చెరువు ఉన్నా కరువు ఎందుకు?
ABN , Publish Date - Apr 25 , 2026 | 03:23 AM
దేశంలో అత్యధిక చెరువులు ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. 2023లో కేంద్ర ప్రభుత్వ నీటి వనరుల లెక్కల ప్రకారం, రాష్ట్రంలో 1,90,777 నీటి వనరులు ఉండగా, వాటిలో 99.7శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి...
దేశంలో అత్యధిక చెరువులు ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. 2023లో కేంద్ర ప్రభుత్వ నీటి వనరుల లెక్కల ప్రకారం, రాష్ట్రంలో 1,90,777 నీటి వనరులు ఉండగా, వాటిలో 99.7శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో 81,703 చెరువులు పంచాయతీలు, ఇరిగేషన్ వంటి ప్రభుత్వ శాఖల ఆధీనంలోని సామూహిక ఆస్తులు. ఇవి కేవలం నీటినిల్వ కేంద్రాలే కాదు, భూగర్భ జలాల పునరుద్ధరణకు, వ్యవసాయ భద్రతకు, గ్రామీణ ఉపాధికి, పంచాయతీలకు ఆదాయ వనరులకు, ఇంకా జీవ వైవిధ్య–పర్యాటక కేంద్రాలుగా మారగల అపారమైన ఆర్థిక సామర్థ్యాన్ని కలిగిన సహజ సంపద.
ఈ స్థాయి వనరులు ఉన్న రాష్ట్రంలో కరువు, నీటి కొరత, భూగర్భ జలాల క్షీణత వంటి సమస్యలు ఎందుకు తీవ్రమవుతున్నాయి? ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రారంభించిన ‘జలధార– 100 రోజుల నీటి భద్రత కార్యక్రమం’ సరైన దిశలో వేసిన అడుగు. చెరువుల పునరుద్ధరణ, పూడికతీత, ఫీడర్ కాలువలు శుభ్రపరచడం, చెక్‌డ్యామ్‌లు, నీటి బడ్జెట్ వంటి చర్యలు అవసరమే. కానీ అసలు ప్రశ్న– ఈ చర్యలతో సమస్యల మూలాలను పరిష్కరించగలమా?
వాస్తవానికి ఈ సంక్షోభం పాలనా వైఫల్యాల ఫలితం. చెరువుల ఆక్రమణలను నిరోధించడం, అక్రమ వినియోగాన్ని నియంత్రించడంలో వైఫల్యం, కోర్టు ఆదేశాల అమలులో లోపాలు, స్థానిక సంస్థల బలహీనత, లీజులపై పర్యవేక్షణా లోపంతో చెరువులు క్రమంగా సామూహిక ఆస్తుల నుంచి ప్రైవేట్ వనరులుగా మారుతున్నాయి. ‘బ్యాంకుల్లో డబ్బు ఎలా దాచిపెట్టుకుంటామో, నీటిని భూమిలోనైనా, రిజర్వాయర్లలోనైనా నిల్వ చేస్తే అదే నిజమైన సంపద’ అని జలధార కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే, కరువు కాలానికి దాచుకోవాల్సిన వర్షపు నీటిని నిల్వ చేసే ప్రభుత్వ చెరువుల గర్భాల్లో అక్రమ సాగు జరుగుతున్నప్పుడు ఇది ఎలా సాధ్యం?!
పంచాయతీలకు గ్రామాల్లోని చెరువులు ఆర్థిక బలం కావాలి. కానీ వీటిని రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం మాయం చేస్తున్నారు. వాటిని ఆక్రమించి సాగుచేస్తూ, సొంత భూములుగా అమ్ముకుంటున్నారు. పూర్తిగా నిబంధనలను ఉల్లంఘించి కలుషితం చేస్తున్నారు. దీనికి తోడు, ప్రభుత్వ శాఖల అవసరాలకు సైతం కేటాయించకూడదన్న నిబంధననూ విస్మరించి, ప్రజాప్రతినిధులే దగ్గరుండి మరీ చట్టాలు ఉల్లంఘించేలా ప్రోత్సహిస్తున్నారు. అసలు మత్స్యకారులే లేని గ్రామాల్లో, సంబంధం లేని వ్యక్తులు మత్స్యకార సంఘాలు ఏర్పాటు చేసి, లీజు వంకతో అక్రమంగా చెరువు గర్భాల్లో వరిసాగు వంటి చర్యలు కొనసాగిస్తూ, ఈ చెరువులను ప్రైవేట్ ఆస్తులుగా మార్చేస్తున్నారు. రజక సంఘాలకు లీజు పేరుతో ఇదే తరహా నిబంధనల ఉల్లంఘన, వనరుల దోపిడీ సాగుతోంది. పంచాయతీలు ఆదాయం కోల్పోతున్నాయి. గ్రామాలు నష్టపోతున్నాయి. గ్రామస్థులు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే, ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత లేదు. చెరువులను ఎంతకు లీజుకు ఇస్తున్నారు? ఎవరికిస్తున్నారు? ఆ డబ్బు పంచాయతీ ఖాతాల్లోకి వస్తుందా? ప్రజలకు తెలియదు. ఇది పరిపాలనా లోపం కాదు, ప్రజాస్వామ్య వైఫల్యం.
చెరువు గర్భంలో అక్రమ సాగు కోసం, అప్పటికే నిల్వ ఉంచిన నీటిని ఆయకట్టుకు ఒక్కసారిగా వదిలి నారుమడులను నష్టపరచడం; అవసరమైనప్పుడు ఆయకట్టు రైతులకు చెరువులో నీరు లేకుండా చేయడం; అక్రమ వరి, ఆక్వా సాగుతో చెరువు నేల గట్టిపడి, భూగర్భ జలం రీచార్జ్ తగ్గిపోవడం.. వంటి వాటితో నిల్వ సామర్థ్యం క్షీణిస్తోంది. దీని ప్రభావం భవిష్యత్తులో మరింత తీవ్రమవుతుంది. గత రెండు దశాబ్దాల్లో గ్రామాల్లో యంత్రాల వినియోగం పెరిగి సమస్య మరింత తీవ్రమైంది. జేసీబీలు, బుల్డోజర్లతో ఇసుక, మట్టి, చెరువులు వంటి సహజ వనరుల దోపిడీ వేగంగా జరుగుతోంది.
కొన్ని ప్రాంతాల్లో అక్వాకల్చర్ విస్తరణ వల్ల చెరువుల అసలు ఉద్దేశం నశిస్తోంది. రోజువారీ అవసరాలు, పశువులకు వినియోగించాల్సిన పంచాయతీ చెరువులను నిబంధనలకు వ్యతిరేకంగా వాణిజ్య ఆక్వా కోసం సబ్–లీజుకు ఇస్తున్నారు. ఈ చెరువుల్లో ఉపయోగించే రసాయనాలు, యాంటీబయాటిక్స్ వల్ల కాలుష్య నీరు పంట కాలువల్లోకి, ఇతర చెరువుల్లోకి చేరుతోంది. ఫలితంగా భూగర్భ జలాలు కలుషితమవుతూ, నేల ఉత్పాదకత తగ్గిపోతోంది. రాయలసీమలో భూగర్భజలాల క్షీణత, గుంటూరు జిల్లాలో నేలల ఉత్పాదకత తగ్గడం ఇప్పటికే హెచ్చరికగా ఉంది. ఇలాంటి పరిస్థితులు కృష్ణా–గోదావరి డెల్టా ప్రాంతాల్లో కూడా వస్తాయా అనే ఆందోళన ఉత్పన్నమవుతోంది. కృష్ణా– గోదావరి డెల్టా ఒకప్పుడు కరువు అంటే తెలియని, నీటితో సమృద్ధిగా ఉన్న ప్రాంతం. కానీ నేడు నీటి కోసం పోటీ, ఘర్షణలు, ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతున్నాయి.
చెరువులను పూడికతీసి, పచ్చదనంతో రక్షించి, జీవవైవిధ్య మార్గాలతో అనుసంధానం చేస్తే అవి మళ్లీ పచ్చని కేంద్రాలు, నీటి జీవనాధారాలు, పర్యాటక ఆకర్షణలుగా మారతాయి. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేస్తుంది. జలధార కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి, ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి జిల్లాల్లో భూగర్భ, ఉపరితల జలవనరులను పెంపొందించేందుకు అవసరమైన పనులను గుర్తించాలి అని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. గత అనుభవాలు చూస్తే, నకిలీ లబ్ధిదారులు, అర్హతలేని వ్యక్తులు వల్ల, నిధులు వృథా అయ్యి, లక్ష్యాలు సాధ్యం కాలేదని తెలుస్తున్నది. అందుకే, జలధారను కూడా ఈ పద్ధతిలో అమలు చేస్తే ఫలితం రాదనే భయం గ్రామస్థులకు ఉంది. అయితే దీనికి కేవలం పనులే సరిపోవు, పాలనా మార్పులు అవసరం. చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదులు, కోర్టు కేసులు పెరుగుతున్నా, అమలు స్థాయిలో లోపాలు కనిపిస్తున్నాయి. సర్వేల్లో అసత్యాలు, రికార్డుల మార్పులు, ఆక్రమణదారులకు అధికారుల మద్దతు వంటి అంశాలు బయటపడుతున్నాయి. ఇది వ్యవస్థాగత లోపాలను సూచిస్తోంది.
కూటమి ప్రభుత్వం, ఒక స్వతంత్ర ‘రాష్ట్ర చెరువుల పరిరక్షణ, పర్యవేక్షణ కమిషన్’ లేదా ‘గ్రామీణ జల వనరుల సంరక్షణ మండలి’ ఏర్పాటు చేసి, చెరువులపై పర్యవేక్షణను బలోపేతం చేయాలి. ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. చెరువుల యాజమాన్యాన్ని గ్రామాలకు తిరిగి ఇవ్వాలి. ప్రతి లీజు, ఆదాయం, ఖర్చు వివరాలను పబ్లిక్ చేయాలి. గ్రామసభలను బలోపేతం చేసి ప్రజల భాగస్వామ్యాన్ని, అవగాహనను పెంచాలి. సాంకేతికతను వినియోగించాల్సిన సమయం వచ్చింది. ప్రతి పంచాయతీలో ‘వాట్సాప్ స్థానిక పాలన’ను ప్రవేశపెట్టి, పంచాయతీలో తీసుకునే ప్రతీ నిర్ణయం, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక, ఆదాయ–వ్యయాలు, పారిశుధ్యం, చెరువుల లీజులు, ఆదాయం, నిర్వహణ, నిబంధనలు, పనుల వివరాలను ప్రజలకు నేరుగా తెలియజేయాలి. ఇందుకు ఫేస్‌బుక్–యూట్యూబ్ వంటి సోషల్ మీడియా చాలా ఉపయోగకరం. అలాగే, అర్హతలేని లబ్ధిదారులను ఉపాధి హామీ పనుల నుంచి తొలగించి, జలధార వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తే గ్రామాలకు నిజమైన అభివృద్ధి ఫలాలు అందుతాయి.
డా. మనోహరి వెలమాటి
గ్రామదీప్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News