Share News

యుద్ధంతో శాంతి అసాధ్యం!

ABN , Publish Date - Sep 16 , 2026 | 02:26 AM

‘‘కేశవా! నాకు అపశకునములు కనిపిస్తున్నాయి. యుద్ధంలో స్వజన సమూహాన్ని సంహరించడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని నాకు అనిపించడం లేదు. విజయం, రాజ్యం, సుఖాలు నాకు అవసరం లేదు. ఈ భోగాలు,...

యుద్ధంతో శాంతి అసాధ్యం!

‘‘కేశవా! నాకు అపశకునములు కనిపిస్తున్నాయి. యుద్ధంలో స్వజన సమూహాన్ని సంహరించడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని నాకు అనిపించడం లేదు. విజయం, రాజ్యం, సుఖాలు నాకు అవసరం లేదు. ఈ భోగాలు, ఈ జీవితం వల్ల ప్రయోజనం ఏమిటి?’’

ఐదు వేల ఏళ్ల క్రితం అర్జునుని హృదయంలో కలిగిన ఆవేదన, కరుణ, మానవత్వ భావనలు నేటికీ వర్తిస్తాయి. యుద్ధం వల్ల కలిగే వినాశనాన్ని అతడు ముందుగానే ఊహించాడు. ఇరుపక్షాల వారినీ స్వజనులుగానే భావించాడు. మరి నేడు?

చరిత్రను పరిశీలిస్తే, యుద్ధాలు మానవాళికి అపారమైన నష్టాన్ని మిగిల్చాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో కోట్లాది మంది సైనికులు, ప్రజలు మరణించారు. రెండో ప్రపంచ యుద్ధంలో అణుశక్తి, సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో మరింత భయంకరమైన విధ్వంసం జరిగింది. దాదాపు ఎనిమిది కోట్ల మంది ప్రాణ నష్టం, లక్షల కోట్ల ధన నష్టం జరిగింది. దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. అయినా, ప్రపంచానికి శాశ్వత శాంతి లభించలేదు.

లీగ్ ఆఫ్ నేషన్స్, ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి వంటి సంస్థలు ఏర్పడినా ప్రపంచంలో యుద్ధాలు ఆగలేదు. సామ్రాజ్యవాదం, ఆర్థిక ఆధిపత్యం, మతపరమైన విద్వేషాలు, పరోక్ష యుద్ధాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. రెండు ప్రపంచ యుద్ధాల అనంతరం కొరియా, వియత్నాం యుద్ధాలు కూడా లక్షలాది ప్రాణాలను బలి తీసుకున్నాయి. పాలస్తీనా–ఇజ్రాయెల్ ఘర్షణలు, ఉక్రెయిన్ యుద్ధం వంటి సంఘటనలు ప్రపంచాన్ని అశాంతి వైపు నెడుతున్నాయి. గతం నుంచి పాఠాలు నేర్చుకోవడంలో మానవజాతి విఫలమవుతోంది.


కళింగ యుద్ధానంతరం పశ్చాత్తాపం చెందిన అశోకుడు.. ప్రజల సంక్షేమం, శాంతి, అభివృద్ధి కోసం కృషి చేశాడు. ప్రస్తుతం ప్రపంచంలో అలాంటి పరివర్తన ఎంతవరకు కనిపిస్తోంది?! వసుధైవ కుటుంబకంలో ప్రపంచమంతా ఒక కుటుంబమే. అయినప్పటికీ, ఆధిపత్య ధోరణులు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులు, మతపరమైన ద్వేషాన్ని రెచ్చగొట్టే వర్గాలు యుద్ధానంతర సమాజ దుస్థితిని మరిచిపోతున్నాయి.

అణ్వాయుధాలు, ఖండాంతర క్షిపణులు, అపారమైన ఆయుధ సంపత్తి శాంతిని తీసుకురాలేవు. అదే సంపదను పేదరికం, ఆకలి, వైద్యం, విద్య కోసం వినియోగిస్తే ప్రపంచం మరింత సంతోషంగా మారుతుంది. యెమెన్, సూడాన్, అఫ్ఘానిస్థాన్ వంటి దేశాల్లో ప్రజలు నేటికీ ఆకలి, నిరాశ్రయం, అనారోగ్యంతో బాధపడుతున్నారు.

మానవాళిపై దయ, ప్రేమ, సహానుభూతి పెరిగినప్పుడే సుస్థిర శాంతి సాధ్యమవుతుంది. శాంతి చర్చలు కేవలం రాజకీయ ప్రయోజనాలకే పరిమితం కాకుండా మానవ సంక్షేమానికి దారి తీయాలి. ప్రపంచ శాంతి స్థాపనలో భారతదేశం తన సాంస్కృతిక వారసత్వం, అహింసా సిద్ధాంతం, ‘‘వసుధైవ కుటుంబకం’’ భావనల ద్వారా మార్గదర్శకత్వం వహించగలదని ఆశిద్దాం.

సూర్యనారాయణ టంగుటూరి

ఈ వార్తలు కూడా చదవండి..

ఆళ్ల నాని మృతిని తొలుత గుర్తించింది ‘మ్యాక్సీ’నే: వాచ్‌మన్

మాట తప్పడం, మడమ తిప్పడమే సీఎం రేవంత్ రెడ్డి ట్రేడ్ మార్క్: కవిత

For More TG News And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 02:26 AM