దేశభక్తికీ మతభక్తికీ మధ్య వందేమాతరం!
ABN , Publish Date - Sep 27 , 2026 | 02:34 AM
‘మా తుఝే సలాం! వందేమాతరం!’ అనడం దేశభక్తి. దేశభక్తి వేరు; దేవతారాధన వేరు. మౌలికమైన ఈ తేడాను అర్థం చేసుకోకపోతే ‘వందేమాతరం’ మీద సాగుతున్న వివాదం అర్థం కాదు. ఈ వివాదం...
‘మా తుఝే సలాం! వందేమాతరం!’ అనడం దేశభక్తి. దేశభక్తి వేరు; దేవతారాధన వేరు. మౌలికమైన ఈ తేడాను అర్థం చేసుకోకపోతే ‘వందేమాతరం’ మీద సాగుతున్న వివాదం అర్థం కాదు. ఈ వివాదం వేర్లు 19వ శతాబ్దంలోనే ఉన్నాయి.
1857నాటి సిపాయిల తిరుగుబాటు భారత జాతీయోద్యమ చరిత్రలో కీలక ఘట్టం. దానినే చాలా మంది భారత ప్రథమ స్వాతంత్ర్య సమరం అని కూడా అంటారు. దానికి సన్నాహకంగా, ఈస్ట్ ఇండియా కంపెనీ విస్తరణకు వ్యతిరేకంగా 1855లో ఆదివాసీ సంతాల్ తిరుగుబాటు, అంతకుముందు 1763లో సన్యాసులు –ఫకీర్ల తిరుగుబాట్లు జరిగాయి. హిందూ సన్యాసుల తిరుగుబాట్లకు పండిట్ భాబని చరణ్ పాథక్, దేవీ చౌధురాని తదితరులు నాయకత్వం వహించగా, ముస్లిం ఫకీర్ల తిరుగుబాటుకు మజ్నూ షా, మూసా షా తదితరులు నాయకత్వం వహించారు. ఆ తిరుగుబాట్లలో మాతృభూమి విముక్తి అనే భావనతోపాటు హిందూ ముస్లిం ఐక్యత కూడా బలంగా వ్యక్తం అయింది. ఈ తిరుగుబాట్లన్నీ విఫలమైనప్పటికీ పరిపాలన విధానాలలో చాలా మార్పులు వచ్చాయి. భారత ఉపఖండంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసి, 1858లో భారతదేశం నేరుగా బ్రిటిష్ పాలనలోకి వెళ్లింది. అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ తొలి వైస్రాయ్ కూడా అయ్యి జంటపదవుల్ని నిర్వహించారు.
ఈ మూడు తిరుగుబాట్ల పరాజయాలు భారతీయులకు కొన్ని గుణపాఠాల్ని నేర్పినట్టే, వీటిల్లో వ్యక్తమైన మతసామరస్యం వంటి అంశాలు వలస పాలకులకు కూడా కొన్ని గుణపాఠాల్ని నేర్పాయి. భారత సమాజంలోని ప్రధాన మత సమూహాలను విభజించి, పరిపాలనా ప్రయోజనాలకు అనువుగా ఉపయోగించే విధానాలు రూపొందాయి. హిందూ, ముస్లింలు మళ్లీ ఏకం కాకుండా చూసుకోవడం తమకు శ్రేయస్కరం అని బ్రిటిష్ పాలకులు భావించారు. ‘విభజించి పాలించు’ అనే మాట ఆ కాలంలోనే వెలుగులోనికి వచ్చింది.
సిపాయిల తిరుగుబాటు అనంతర కాలానికి చెందిన బంకించంద్ర ఛటర్జీ బెంగాలీ సాహిత్యంలో సుప్రసిద్ధులు. 1858లో బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగిగా చేరిన ఆయన 19వ శతాబ్దం చివరి వరకు డిప్యూటీ మేజిస్ట్రేట్ వంటి పెద్ద పదవులను నిర్వర్తించారు. 1870ల మధ్యలో, దేశమాతను దుర్గామాత, కాళికాదేవి వంటి శక్తిస్వరూపాలుగా కొనియాడుతూ శిష్ట బెంగాలీ, సంస్కృత పదాలతో ‘వందేమాతరం’ రాశారు. నిరక్షరాస్యులు ఎలాగూ ఆ పాటను పాడలేరు; అక్షరాస్యులు సైతం ఆ కఠిన పదజాలాన్ని సులువుగా పలకలేరు. తర్వాత ఆయన 1882లో రాసిన తన ‘ఆనందమఠ్’ నవలలో దాన్ని చేర్చారు. బంకించంద్ర ఆ నవలలో తాను జీవిస్తున్న బ్రిటిష్ వలస పాలనను చిత్రీకరించలేదు. అప్పటికి దాదాపు వందేళ్ల క్రితం బెంగాల్లో నెలకొన్న కరువు, ఆర్థిక సంక్షోభాల కాలంలో సాగిన సన్యాసి–ఫకీర్ తిరుగుబాట్లను తన నవలకు నేపథ్యంగా తీసుకున్నారు. ఆ సన్యాసి–ఫకీర్ ఉద్యమాన్ని కూడా సంపూర్ణంగా చిత్రించలేదు. ఒక చారిత్రక ఉద్యమంలోని ముస్లిం ఫకీర్ సంప్రదాయాన్ని పక్కనపెట్టి, కథను ప్రధానంగా హిందూ సన్యాసుల చుట్టూ నిర్మించారు. కొండొకచో అప్పటి ముస్లిం పాలకుల మీద వ్యతిరేకత కూడా ప్రదర్శించారు. మాతృభూమి విముక్తి కోసం హిందూ సన్యాసులు మాత్రమే పోరాడారన్నట్టు కథనాన్ని నడిపారు. ఈ కథనం పాక్షిక సత్యం, సెలెక్టివ్ ఫ్యాక్ట్!
ఆ తిరుగుబాట్లలో ముస్లిం ఫకీర్లు కూడా ఉన్నారన్న వాస్తవాన్ని గుర్తించివుంటే, వాళ్ల భిన్నమైన ఆరాధనా పద్ధతుల్ని వేరుగా చిత్రించాల్సి వచ్చేది. రెండు భిన్న మత దృక్పథాలకు చెందిన సమూహాలు తమతమ ధార్మిక విధులను పాటించుకుంటూనే, మాతృదేశ విముక్తి కోసం ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారన్న సందేశం వచ్చేది. అలాగాక, ఆ నవల ముస్లిం ఫకీర్లు కూడా మాతృభూమి విముక్తి కోసం పోరాడారన్న వాస్తవాన్ని దాచిపెట్టింది.
మాతృభూమిని గౌరవించడం వేరు, దానిని దుర్గామాతగా భావించి హిందూ సంప్రదాయం ప్రకారం ఆ విగ్రహాన్ని పూజించడం వేరు. ముస్లింల విశ్వాసం తౌహీద్– ఏకేశ్వరోపాసన. వాళ్లు ఇతర దేవుళ్లను విశ్వసించరు, విగ్రహాలను పూజించరు. వందేమాతర గేయం మొదటి రెండు చరణాల్లో కనిపించే భారత ప్రకృతి, సస్యశ్యామలత, మాతృభూమి సౌందర్యం వర్ణనలతో ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ, తరువాతి నాలుగు చరణాల్లో దేశాన్ని హిందూ దేవతల ప్రతీకగా మార్చడంతో వివాదానికి ఆస్కారం ఏర్పడింది. 1905 బెంగాల్ విభజన వ్యతిరేక స్వదేశీ ఉద్యమంలో ‘వందేమాతరం’ పోరాట నినాదంగా మారింది. ముస్లింలు సైతం ఆ నినాదాన్ని గట్టిగా సమర్థించారు. అదే సమయంలో ఆ గేయంలోని తదుపరి నాలుగు చరణాల్లో చిత్రించిన హిందూమత ప్రతీకలపై ముస్లింవర్గాల్లో అభ్యంతరాలు కూడా తీవ్రంగానే వ్యక్తం అయ్యాయి. ‘లకుమ్ దీనుకుమ్ వలియ దీన్’ అనేది ముస్లిం మత సామరస్య విధానం. అది ఖురాన్ ఆదేశం. ‘మీకు మీ ధర్మం, నాకు నా ధర్మం’ అనేది దాని అర్థం. ఎవరి మతాచారాలను వాళ్లు పాటించుకోవచ్చు. అధిక సంఖ్యాకుల మతాచారాల్ని అల్పసంఖ్యాకులు పాటించాలని ఒత్తిడి చేస్తేనే వివాదం మొదలవుతుంది.
ఇక్కడ స్వామి వివేకానంద అభిప్రాయం అత్యంత ముఖ్యం. 1898 జూన్ 10న ఒక మిత్రునికి రాసిన లేఖలో హిందూమతం, ఇస్లాంల ఐక్యతే భారత భవిష్యత్తుకు ఆశ అంటూ, ‘‘వేదాంత మేధస్సు అయితే... ఇస్లాం శరీరం’’ వంటి ప్రసిద్ధ ఉపమానాన్ని వారు ఉపయోగించారు. భారత జాతీయత ఒక మత సమూహపు ఆధిపత్యంగా కాక, భిన్న సంప్రదాయాల సమన్వయంగా ఉండాలన్నది వివేకానంద సూచన. రవీంద్రనాథ్ టాగూర్ అభిప్రాయం కూడా కీలకమైనదే. 1937లో ‘వందేమాతరం’ గేయం మీద జరిగిన చర్చలో ఆయన మొదటి రెండు చరణాల్లో మాతృభూమి సౌందర్యాన్ని కీర్తించే అంశం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని, అయితే తరువాతి చరణాల్లోని హిందూ దేవతా ప్రతీకలు మాత్రం ముస్లింలకు అభ్యంతరకరంగా ఉండవచ్చని హెచ్చరించారు. ఇది ముస్లింలకేకాదు సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, నాస్తికులు, కమ్యూనిస్టులకు సైతం అభ్యంతరకర అంశమే. ఠాగూర్ సూచన మేరకు కాంగ్రెస్ జాతీయ కార్యక్రమాల్లో ‘వందేమాతరం’ గేయంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే పాడాలని గాంధీ, నెహ్రూ తదితర జాతీయోద్యయ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు సంఘ్ పరివార్ దీనిని ముస్లిం బుజ్జగింపు, ముస్లిం సంతుష్టీకరణ అని విమర్శిస్తున్నది.
1923లో సావర్కర్ హిందూత్వ సిద్ధాంతాన్ని మాతృభూమి–పుణ్యభూమి ప్రమాణాలతో కొత్త రాజకీయ భాషలో నిర్వచించారు. తరువాత, ఆరెస్సెస్ రెండో సర్‌సంఘ్ చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ తదితర హిందూత్వ ఆలోచనాపరులు ఆ భావజాలాన్ని మరింత విస్తరించారు. ముస్లింల పుణ్యభూమి భారతదేశం బయట ఉన్నదన్నది వారి విమర్శ. మక్కా, మదీనా, అల్–అక్సా మసీదు ముస్లింలకు పవిత్ర స్థలాలు. కానీ, ఒక పవిత్ర క్షేత్రం ఒక దేశంలో ఉండటం వల్ల ఆ దేశమే వారి రాజకీయ మాతృభూమి అవుతుందని చెప్పడం సరికాదు. ఇప్పటి సౌదీ అరేబియాను తమ పుణ్యభూమి అని ముస్లింలు భావించరు. మక్కాలోని కాబా వేరు; సౌదీ అరేబియా వేరు. భారత ముస్లింల జన్మభూమి, కర్మభూమి, పౌరభూమి, మరణభూమి... మదర్ ల్యాండ్– ఫాదర్ ల్యాండ్ అన్నీ భారతదేశమే. రాజ్యాంగ సభ కూడా ఈ సున్నితత్వాన్ని అర్థం చేసుకుంది. సభాధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్ 1950 జనవరి 24న ‘జనగణమన’ను జాతీయ గీతం (anthem) గానూ, ‘వందేమాతరం’ పాటలోని మొదటి రెండు చరణాలను జాతీయ గేయం (song) గానూ ప్రకటించగా దాన్ని సభ చప్పట్లతో ఆమోదించింది. ఆ సభలో ఇప్పటి బీజేపీకి పూర్వ సంస్థల నాయకులు సైతం ఉన్నారు. వర్తమాన భారత ప్రభుత్వ అధినేతలు భవిష్యత్తులో కన్నా గతంలోనే ఎక్కువగా జీవిస్తున్నారు. వాళ్లు చెప్పే గతం కూడా సెలెక్టివ్ మెమొరీ. గతంలో కూడా ఒక భాగాన్ని చెబుతారు, మరో భాగాన్ని దాచిపెడతారు. సారాంశం ఏమంటే– వందేమాతరం నినాదం, వందేమాతరం ఉద్యమం, వందేమాతరం గేయం– ఈ మూడూ ఒకటి కావు.
డానీ
సమాజ విశ్లేషకులు
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్డీఏ స్పష్టత
సీఈసీపై పోరుకు ఇండియా కూటమి సిద్ధం.. సెప్టెంబర్ 30న కీలక సమావేశం
Read Latest AP News And Telugu News