Share News

Vemana Telugu Philosopher Poet: వేమన జయంతి తెలుగుకు గౌరవం

ABN , Publish Date - Jan 17 , 2026 | 05:33 AM

‘ప్రపంచ కవుల్లో సోక్రటీస్ ఎలాగో, తెలుగు సాహిత్యంలో వేమన అలా. ఆయన సత్యాన్ని నిర్భయంగా పలికారు.’ 19వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి సీపీ బ్రౌన్, వేమన...

Vemana Telugu Philosopher Poet: వేమన జయంతి తెలుగుకు గౌరవం

‘ప్రపంచ కవుల్లో సోక్రటీస్ ఎలాగో, తెలుగు సాహిత్యంలో వేమన అలా. ఆయన సత్యాన్ని నిర్భయంగా పలికారు.’ 19వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి సీపీ బ్రౌన్, వేమన పద్యాల్లోని లోతును చూసి వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది. వేల సంఖ్యలో ఉన్న ఆ పద్యాలను సేకరించి, వాటిని ఇంగ్లీష్‌లోకి అనువదించి, ప్రపంచ సాహితీ యవనికపై వేమనకు స్థానం కల్పించారు. అక్షరాయుధంతో సామాజిక విప్లవం తెచ్చిన సహజ కవి వేమన.

సాధారణంగా కవులు అంటే సామాన్యులకు అందని, అర్థం కాని అత్యున్నత సాహితీ విలువలు ఉన్న సాహిత్యం రాస్తారని అనుకుంటారు. కానీ వేమన ప్రతి వ్యక్తి నోటిపై సహజంగా పలికే సాహిత్యం రాశారు. ‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మాట ఇప్పటి తరానికీ చిరపరిచితం అంటే, ఆ సాహిత్యానికి అంత జీవం ఉందని అర్థం. వేమన శతకం వినని తెలుగు చెవి ఉండదు. తరగతి గది నుంచి తాత్విక చర్చల వరకు, పల్లె పదాల నుంచి మేధావుల గోష్ఠుల వరకు వేమన పద్యం ఒక వేదంలా మార్మోగుతూనే ఉంటుంది.

వేమన 17వ శతాబ్దానికి చెందినవారు. ఆయన అసలు పేరు కుమారగిరి వేమారెడ్డి. ఆయన అన్న అనవేమారెడ్డి ఒక ప్రాంతానికి పాలకుడిగా ఉండేవారు. వేమన విలాసాల మధ్య పెరిగారని చెబుతారు. యవ్వనంలో వేమన ప్రాపంచిక సుఖాలకు లోనయ్యారని, అయితే తన వదిన మాటల ప్రభావంతో, తన గురువు అభిరామయ్య మార్గదర్శకత్వంలో ఆయనలో గొప్ప జ్ఞానోదయం కలిగిందని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత ఆయన విలాసాలను వదిలి సత్యాన్ని అన్వేషించే యోగిగా మారారు. సమాజంలోని కుళ్లును, మనుషుల వేషధారణలోని మోసాన్ని గమనించిన వేమన, అప్పటి నుంచి ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా దేశాటన చేశారు. ఈ క్రమంలోనే ఆయన సామాన్యుడి భాషలో పద్యాలు అల్లడం ప్రారంభించారు. వేమన సాహిత్యం అంటే ‘ఆటవెలది’ పద్యాలే. పండితులకే పరిమితమైన కవిత్వాన్ని సామాన్య ప్రజల చెంతకు చేర్చిన ఘనత ఆయనది. సుమారు 3000కు పైగా పద్యాలు రచించారు. ప్రతి పద్యం చివరన ‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మకుటం ఉంటుంది. ఆయన పద్యాలలో కేవలం నీతి మాత్రమే కాక, సమాజంలోని మూఢనమ్మకాలు, కుల వివక్ష, మత మౌఢ్యంపై తీవ్రమైన విమర్శలు ఉండేవి. వేమన తన జీవితాంతం ప్రజల కోసమే జీవించారు. సత్యశోధనలో భాగంగా ఆయన కటారుపల్లిలో సజీవ సమాధి చెందారు. ప్రతి యేటా పెద్ద ఎత్తున వారికి ఈ ప్రాంతంలో ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ నేటికి సమాధి ఆనవాళ్లు కనిపిస్తాయి.


వేమనను కవిగా కాకుండా రాయలసీమ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో దేవుడిగా పూజిస్తారు. బెంగళూరులో ప్రముఖ వాణిజ్య ప్రాంతంలో వేమన దేవాలయం ఉంది. వారి జయంతి, వర్ధంతి పేరుతో వేలాదిమంది మందితో కర్నాటకలో దశాబ్దాలుగా పలు ప్రాంతాల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వేమన పేరును కూడా అనేక మంది నేటికీ పెట్టుకుంటారు.

‘నదులన్నీ ఒక్కటే కానీ పేర్లు వేరు... ఆవుల రంగులు వేరు కానీ పాలు ఒక్కటే’ అన్న వేమన తత్వం నేటికీ సమాజ శాంతికి మూలాధారం. సమాజంలో వేళ్లూనుకున్న సంప్రదాయాలు మేలుకంటే కీడు చేస్తున్నాయని వేమన భావించారు. వేమన ఒక ప్రపంచ మానవుడు. సంస్కృత పదాల భారంతో నలిగిపోతున్న తెలుగు కవిత్వాన్ని జన బాహుళ్య భాషలోకి మళ్లించి, దానికి కొత్త రక్తాన్ని ఎక్కించిన ఘనత వేమనదే. పండితుల గదుల్లో బందీ అయిన తెలుగు పద్యానికి సంకెళ్లు తెంచి, దానికి స్వేచ్ఛను ప్రసాదించినవాడు వేమన. ఆయన పదాల్లోని సరళత్వం, ఆలోచనల్లోని గాంభీర్యం అద్వితీయం.

‘వేమన ఒక ‘డెమొక్రాటిక్ పోయెట్’. ఆయన పద్యం ఒక క్లాస్ రూమ్ కాదు, అది ఒక ప్రజా క్షేత్రం. సమాజం అనే రోగికి ఆయన పద్యం ఒక చేదు మందు లాంటిది’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రముఖ విమర్శకులు ఆరుద్ర. వేమన కవిత్వంలో ప్రధానంగా కనిపించేది సత్యం. అది నేటికీ పదును తగ్గలేదు. వేమన కేవలం నీతి పద్యాల కవి మాత్రమే కాదు, గొప్ప హేతువాది, యోగి. శ్రీశ్రీ, ఆరుద్ర వంటి ఆధునిక కవులు వేమనను తమకు గురువుగా భావించేవారు. వేమన ఒక ప్రపంచ మానవుడు. ఆయన పద్యాల్లోని సామాజిక స్పృహ నేటి తరానికి ఆదర్శమని శ్రీశ్రీ చెబుతారు. వేమన ఒక నిప్పుకణిక. సమాజంలోని కుళ్లును కడిగేయడానికి ఆయన తన పద్యాన్ని ఆయుధంగా వాడారని డాక్టర్ సి.నారాయణరెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు.


ఐక్యరాజ్యసమితి వేమనను ప్రపంచ కవుల జాబితాలో చేర్చింది. వేమన బోధించిన సత్యాలు ఏ ఒక్క మతానికో, దేశానికో పరిమితం కావు. ఆయన పద్యాల్లోని ‘సమత’, ‘మమత’, ‘మానవత్వం’ వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా ఏ కాలానికైనా సరిపోతాయి. షేక్‌స్పియర్, సోక్రటీస్, కన్ఫ్యూషియస్ వంటి ప్రపంచ ప్రసిద్ధ కవులతో సమానమైన గౌరవం వేమనకు దక్కింది. వేమన పద్యాలు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. ఆయన సందేశాలు ఐరోపా దేశాల్లోని మేధావులను సైతం ఆకర్షించాయి. లండన్‌లోని బ్రిటిష్ లైబ్రరీలో కూడా వేమన పద్యాల ప్రతులు భద్రపరిచారు.

యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థ వేమనను గుర్తించినప్పుడు, తెలుగు నేల మీద ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆ మహనీయుడికి మనం ఇచ్చే కనీస గౌరవం. కర్ణాటక రాష్ట్రంలో వేమన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం గతంలో అధికారికంగా నిర్వహించారు. ఈ సంవత్సరం కూడా వేమన జయంతిని అధికారికంగా నిర్వహించాలి.

యస్.విష్ణువర్ధన్‌రెడ్డి

బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు

(జనవరి 19: వేమన జయంతి)

ఇవి కూడా చదవండి...

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి తుమ్మల

కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదు: మంత్రి సీతక్క

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 17 , 2026 | 05:33 AM