, పోరాటానికి అవకాశం తక్కువ. అందుకే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు ఏ విధంగా నేరుగా ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేస్తాయో వివరిస్తూ ఆ రెండింటి మధ్య సంబంధాన్ని ప్రజలకు తెలియజెయ్యగలగాలి. ఇందులో ప్రతిపక్షాలు పూర్తిగా విఫలం చెందాయి. ప్రతిపక్ష పార్టీలు బీజేపీ రూపొందించిన దృష్టి మళ్లించే పన్నాగాలలో చిక్కుకుంటున్నాయి. నిస్సందేహంగా అవి ఎన్నికల రంగంలోని అక్రమాలను ప్రతిఘటించాలి. కాని వాటి ఆ పోరాటం రోజువారీ జీవితంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలతో సంబంధం కలిగి ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం లోతైన మేధోమధనం అవసరం.
అజయ్ గుడవర్తి
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం
(‘ద క్వింట్’ నుంచి అనువాదం: రాజేంద్రబాబు అర్విణి)
ఈ వార్తలు కూడా చదవండి..
న్యాయవాది మొయినుద్దీన్ హత్యకేసులో కీలక పరిణామం
లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్
For More AP News And Telugu News