Share News

ఆత్మవిమర్శ లేకపోవడమే పతనానికి కారణం

ABN , Publish Date - May 28 , 2026 | 03:08 AM

ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ, విప్లవ ఉద్యమం నుంచి వచ్చిన సంస్థ, లేదా ప్రజల ప్రేమతో ఎదిగిన శక్తి... చివరకు వీటి పతనానికి దారి తీసేది బాహ్య శత్రువుల...

ఆత్మవిమర్శ లేకపోవడమే పతనానికి కారణం

ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ, విప్లవ ఉద్యమం నుంచి వచ్చిన సంస్థ, లేదా ప్రజల ప్రేమతో ఎదిగిన శక్తి... చివరకు వీటి పతనానికి దారి తీసేది బాహ్య శత్రువుల వల్ల కాదు. అంతర్గత అహంకారం, ఆత్మవిమర్శ లేకపోవడం, నిజాన్ని వినలేని నాయకత్వం వల్లనే.

ప్రతి రాజకీయ పార్టీకి ప్రారంభ దశలో ఒక ఆశయం, సిద్ధాంతం, సామాజిక అవసరం ఉంటుంది. ప్రజల బాధలను అర్థం చేసుకునే కార్యకర్తలు, విమర్శలను వినే నాయకత్వం ఉంటుంది. కానీ అధికారానికి దగ్గరయ్యే కొద్దీ నాయకత్వం క్రమంగా ప్రజల నుంచి దూరమవుతుంది. ఈ దూరమే చివరకు వ్యవస్థలను లోపల నుంచే కుళ్లగొడుతుంది. అధికారంలో ఎక్కువ కాలం ఉన్న నాయకులు ఒక దశలో తమ చుట్టూ నిజం చెప్పే వాళ్లను కాకుండా తమకు నచ్చిన మాటలు చెప్పే వాళ్లను కూడబెట్టుకుంటారు. ఇది రాజకీయ శాస్త్రంలో ఒక సాధారణ మానసిక పరిణామం. విమర్శ చేసేవారిని శత్రువులుగా భావించడం; ప్రశ్నించే కార్యకర్తలను దూరం పెట్టడం; చప్పట్లు కొట్టేవారిని ప్రోత్సహించడం; భయంతో పనిచేసే వ్యవస్థను నిర్మించడం; నాయకుడు తప్పు చేయడు అనే సంస్కృతి పెరగడం.

ఈ పరిస్థితిలో పార్టీ లోపల సమాచారం వక్రీకరణ ప్రారంభమవుతుంది. గ్రౌండ్ రియాలిటీ నాయకుడికి చేరదు. కృత్రిమ విజయం భ్రమ పెరుగుతుంది. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నా నాయకుడికి అన్నీ బాగానే ఉన్నాయి అని చెబుతారు. పార్టీలో నాయకత్వం పట్ల భయ సంస్కృతి పెరిగితే, సత్యం చెప్పే వ్యక్తులు శత్రువులుగా మిగిలిపోతారు. ఇది రాజ్యాల పతనంలోనూ, ఆధునిక పార్టీల కూల్చివేతలోనూ కనిపించిన నిజం. ఆత్మవిమర్శ లేకపోవడం పార్టీలకు అతి పెద్ద ప్రమాదం. ప్రపంచంలో తమ తప్పులను సరిదిద్దుకునే సామర్థ్యం ఉన్న సంస్థలు, వ్యవస్థలే నిలబడ్డాయి. శాస్త్రం ప్రశ్నలను అంగీకరిస్తుంది కాబట్టి అది నిలబడింది. విమర్శను అనుమతిస్తుంది కాబట్టి ప్రజాస్వామ్యం విలువైనది.


కానీ ఏ రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యవస్థలు విమర్శలను ద్రోహంగా చూస్తాయో, అంతర్గత చర్చలను అణిచేస్తాయో, ఓటములను విశ్లేషించకుండా భావోద్వేగ ప్రచారంతో దాటవేస్తాయో, ప్రజలే తీర్పు తప్పు చేశారు అని అనుకుంటాయో ఆ పార్టీ మెల్లగా మూసివేసిన వ్యవస్థలుగా మారుతాయి. ఆత్మవిమర్శ లేని పార్టీ చివరకు ఒక జీవచ్ఛవం అవుతుంది. వ్యక్తి చుట్టూ నిర్మించిన వ్యవస్థలు మొదట వేగంగా ఎదిగినా, చివరకు ఆ వ్యక్తి బలహీనపడినప్పుడు మొత్తం పార్టీలు, వ్యవస్థల నిర్మాణం కూలిపోతుంది. చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలు, విప్లవ ఉద్యమాలు, రాజకీయ పార్టీలు ఇదే కారణంతో నశించాయి.

ఏ రాజకీయ సంస్థ అయినా దీర్ఘకాలం నిలబడాలంటే విమర్శను అంగీకరించాలి. అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి. రెండో స్థాయి నాయకత్వం ఎదగాలి. కార్యకర్తల గౌరవం కాపాడాలి. ఆత్మవిమర్శ సంస్కృతి ఉండాలి. వ్యక్తిపూజ తగ్గాలి. సిద్ధాంత చర్చలు కొనసాగాలి. శాస్త్రీయ దృక్పథం ప్రోత్సహించాలి. నిజమైన నాయకుడు చప్పట్ల మధ్య కాదు, విమర్శల మధ్య తయారవుతాడు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు మాత్రమే కాదు ప్రజల స్వరం వినగలిగే సంస్కృతి. సమాజ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన బలహీనత యుద్ధం కాదు, ఆర్థిక సంక్షోభం కాదు, బాహ్య శత్రువులు కాదు... ‘నిజాన్ని వినలేని నాయకత్వం’. అదే అత్యంత ఘోరమైన బలహీనత. ప్రజాస్వామ్యానికి ప్రాణం ఎన్నికలు కాదు విమర్శను భరించే సంస్కృతి. సంస్థలకు బలం ప్రచారం కాదు ఆత్మవిమర్శ. నాయకత్వానికి గొప్పతనం అధికారంలో ఉండటం కాదు నిజాన్ని వినగలగటం.­

లెనిన్ కోగంటి, కార్మిక నేత

ఈ వార్తలు కూడా చదవండి..

న్యాయవాది మొయినుద్దీన్‌ హత్యకేసులో కీలక పరిణామం

లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్

For More AP News And Telugu News

Updated Date - May 28 , 2026 | 03:08 AM