Water Projects Maintenance: నీటి ప్రాజెక్టులకు నిర్వహణ సిబ్బంది ఏరి
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:54 AM
లక్షల కోట్లతో ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రభుత్వాలు, వాటి నిర్వహణకు కావలసిన సిబ్బందిని నియమించడంలో మాత్రం ఏళ్ల తరబడి నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నాయి. నాగార్జునసాగర్ లాంటి...
లక్షల కోట్లతో ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రభుత్వాలు, వాటి నిర్వహణకు కావలసిన సిబ్బందిని నియమించడంలో మాత్రం ఏళ్ల తరబడి నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నాయి. నాగార్జునసాగర్ లాంటి భారీ జాతీయ ప్రాజెక్టులతో సహా సింగూరు, కడెం, మూసీ, జూరాల, కోయిల్‌సాగర్, నిజాంసాగర్, ఆర్డీఎస్, రామన్‌పాడు, బొగ్గులవాగు లాంటి మీడియం, చిన్న నీటి తరహా ప్రాజెక్టుల పట్ల కూడా ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం లేదు.
ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది? ప్రపంచ బ్యాంకు ఆదేశాలలో భాగంగా 2/94 యాక్ట్‌ను ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన తర్వాత ఈ రిక్రూట్‌మెంట్ నిలిచిపోయింది. ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖలో పదవీ విరమణలే తప్ప నియామకాలు జరపలేదు. కెనాల్స్ మీద ఆనాడు 30 వేల మంది సిబ్బంది ఉంటే, నేడు మూడు వేలు మాత్రమే ఉన్నారు. పని భారం పెరిగింది. అనుభవం కలిగిన సిబ్బంది రిటైర్ కావడం, కొత్త సిబ్బంది లేకపోవడంతో ప్రాజెక్టుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మొదలుకొని నేటి ముఖ్యమంత్రి వరకు సిబ్బందిని నియమించాలని మా అసోసియేషన్ విజ్ఞప్తులు చేసింది. ప్రభుత్వం కూడా వాగ్దానాలు చేస్తూ వచ్చింది. ప్రాజెక్టులకు, కాలువల నిర్వహణకు 22,000 మంది సిబ్బంది అవసరమని వైఎస్ హయాంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎన్‌కే రెహమాన్ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. అయినా నియామకాలు మాత్రం జరగలేదు. అనంతర కాలంలో వచ్చిన ప్రభుత్వాల దృష్టికి ఈ సమస్యను తీసుకువచ్చినా అవీ అలాగే వ్యవహరించాయి.
ప్రాజెక్టులకు వరద వచ్చినప్పుడు నిర్వహణ పటిష్ఠంగా లేకపోతే గేట్లు కొట్టుకుపోవడం లేదా బిగుసుకుపోవడం, కిందికి పైకి లేవకపోవడం జరుగుతున్నది. ఆ పరిస్థితుల్లో హడావుడి చేయడం తప్ప, మిగతా సందర్భాల్లో వాటి గురించి పట్టించుకునే నాథుడే లేరు. సాంకేతిక నైపుణ్యం కలిగిన ఫిట్టర్, మెకానిక్, ఎలక్ర్టీషియన్, వెల్డర్, ఫోర్‌మన్.. ఇలా 27 కేటగిరీలలో వివిధ స్థాయిల్లోని సిబ్బంది అవసరాన్ని గుర్తించింది ప్రభుత్వం. వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు గేట్లు తయారు చేయడమే కాదు వాటి నిర్వహణ కూడా చూసేవాళ్ళు. అందుకు ఖైరతాబాద్‌లోను, మిగతా ప్రాంతాలలోను వర్క్‌షాప్‌లు ఉండేవి. ఒక ప్రాజెక్టు పూర్తి అయితే దానికి కావలసిన సిబ్బందిని ఏ విధంగా నియమించాలి, అన్నదానిపై కొండలరావు కమిటీ, సుబ్బరామిరెడ్డి వంటి కమిటీలు సిఫార్సులు చేశాయి. ఆ సిఫార్సులను చీఫ్ ఇంజనీర్ బోర్డులు కూడా ఆమోదించాయి. కానీ ప్రభుత్వాలు వాటిని అమలుచేయలేదు.
తెలంగాణలో భారీ, మధ్యతరహా, చిన్న తరహా ప్రాజెక్టులు దాదాపు 70 వరకు ఉన్నాయి. కాలువల విస్తీర్ణం, డిస్ట్రిబ్యూటర్లు తూములు ఈ విధంగా లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. కాలువలపై 8 కిలోమీటర్లకు ఒక లస్కరు పర్యవేక్షణ ఉండేది. వారిపై వర్క్ ఇన్‌స్పెక్టర్, ఇంజనీర్‌ల పర్యవేక్షణ ఉండేది. ధరణిని రద్దు చేసిన తర్వాత అందులో ఉన్న వీఆర్ఏలను లస్కర్లుగా, వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖకు బదిలీ చేసింది. కానీ ప్రాజెక్టుల మీద పనిచేసే నైపుణ్యం గల సిబ్బందిని మాత్రం నియమించడంలో తాత్సారం చేస్తోంది. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలకు కూడా తావు లేకుండా పోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. నాగార్జునసాగర్, మూసీ, జూరాల వంటి వివిధ ప్రాజెక్టులలో నిర్వహణ సిబ్బంది వేళ్ళ మీద లెక్క పెట్టగలిగిన సంఖ్యలో మిగిలారు. ప్రాజెక్టుల మరమ్మతులకు కన్సల్టెన్సీలు, లేదా కాంట్రాక్టర్ల ద్వారా గేట్ల మరమ్మతులు నిర్వహిస్తారు. తదుపరి నిర్వహణను వదిలేస్తున్నారు. నిరంతర నిర్వహణ కోసం వర్క్‌చార్జ్‌డ్ సిబ్బంది కూడా లేరు.
శ్రీశైలం ప్రాజెక్టును రామన్ మెగసెసే అవార్డు గ్రహీత వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్ సందర్శించినప్పుడు, దానిలోని నిర్వహణ లోపాన్ని గుర్తించి, ఇది ఇలాగే కొనసాగితే ప్రాజెక్టులకు ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరిక కూడా చేశారు. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం తప్ప మిగతా ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించింది. సిబ్బంది నియామకం గురించి, ప్రాజెక్టుల నిర్వహణ గురించి పట్టించుకోలేదు.
లక్షల కోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్టులు నిర్మించే ప్రభుత్వాలు నిర్వహణ సిబ్బంది నియామకంపై శ్రద్ధ పెట్టాలి, వారి సమస్యలను పరిష్కరించాలి. కనీసం కాలువలలో పూడికలు తీయటానికి కూడా సిబ్బంది లేరు. సిబ్బందికి చెల్లించే కొద్ది మొత్తం వేతనాల గురించి ఆలోచించడం వల్ల భవిష్యత్తులో ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. వెంటనే నియామకాలు చేపట్టాలని, డ్యామ్ సేఫ్టీ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది.
కె.వెంకటేశ్వర్లు
వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్స్
మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్
ఈ వార్తలు కూడా చదవండి..
కోడలి హత్య.. అత్తగారితోపాటు మరో మహిళ అరెస్ట్..
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం.. ఉన్నతాధికారులతో సమీక్ష
For More AP News And Telugu News