Share News

మమతపై సమరాస్త్రమే బెంగాల్‌ ‘సర్‌’

ABN , Publish Date - Apr 09 , 2026 | 02:34 AM

పశ్చిమ బెంగాల్‌లో అంతిమంగా తొలగించిన ఓట్ల సంఖ్య 27,16,393. ఈ గణాంక సమాచారం అర్ధరాత్రి వెలువడింది. సుప్రీంకోర్టు ఉత్తర్వు ఆ అంకెను ప్రస్తావించలేదు, అనుబంధ జాబితాను మంగళవారమే...

మమతపై సమరాస్త్రమే బెంగాల్‌ ‘సర్‌’

పశ్చిమ బెంగాల్‌లో అంతిమంగా తొలగించిన ఓట్ల సంఖ్య 27,16,393. ఈ గణాంక సమాచారం అర్ధరాత్రి వెలువడింది. సుప్రీంకోర్టు ఉత్తర్వు ఆ అంకెను ప్రస్తావించలేదు, అనుబంధ జాబితాను మంగళవారమే ప్రచురించాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)ను ఆదేశించింది. ఆ జాబితా ఏమిటనే విషయాన్ని స్పష్టం చేయలేదు. భవిష్యత్తులో చరిత్రకారులు ఈ విడ్డూరాన్ని తప్పక నమోదు చేస్తారు. పశ్చిమ బెంగాల్‌లో 27 లక్షల మందికి పైగా ఓటర్ల పేర్లను ఓటర్‌ జాబితాల నుంచి తొలగించడానికి భారత సర్వోన్నత న్యాయస్థానం ఆమోద ముద్ర వేసింది! మరింత స్పష్టంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు ఆ అక్రమాన్ని మౌనంగా సమ్మతించింది.

ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో మరణం, వలసపోవడం మొదలైన కారణాల ప్రాతిపదికన ఓటర్ల పేర్లను పెద్ద ఎత్తున జాబితాల నుంచి తొలగించడం జరిగింది. అయితే నేను ప్రస్తావిస్తున్న కేసు విభిన్నమైనది. ‘సర్‌’లో భాగంగా ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేయించుకునేందుకు దరఖాస్తు చేసుకుని, ముసాయిదా ‘సర్‌’ జాబితాలలో ఉండి కూడా కార్యక్రమ విధాన సంబంధమైన పారదర్శకత లేని ఒక కొత్త, వివేచనారహిత ప్రక్రియలో భాగంగా తొలగింపునకు గురైన ఓటర్లకు సంబంధించిన న్యాయవివాదమిది. తమ పేరు ఓటర్‌ జాబితాలలో లేకపోవడానికి వ్యతిరేకంగా అప్పీల్‌ చేసుకునే హక్కు వారికి ఉన్నది. అయితే పోలింగ్‌ తేదీలోగా వారి అప్పీల్‌పై విచారణ జరిగి న్యాయనిర్ణయం వెలువడేందుకు ఆస్కారమే లేదు. లేనే లేదని నొక్కి చెప్పవలసి ఉన్నది. ఎందుకని? చట్టం ప్రకారం ఏప్రిల్‌ 7 నుంచి ఓటర్‌ జాబితాలలో మార్పులు, చేర్పులకు అవకాశం లేదు.

ఈ 27,16,393 మంది ఓటర్ల తొలగింపు ఈ అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే వర్తింప చేసే విషయమై సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోవలసి ఉంది. లేదా అలా జరగకుండా ఉండేందుకు ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉన్నది: ఈసారికి ఓటు వేసేందుకు అనుమతించడమో లేదా ఓటర్ల అప్పీళ్లు అన్నిటిపైనా విచారణ జరిపి న్యాయనిర్ణయం వెలువరించేంత వరకు ఎన్నికల తేదీలు వాయిదా వేయడం.


ఓటర్‌ జాబితాల నుంచి ఈ తొలగింపులు పూర్తిగా లోపభూయిష్టమైనవని నిరూపించే సాక్ష్యాధారాలను సమగ్రంగా కోర్టుకు నివేదించడం జరిగింది. ఒక ఓటర్‌ సమర్పించే డాక్యుమెంట్లు అన్నిటినీ విచారణాధికారులు పరిశీలించవలసిన అవసరం లేదు. ఒక మాజీ న్యాయమూర్తి పేరు, ఒక కార్గిల్‌ వీర యోధుని పేరు, పలు శౌర్యపతకాలు పొందిన ఒక సైనికుని పేరు, ఇండియన్‌ పాస్‌ పోర్టులు ఉన్న పలువురు భారతీయుల పేర్లు, సర్వీసులో ఉన్న ప్రభుత్వాధికారుల పేర్లు తొలగింపునకు గురయ్యాయి! వీరందరూ ఓటరుగా నమోదయ్యేందుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సమర్పించినవారే సుమా! ఈ తొలగింపులు ఒక పద్ధతి ప్రకారం జరిగాయి. మరి! మూడోవంతు తొలగింపులు ముస్లింలు అత్యధికంగా ఉన్న రెండు జిల్లాల్లో జరిగాయి. నందిగ్రామ్‌ జిల్లాలో తొలగింపబడిన పేర్లలో 95 శాతం ముస్లింలవే కావడం గమనార్హం.

‘క్షమించండి, మీ పేరు ఓటర్‌ జాబితాల నుంచి తొలగించబడింది’ అని సుప్రీంకోర్టు ఆ లక్షలాది దురదృష్టకర ఓటర్లకు చెప్పింది. ఇంకా ఏమి చెప్పిందో చూడండి: అప్పిల్లేట్‌ ట్రిబ్యునల్‌కు వెళ్లి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. అవును, మీరు ఈసారి ఓటువేయలేక పోవచ్చు. అయితే ఓటు వేసేందుకు మీకు ఉన్న హక్కును శాశ్వతంగా రద్దు చేయడం లేదు.

త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలపై తన ఉత్తర్వు చూపే ప్రభావం, దాని పర్యవసనాల గురించి సర్వోన్నత న్యాయస్థానం పట్టించుకోలేదు. ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకునే మొత్తం ఓటర్లలో ఈ 27 లక్షల మందికి పైగా ఓటర్లు 5 శాతం మేరకు ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్‌ కాంగ్రెస్‌ 36 సీట్లను 5 శాతం, అంతకంటే తక్కువ మెజారిటీ ఓట్లతో గెలుచుకున్నది. ప్రస్తుత ఓట్ల తొలగింపులు నిర్దిష్ట ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నందున వాటి ప్రభావం టీఎంసీ విజయావకాశాలపై మరింత తీవ్రంగా ఉంటుంది. కోర్టు నిర్ణయం ఈ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాన్ని తారుమారు చేయగలదు. సదరు తొలగింపులు పౌరసత్వ హక్కులపై చూపే ప్రభావాన్ని సైతం సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకున్నట్టుగా కనిపించడం లేదు.


తీవ్ర రాజకీయ పర్యవసానాలు ఉన్న ఒక గందరగోళ పరిస్థితిలో సుప్రీంకోర్టు వ్యవహరిస్తోంది. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఈసీఐ వ్యవహరిస్తోందని, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచీ ఆరోపిస్తోంది. ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ జరిగిన తీరుతెన్నులే అందుకు నిదర్శనమని ఆ పార్టీ అధినేత్రి మొదలు సామాన్య కార్యకర్త వరకు అందరూ ఘోషిస్తున్నారు. ‘సర్‌’ మూలంగా టీఎంసీ ఐదు శాతం విధేయ ఓటర్లను కోల్పోయింది. వారిలో అత్యధికులు ముస్లింలు కావడం గమనార్హం. నిజమే ‘సర్‌’ అమలులో ఈసీఐ వ్యవహరించిన వైనమంతా టీఎంసీ ఆరోపణ సరైనదే అన్నట్టుగా ఉన్నది. ‘సర్‌’ను చేపట్టక ముందు ఓటర్‌ జాబితాలలో ఓటర్ల పేర్లు ‘మితిమీరిన’ సంఖ్యలో ఉన్నాయనడం సరికాదు. ‘సర్‌’కు ముందు బెంగాల్‌ ఓటర్‌ జాబితాలలో 7.66 కోట్ల పేర్లు ఉన్నాయి. ఈ సంఖ్య అప్పుడు రాష్ట్రంలోని వయో జనాభా సంఖ్యకు ఇంచుమించు సమానంగా ఉన్నది. ఎన్యూమరేషన్‌ ఫామ్స్‌ సమర్పించలేదనే కారణంతో 58 లక్షల పేర్లను తొలగించారు. ఓటరు నమోదుకు అవసరమైన డాక్యుమెంట్లు అన్నీ కచ్చితంగా ఉండాలని ఈసీఐ గట్టిగా నిర్దేశించింది. కఠినంగా వ్యవహరించింది. అయితే బెంగాల్ యేతర రాష్ట్రాలలో ఈసీఐ ఈ విధంగా వ్యవహరించలేదు.

ఈ గందరగోళ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిన అగత్యం సర్వోన్నత న్యాయస్థానానికి ఏర్పడింది. ఓటర్‌ జాబితాల సవరణ ప్రక్రియ సంక్లిష్టమవడంలో అత్యున్నత న్యాయస్థానానికీ ఆక్షేపణీయమైన పాత్ర ఉన్నది. ఎన్నికలకు ముందు కేవలం నాలుగు నెలల్లో ఓటర్‌ జాబితాలను సరికొత్తగా రూపొందించేందుకు అనుమతినిచ్చింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ‘సర్‌’ ప్రక్రియ అమలుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కొత్త నియమాలను నిర్దేశించడాన్ని చూస్తూండిపోయింది. తొలగించిన ఓటర్ల పేర్ల డిజిటల్‌ జాబితాను ప్రచురించే బాధ్యతను ఈసీఐ నిర్వర్తించకపోవడాన్ని కూడా సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది. రాజ్యాంగ అధికరణ 142 కింద తన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి, ఓటర్ల ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునే అధికారాల విషయంలో చట్టబద్ధమైన ఈఆర్‌ఓ (ఓటర్ల నమోదు అధికారులు) లను పక్కన పెట్టి, హడావుడిగా ఏర్పాటు చేసిన ఒక కొత్త న్యాయనిర్ణయ యంత్రాంగం (అప్పిల్లేట్‌ ట్రిబ్యునల్‌)కు అనుకూలంగా ఒక అసాధారణ ఉత్తర్వు జారీ చేసింది. ఇది పరిస్థితిని మరింత గందరగోళపరిచింది. ఓటర్ల వినతులపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవడానికి గడువు విధించలేదు. తద్వారా ఓటర్ల ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునే కాల వ్యవధి ఎన్నికల షెడ్యూలును అతిక్రమించేందుకు సైతం అనుమతించింది. పోలింగ్‌ తేదీలోగా తమ పేరు ఓటర్‌ జాబితాలో ఉండేలా చేసుకునేందుకు ప్రజలు ప్రయత్నించేందుకు ఆస్కారం లేకుండా చేసింది. దీనివల్ల ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ మరింత గందరగోళమై విషాదకర పర్యవసానాలకు దారితీసింది.


‘సర్‌’ కేసు కేవలం ఒక న్యాయపోరాటం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఉదాహరణగా ప్రస్తావించేందుకు అర్హమైన ఒక చరిత్రాత్మక న్యాయవివాదమది. నేడు న్యాయవ్యవస్థ భారత ప్రజాస్వామ్య సమగ్రతకు అంతిమ రక్షణ కవచంగా ఉన్నది. మన ఎన్నికలు బంగ్లాదేశ్‌ లేదా పాకిస్థాన్ ఎన్నికల తీరుగా పోకుండా నిరోధించగల ఏకైక రాజ్యాంగ వ్యవస్థ మన న్యాయవ్యవస్థే, సందేహం లేదు. అయితే భారత ప్రజాస్వామ్యానికి మన న్యాయవ్యవస్థ అలాంటి రక్షణనిస్తుందా? భారత పౌరుల ప్రాథమిక హక్కులకు ఏడీఎమ్‌ జబల్పూర్‌ కేసు (హెబియస్‌ కార్పస్‌ కేసుగా సుప్రసిద్ధం) ఎలాంటిదో మన ఎన్నికల ప్రజాస్వామ్యానికి ‘సర్‌’ కేసు అలాంటిది. 1976 నాటి ఆ కేసు కార్యనిర్వాహక వ్యవస్థ తన పరిధిని అతిక్రమించేందుకు అనుమతినిచ్చింది. ఫలితంగా పౌరుల ప్రాథమిక హక్కులకు చీకటి రోజులు దాపురిల్లాయి. ఇప్పుడు మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఓటుహక్కుకు రక్షణ కల్పించే స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, సమ్మిళిత ఓటర్‌ జాబితాలకు ‘సర్‌’ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వు ఎంత మాత్రం దోహదం చేసేదిగా లేదు. ప్రజాస్వామ్య నైతికత అయిన ఓటుహక్కును పరిరక్షించే విషయంలో సుప్రీంకోర్టుపై నిండు నమ్మకంతో ఉన్న అనేకానేక మందిని ఆ ఉత్తర్వు పూర్తిగా నిరుత్సాహపరిచింది.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

ఈ వార్తలు కూడా చదవండి..

హోంగార్డుల సమస్యలు పరిష్కరించండి: సీఎం చంద్రబాబుకు ఏపీ బీజేపీ చీఫ్ లేఖ

తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా ప్రత్యేక రైళ్లు

For More AP News And Telugu News

Updated Date - Apr 09 , 2026 | 02:34 AM