బంగారంపై మోజు తగ్గేదెలా?
ABN , Publish Date - Jun 11 , 2026 | 01:57 AM
జయప్రకాశ్ నారాయణ్ రాసిన ‘సంక్షోభం కాదు, ఇది ‘‘సువర్ణా’’వకాశం!’ (28.05.2026) వ్యాసంలో దేశంలోని నిరుపయోగ ఆస్తిని ఉత్పాదక రంగంలోకి మళ్లించాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచారు. అయితే అందుకు గాను...
జయప్రకాశ్ నారాయణ్ రాసిన ‘సంక్షోభం కాదు, ఇది ‘‘సువర్ణా’’వకాశం!’ (28.05.2026) వ్యాసంలో దేశంలోని నిరుపయోగ ఆస్తిని ఉత్పాదక రంగంలోకి మళ్లించాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచారు. అయితే అందుకు గాను ఆయన సూచించిన ‘గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (GMS)’ ఆచరణలో ఆశించిన ఫలితాలను ఇవ్వదు. పైగా, మరిన్ని ఆర్థిక సవాళ్లకు దారితీసే ప్రమాదం ఉంది. ఆయన ప్రతిపాదనలు బంగారపు దిగుమతులను తగ్గించకపోగా, పెంచే అవకాశం ఉంది. ఈ సమస్యకు అసలైన పరిష్కారం ఎగుమతులలో, ఆర్థిక సంస్కరణలలో ఉంది.
భారతీయుల ఇళ్లలో దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం నిల్వలు ఉన్నట్లు అంచనా. అయితే ఇందులో అత్యధిక భాగం బిస్కెట్లు, నాణేల రూపంలో గాక నగల రూపంలోనే ఉంది. మన సంస్కృతిలో నగలు కేవలం అలంకరణ మాత్రమే కాదు, అవి కుటుంబ గౌరవం, ఆర్థిక భద్రతతో ముడిపడి ఉంటాయి. కాబట్టి, అత్యధిక శాతం కుటుంబాల వారు తమ ఆభరణాలను కరిగించడానికి ఇష్టపడరు; అత్యవసరమైతే తాకట్టు పెడతారు కానీ శాశ్వతంగా వదులుకోరు. బ్యాంకులో డిపాజిట్ చేయాలంటే ఆ నగలను కరిగించాలి. కాబట్టి, సామాన్య ప్రజలు ఈ స్కీమ్‌లో పాల్గొనే అవకాశం చాలా తక్కువ. గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకువచ్చి, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాక చివరకు నిలిపివేసింది.
తన వ్యాసంలో జేపీ గారు ఒక కీలకమైన ప్రతిపాదన చేశారు. సాధారణ పౌరులను ఆదాయ వనరుల గురించి ‘దొంగ–పోలీస్’ తరహా ప్రశ్నలతో వేధించకూడదని చెబుతూనే, అదే సమయంలో సంఘటిత నేర ముఠాలు లేదా అవినీతి సొమ్ము ఈ పథకం ద్వారా చట్టబద్ధం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇది సిద్ధాంత రూపంలో వినడానికి బాగున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో దీనిని అమలుచేయడం ప్రభుత్వ యంత్రాంగానికి ఒక పెద్ద సవాలు. బ్యాంకు కౌంటర్ ముందుకు వచ్చే బంగారం సాధారణ పౌరుడి కష్టార్జితమా లేక నేరపూరితమైన సొమ్మా అని వేధించకుండా గుర్తించడం ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థకు దాదాపు అసాధ్యం. ఒకవేళ మూలాలను ప్రశ్నించకపోతే, అక్రమ సంపాదనతో బంగారాన్ని కొని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా నల్లధనాన్ని వైట్ మనీగా మార్చుకునే రాజమార్గంగా మారుతుంది. దీని మూలంగా బంగారం డిమాండ్ పెరిగి అధిక దిగుమతులకు దారితీసినా ఆశ్చర్యం లేదు.
అసలు బంగారం దిగుమతులు పెరగడానికి మూల కారణం ప్రభుత్వాల ఆర్థిక విధానాలే. ప్రభుత్వాలు బాధ్యతారహితంగా కరెన్సీ నోట్లను ముద్రిస్తుండటం వల్ల దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతోంది. దీనివల్ల మన ‘రూపాయి’ కొనుగోలు శక్తి పడిపోతోంది. తమ కష్టార్జితం విలువ కోల్పోకుండా కాపాడుకోవడానికి భారతీయులు బంగారాన్ని ఒక సురక్షితమైన ఆశ్రయంగా చూడటానికి మానసికంగా అలవాటుపడ్డారు. ఉదాహరణకు, గత ఎనిమిది దశాబ్దాలలో 10 గ్రాముల బంగారం ధర ఎలా పెరిగిందో గమనించండి: 1950లో రూ.99, 1960లో రూ.112, 1970లో రూ.184, 1980లో రూ.1,330, 1990లో రూ.3,200, 2000లో రూ.4,400, 2010లో రూ.18,500, 2020లో రూ.48,651, 2026లో రూ.1,45,090. ఈ గణాంకాలు చూస్తే, 75 ఏళ్లలో బంగారం విలువ వంద రూపాయల నుంచి లక్షా యాభై వేలు అయిందనిపించవచ్చు. కానీ వాస్తవానికి పెరిగింది బంగారం ధర కాదు. మన ప్రభుత్వం విపరీతంగా ముద్రించిన డబ్బు వల్ల మన రూపాయి విలువ పాతాళానికి పడిపోయింది. ప్రభుత్వాలు ఇష్టానుసారం డబ్బు ముద్రించడాన్ని ఆపి, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తే, బంగారం ధర అడ్డగోలుగా పెరగదు. అటువంటి వాతావరణంలో ప్రజలకు కరెన్సీపై నమ్మకం పెరిగి ఆటోమేటిక్‌గా బంగారంపై పెట్టుబడి పెట్టాలన్న ఆసక్తి తగ్గుతుంది.
ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న బ్యాంకులకు మన బంగారాన్ని అప్పగించడం అత్యంత ప్రమాదకరం. 1933లో అమెరికా ప్రభుత్వం పౌరుల వద్ద ఉన్న బంగారాన్ని బలవంతంగా లాగేసుకుని, దానికి బదులుగా కాగితం డబ్బులు చేతిలో పెట్టింది. పౌరులకు ఆ బంగారాన్ని అమెరికా ప్రభుత్వం ఈ రోజుకీ తిరిగి ఇవ్వలేదు. అలాగే, 1971లో డాలర్లకు బదులుగా బంగారం ఇవ్వబోమని తేల్చిచెప్పి ప్రపంచ దేశాలను అమెరికా మోసం చేసింది. అమెరికా లాంటి అగ్రరాజ్యమే ఇలా చేస్తే, రేపు పొద్దున మన ప్రభుత్వాలు ‘దేశం కోసం, ధర్మం కోసం’ అంటూ ఒక ఎమోషనల్ నెరేటివ్ క్రియేట్ చేసి, మన బంగారం మొత్తం లాగేసుకుని, విలువ లేని కాగితం రూపాయలు చేతిలో పెడితే మన పరిస్థితి ఏంటి? ప్రభుత్వాల జోక్యం నుంచి మన ఆస్తి హక్కులను రక్షించుకోవాలంటే బంగారాన్ని ప్రభుత్వాలకు ఎన్నటికీ అప్పగించకూడదు.
ఉపాయాలు, ఎత్తుగడలు, తెలివైన స్కీంల ద్వారా ప్రజల బంగారం కొనుగోళ్లను నియంత్రించే ప్రయత్నాలేవీ సఫలం కావు. ప్రభుత్వం స్వేచ్ఛా మార్కెట్ ద్వారా ప్రజల పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే వాతావరణం కల్పిస్తే, బంగారం కొనుగోళ్లు సహజంగానే తగ్గుముఖం పడతాయి.
నలమోతు చక్రవర్తి
ప్రెసిడెంట్, సెంటర్ ఫర్ లిబర్టీ
ఈ వార్తలు కూడా చదవండి...
మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి
కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News