Share News

US Foreign Policy: అమెరికా అధర్మానికి అంతెక్కడ

ABN , Publish Date - Jan 08 , 2026 | 01:09 AM

బలప్రయోగం, బెదిరింపుల ద్వారా వెనెజువెలా రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేందుకు లేదా ఆ దేశంపై పెత్తనం చెలాయించేందుకు ఏ సభ్యదేశానికైనా హక్కు ఉందా? అనేదే భద్రతామండలి....

US Foreign Policy: అమెరికా అధర్మానికి అంతెక్కడ

బలప్రయోగం, బెదిరింపుల ద్వారా వెనెజువెలా రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేందుకు లేదా ఆ దేశంపై పెత్తనం చెలాయించేందుకు ఏ సభ్యదేశానికైనా హక్కు ఉందా? అనేదే భద్రతామండలి ముందు ప్రస్తుతం ఉన్న అంశం. ఇది ఐక్యరాజ్యసమితి అధికారపత్రం (చార్టర్‌)లోని సెక్షన్‌ 4తో నేరుగా ముడివడివుంది. ప్రపంచ దేశాల ప్రాదేశిక సమగ్రత, రాజకీయ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా బలప్రయోగం లేదా బెదిరింపులకు పాల్పడడాన్ని ఆ నిబంధన నిషేధించింది. ఆ నియమాన్ని సమర్థించి, స్థిరపరచడమా లేక ఉపేక్షించి వదిలివేయడమా అనే విషయమై భద్రతా మండలి నిక్కచ్చిగా నిర్ణయం తీసుకోవాలి. ఆ నిబంధనను ధ్రువీకరించని పక్షంలో తీవ్రమైన పర్యవసానాలు సంభవిస్తాయి.

1947 నుంచి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో తమకు ప్రతికూలంగా ఉన్న ప్రభుత్వాలను మార్చివేసి, సానుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు అమెరికా పదేపదే బలప్రయోగం, రహస్య చర్య, రాజకీయ కౌటిల్యానికి పాల్పడింది. 1947–89 సంవత్సరాల మధ్య వివిధ దేశాలలో ప్రభుత్వాల మార్పునకు అమెరికా 70 సార్లు ప్రయత్నించిందని రాజనీతిశాస్త్ర విదుషీమణి Lindsey O’ Rourke 2018లో తన పరిశోధనగ్రంథం ‘Covert Regime Change’లో విపులంగా వెల్లడించారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన అనంతరం కూడా ఈ అధర్మ కార్యకలాపాలను అమెరికా కొనసాగించింది. భద్రతా మండలి అనుమతి, ఆమోదం లేకుండానే అమెరికా 1989 నుంచి ఇరాక్‌ (2003), లిబియా (2011), సిరియా (2011) నుంచి, హొండురాస్‌ (2009), ఉక్రెయిన్‌ (2014), వెనెజువెలా (2002 నుంచి)తో సహా వివిధ దేశాలలో వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చివేసి, అనుకూల పాలకులను అధికారానికి తీసుకువచ్చేందుకు పూనుకుని చాలా వరకు సఫలమయింది. ఇందుకు అమెరికా సువ్యవస్థిత పద్ధతులను అనుసరించింది. బాహాట యుద్ధం, రహస్య గూఢచార కార్యకలాపాలు, అశాంతిని రగుల్కొల్పడం, సాయుధ బృందాలకు మద్దతు ఇవ్వడం, మాధ్యమాలను ఉపయోగించుకోవడం, సైనిక, పౌర అధికారులకు లంచాలు ఇవ్వడం, ప్రతికూల నేతలను హతమార్చడం, ఫాల్స్‌ఫ్లాగ్‌ కార్యకలాపాలు (యుద్ధానికి సాకులు సృష్టించడం, ప్రత్యర్థి నేతలను అప్రతిష్ఠ పాలుచేయడం, ప్రజాభిప్రాయాన్ని సానుకూలంగా రూపొందించడం మొదలైనవి), ఆర్థికవ్యవస్థను కుదేలుపరచడం మొదలైనవి ఆ పద్ధతులలో కొన్ని. ఈ అధర్మ చరిత్ర అంతా సవివరంగా లిఖితమై ఉంది. ఐక్యరాజ్యసమితి అధికార పత్రం నిర్దేశాలకు ఇవన్నీ పూర్తిగా విరుద్ధమైనవి. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలలో కొనసాగుతున్న హింసాకాండలు, సంఘర్షణలు, రాజకీయ అస్థిరత, ప్రజల బతుకులు బుగ్గిపాలు కావడం మొదలైన బాధాకర పరిణామాలన్నీ అమెరికా పాల్పడిన, పాల్పడుతోన్న ఆ అధర్మ చర్యల ఫలితాలే.


వెనెజువెలా విషయంలో ఇటీవల అమెరికా వ్యవహరించిన తీరుతెన్నుల చరిత్ర అందరికీ తెలిసిందే. ఏప్రిల్‌ 2002లో వెనెజువెలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు గురించి అమెరికాకు ముందుస్తుగా తెలుసు. ఆ చర్యను పూర్తిగా ఆమోదించింది కూడా. 2010 దశకంలో, ముఖ్యంగా 2014లో ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు నిర్వహించిన పౌర సమాజ బృందాలకు ఆర్థిక అండదండలు పుష్కలంగా అందించింది. ఆ నిరసనకారులపై వెనెజువెలా ప్రభుత్వం తీవ్రచర్యలు తీసుకున్నప్పుడు అమెరికా దానిపై అనేక ఆంక్షలు విధించింది.

2017లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాల సందర్భంగా లాటిన్‌ అమెరికా నాయకులకు ఇచ్చిన ఒక విందు సందర్భంగా– వెనెజువెలాలో ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకై ఆ దేశాన్ని దురాక్రమించే ప్రతిపాదన గురించి నాటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ బహిరంగంగా చర్చించారు. 2017 నుంచి 2020 వరకు వెనెజువెలా ప్రభుత్వరంగ చమురు సంస్థపై అమెరికా విస్తృత ఆంక్షలు విధించింది. 2016–20 సంవత్సరాల మధ్య వెనెజువెలాలో చమురు ఉత్పత్తి 75 శాతం మేరకు పడిపోయింది. నిజమైన తలసరి జీడీపీ 62 శాతం మేరకు తగ్గిపోయింది. అమెరికా ఏకపక్షంగా వెనెజువెలాకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ చర్యలను ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ పలుమార్లు ఖండించింది. 2019 జనవరి 23న వెనెజువెలా ‘తాత్కాలిక అధ్యక్షుడు’గా జువాన్‌ గువాయిడోను అమెరికా ఏకపక్షంగా గుర్తించింది. ఆ తరువాత అయిదురోజులకు ఆ దేశంలో 700 కోట్ల డాలర్ల సార్వభౌమిక ఆస్తులను అమెరికా స్తంభింప చేసి, తాను గుర్తించిన తాత్కాలిక అధ్యక్షుడికి నిర్దిష్ట ఆస్తులపై అధికారాలు కల్పించింది. వెనెజువెలాకు వ్యతిరేకంగా అమెరికా అటువంటి కార్యకలాపాలకు రెండుదశాబ్దాలకు పైగా నిర్విరామంగా పాల్పడింది.

అమెరికా ప్రపంచవ్యాప్తంగా దుందుడుకు విధానాలనే అనుసరిస్తోంది. గత ఏడాది ఏడు దేశాలపై బాంబు దాడులు నిర్వహించింది. వాటిలో ఏ ఒక్కదానికీ భద్రతామండలి అనుమతి లేదు. ఐక్యరాజ్యసమితి నియమ నిబంధనల ప్రకారం అవేవీ ఆత్మరక్షణకు నిర్వహించిన దాడులు కావు. గత నెలలో అధ్యక్షుడు ట్రంప్‌ ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు అయిన కొలంబియా, డెన్మార్క్‌, ఇరాన్, మెక్సికో, నైజీరియా మొదలైన దేశాలపై యుద్ధ చర్యలకు పూనుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. వెనెజువెలా కూడా ఆ హెచ్చరికల లక్ష్యంగా ఉంది.


వెనెజువెలాపై అమెరికా జరిపిన దాడి, కొనసాగుతున్న నావికా దిగ్బంధనం స్వేచ్ఛకు దోహదం చేస్తుందా లేదా అణచివేతకు దారితీస్తుందా అనే విషయాన్ని మదింపు చేయాలని భద్రతా మండలి సభ్యదేశాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంతర్జాతీయ చట్టాన్ని కాపాడేందుకు, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను సంరక్షించేందుకు పూనుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అంతర్జాతీయ చట్టం (సార్వభౌమ రాజ్యాలు, అంతర్జాతీయ సంస్థలు, వ్యక్తుల మధ్య సంబంధాలను నియంత్రించే నియమ నిబంధనల, ప్రమాణాల వ్యవస్థ)ను అనువర్తింపచేయడం ద్వారా రాజ్యాల మధ్య ఘర్షణల నివారణకోసం నానాజాతి సమితిని ఏర్పాటు చేశారు. అయితే ఈ సంస్థ అంతర్జాతీయ చట్టాన్ని కాపాడడంలో విఫలమైన పర్యవసానమే ద్వితీయ ప్రపంచయుద్ధం. ఇది సృష్టించిన ఘోర విషాదాలకు శాశ్వత పరిష్కారంగా ఐక్యరాజ్యసమితి ప్రభవించింది. ‘భావితరాలకు యుద్ధ విపత్తు అనేది వాటిల్లకుండా చూడడమే’ ఈ అంతర్జాతీయ సంస్థ మహోదాత్త లక్ష్యం. ఇప్పుడు మనం అణుయుగంలో ఉన్నామన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకుని ఇరవయో శతాబ్ది వైఫల్యాలు మరోసారి పునరావృతమవకుండా జాగ్రత్త వహించాలి. ఈ విషయంలో ఏ మాత్రం విఫలమైనా మానవాళి మనుగడ సమసిపోతుంది. మరో ప్రత్యామ్నాయ పరిస్థితి ఉండదు, ఉండబోదు.

ఐక్యరాజ్యసమితి చార్టర్‌ నిర్దేశించిన ఈ బాధ్యతలను నిర్వర్తించేందుకు తక్షణమే భద్రతా మండలి పూచీ వహించాలి. తక్షణ కర్తవ్యాలను పాటించేలా సంబంధిత దేశాలపై ఒత్తిడి చేయాలి; వెనెజువెలాకు వ్యతిరేకంగా ఎలాంటి బెదిరింపులు, దాడులకు పాల్పడకుండా అమెరికాను తక్షణమే నిలువరించాలి; భద్రతా మండలి అనుమతి లేకుండా వెనెజువెలాకు వ్యతిరేకంగా ప్రారంభించిన నావికా దిగ్బంధానికి అమెరికా తక్షణమే ముగింపు చెప్పాలి. ఇతర సైనిక చర్యలను కూడా నిలిపివేయాలి. వెనెజువెలా, దాని పరిసర ప్రాంతాల నుంచి తన సమస్త సైనిక దళాలను అమెరికా తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఉద్రిక్త పరిస్థితుల ఉపశమన బాధ్యత వెనెజువెలాపై కూడా ఉన్నది. ఐక్యరాజ్యసమితి నియమ నిబంధనలకు సంపూర్ణంగా నిబద్ధమవడంతో పాటు విశ్వమానవ హక్కుల ప్రకటన హామీ పడిన హక్కులు అన్నిటినీ కాపాడాలి; వెనెజువెలా ప్రభుత్వంతోను, సంక్షోభంతో ప్రమేయమున్న సమస్త దేశాల ప్రతినిధులతోను చర్చలు, సమాలోచనలు జరిపి ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు అనుగుణమైన సిఫారసులను 14 రోజులలో నివేదించేందుకు ఒక ప్రత్యేక ప్రతినిధిని నియమించాలి. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్నీ భద్రతామండలి ఆమోదం లేకుండా ఏకపక్షంగా హెచ్చరికలు జారీ చేయడం, సాయుధ చర్యలకు పూనుకోవడం మొదలైన వాటికి స్వస్తి చెప్పి తీరాలి.

అంతర్జాతీయ చట్టం సువ్యవస్థితంగా అమలయ్యేందుకు ఒక స్ఫూర్తిదాయక సాధనంగా ఐక్యరాజ్యసమితి చార్టర్‌ ఉంటుందా? అన్న దానిపైనే శాంతిసాధన, మానవాళి మనుగడ ఆధారపడి ఉన్నవి. ధన్యవాదాలు.

జెఫ్రీ డి సాచ్స్‌

(వెనెజువెలాకు వ్యతిరేకంగా అమెరికా చేపట్టిన చర్యను నిరసిస్తూ జనవరి 5న భద్రతామండలి

అత్యవసర సమావేశంలో ప్రముఖ ఆర్థికవేత్త, యుఎన్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ సొల్యూషన్స్‌

నెట్‌వర్క్‌ ప్రెసిడెంట్‌ జెఫ్రీ డి సాచ్స్‌ వెలువరించిన ప్రసంగ పాఠం సంక్షిప్తరూపం.)

ఈ వార్తలు కూడా చదవండి..

కోడలి హత్య.. అత్తగారితోపాటు మరో మహిళ అరెస్ట్..

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం.. ఉన్నతాధికారులతో సమీక్ష

For More AP News And Telugu News

Updated Date - Jan 08 , 2026 | 01:09 AM