Gig Economy India: గిగ్ ఎకానమీలో ‘న్యాయం’ ఎక్కడ
ABN , Publish Date - Jan 08 , 2026 | 01:04 AM
నేటి డిజిటల్ యుగంలో కూర్చున్న చోటుకే అన్నీ వచ్చేస్తున్నాయి. ఫోన్‌లో ఒక్క క్లిక్‌తో ఆహారం, మరో క్లిక్‌తో నిత్యావసరాలు నిమిషాల్లో ఇంటి తలుపు తడుతున్నాయి. ఈ సౌలభ్యం వెనుక వేల సంఖ్యలో...
నేటి డిజిటల్ యుగంలో కూర్చున్న చోటుకే అన్నీ వచ్చేస్తున్నాయి. ఫోన్‌లో ఒక్క క్లిక్‌తో ఆహారం, మరో క్లిక్‌తో నిత్యావసరాలు నిమిషాల్లో ఇంటి తలుపు తడుతున్నాయి. ఈ సౌలభ్యం వెనుక వేల సంఖ్యలో డెలివరీ భాగస్వాముల చెమట చుక్కలు ఉన్నాయి. అయితే, ఈ ‘క్విక్ కామర్స్’ సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్న శ్రామికుల పరిస్థితి ‘దీపం కింద చీకటి’లా మారుతోంది. ఇటీవల జొమాటో, బ్లింకిట్ సంస్థల అధినేత దీపిందర్ గోయల్, తమ ప్లాట్‌ఫామ్ పర్యావరణ వ్యవస్థ అత్యంత ‘న్యాయబద్ధంగా’ ఉందంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
భారతదేశంలో గిగ్ ఎకానమీ అతిపెద్ద ఉపాధి కల్పన యంత్రాంగమని యాజమాన్యాలు గొప్పగా చెప్పుకుంటాయి. కానీ, ఈ పనులు ఎంతవరకు వ్యవస్థీకృతం అనేదే ప్రశ్న. డెలివరీ భాగస్వాములు కంపెనీ రికార్డుల్లో ఉద్యోగులు కారు; వారు కేవలం ‘స్వతంత్ర కాంట్రాక్టర్లు’ లేదా ‘భాగస్వాములు’. దీంతో వారికి కనీస వేతనం, ప్రావిడెంట్ ఫండ్, ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలేవీ అందవు. వీరి ఆదాయం కంపెనీల ఏకపక్ష నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. గత సెప్టెంబరులో ఒక ఆర్డర్‌కు రూ.22–30 వరకు లభించే ప్రాథమిక వేతనం, నవంబర్ నాటికి రూ.15–27కి, ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో రూ.10–15కి పడిపోయింది. పెట్రోల్ ధరలు, జీవన వ్యయం పెరుగుతున్న తరుణంలో, వచ్చే అరకొర ఆదాయం వాహన మరమ్మతులకు, ఇంధనానికే సరిపోతుంటే, ఇక కుటుంబ పోషణ ఎలా సాధ్యం?
కార్మికుల ప్రధాన ఆవేదన ‘10 నిమిషాల డెలివరీ’ విధానం. వినియోగదారులను ఆకర్షించడానికి కంపెనీలు చేస్తున్న ఈ ప్రయోగం డెలివరీ ఏజెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. పక్కనే ఉన్న ‘డార్క్ స్టోర్ల’ నుంచి వస్తువులు పంపడం సిద్ధాంతపరంగా సులభమే. కానీ దేశంలో ట్రాఫిక్, ఇరుకైన సందులు, అస్థిరమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ సమయపాలన అసాధ్యం. ఈ ఒత్తిడి వల్ల డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం, అతివేగంగా వెళ్లడం వంటివి చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా డెలివరీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. పండుగ రోజుల్లో అందరూ సంబరాలు చేసుకుంటుంటే, వీరు మాత్రం తమ కనీస హక్కుల కోసం రోడ్డెక్కారు. సమ్మె పిలుపు ఉన్నా, చాలామంది కార్మికులు విధులకు హాజరు కావాల్సి వచ్చింది. ఇది వారు యాజమాన్యంపై ఉన్న ప్రేమతో చేసిన పని కాదు, కేవలం ఆకలి బాధతో చేసిందే. ఒక్కరోజు ఆదాయం కోల్పోతే ఆ నెల గడవని పరిస్థితి వారిది. దీనిని ఆసరాగా చేసుకున్న సంస్థలు, పండుగ రాత్రి వేళల్లో ఒక్కో ఆర్డర్‌కు రూ.120–150 వరకు ప్రోత్సాహకాలు ప్రకటించాయి. ఇది ఒక రకమైన ‘ఆర్థిక వివక్ష’.
ఉద్యోగ అవకాశాలు లేని దేశంలో గిగ్ ఎకానమీ ఒక ఆశాకిరణం లాంటిదే. కానీ, ఆ కిరణం కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలి తప్ప, వారిని దహించకూడదు. కంపెనీల వృద్ధి, మార్కెట్ విలువ ముఖ్యం కావొచ్చు, కానీ అది వ్యవస్థను నడిపే మనుషుల సంక్షేమాన్ని బలి తీసుకుని సాధించకూడదు. డెలివరీ ఏజెంట్లను ‘ఖర్చు’గా కాకుండా, నిజమైన ‘భాగస్వాములు’గా గుర్తించినప్పుడే వ్యవస్థకు గౌరవం ఉంటుంది. కేవలం మాటల్లో ‘న్యాయం’ అని చెబితే సరిపోదు, గిగ్ కార్మికుడు రోడ్డుపై ప్రతి ఆర్డర్ డెలివరీ చేసేటప్పుడు అనుభవించే ‘భద్రత’లో అది కనిపించాలి.
వెంకగారి భూమయ్య
ఈ వార్తలు కూడా చదవండి..
కోడలి హత్య.. అత్తగారితోపాటు మరో మహిళ అరెస్ట్..
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం.. ఉన్నతాధికారులతో సమీక్ష
For More AP News And Telugu News