Share News

వందేమాతరం నిర్బంధం

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:49 AM

‘వందేమాతరం’లోని ఆరు చరణాలను ఆలపించడాన్ని నిర్బంధం చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమైనవి. మన రాజ్యాంగ నిర్మాతలు, జాతి పెద్దల నిర్ణయానికి భిన్నంగా ఈ ఉత్తర్వులు...

వందేమాతరం నిర్బంధం

‘వందేమాతరం’లోని ఆరు చరణాలను ఆలపించడాన్ని నిర్బంధం చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమైనవి. మన రాజ్యాంగ నిర్మాతలు, జాతి పెద్దల నిర్ణయానికి భిన్నంగా ఈ ఉత్తర్వులు జారీ చేయడం వారిని అగౌరవపరచడమే. రాజ్యాంగ నిర్మాతల ఆశయాల సాధనకు కృషి చేయవలసిందిపోయి, వారి సమిష్టి అభిప్రాయానికి తిలోదకాలివ్వడం గర్హనీయం.

వందేమాతరం గేయంలోని మిగతా చరణాలలో మతపరమైన అంశాలు ఉన్నందువల్ల దానిని మొదటి రెండు చరణాలకే పరిమితం చేయాలని భారత రాజ్యాంగ సభ నిర్ణయించింది. ఈ మేరకు దేశ తొలి రాష్ట్రపతి డా. బాబూరాజేంద్రప్రసాద్ 1950 జనవరి 24న ఒక ప్రకటన చేశారు. అంతకు ముందు 1937లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా జాతీయ నాయకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 1939 జూలై 1న ‘హరిజన’ పత్రికలో రాసిన వ్యాసంలో కొన్ని వర్గాల ప్రజలు ఆక్షేపించేటట్లయితే వందేమాతరం పాటను పాడనవసరం లేదని గాంధీజీ కూడా స్పష్టం చేశారు. అలాగే తన పుస్తకం ‘నిర్మాణాత్మక కార్యక్రమం’లో వందేమాతరం పాటను ఇతరులపై బలవంతంగా రుద్దరాదని గాంధీజీ పేర్కొన్నారు. ముస్లింలకు అభ్యంతరకరంగా, కోపం తెప్పించేదిగా ఉండరాదని కూడా స్పష్టం చేశారు. 1896లోనే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మొట్టమొదటిగా వందేమాతరాన్ని ఆలపించారు. వందేమాతరంలోని మొదటి రెండు చరణాలనే ఆయన పాడారు. అవి వివాదరహితమయినవని ఆయన అభిప్రాయపడ్డారు. మిగతా చరణాలు దుర్గామాతను స్తోత్రించే విధంగా ఉన్నాయని ఆయన భావించారు.

రాజ్యాంగ సభ వందేమాతర గేయానికి జాతీయ గీతంతో పాటు సమాన హోదా కల్పించలేదు. దానికి చట్టబద్ధత కూడా లేదు. కాని హోం మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులలో వందేమాతరం గేయాన్ని తప్పనిసరిగా జాతీయ గీతం కంటే ముందు పాడాలని, ఆరు చరణాలను కూడా ఆలపించాలని నిర్భంధించడం అహేతుకం. ఇతర మతస్తులను కూడా హిందూమత ప్రాధాన్యం కలిగిన వందేమాతర గీతంలోని అన్ని చరణాలను ఆలపించాలని ఆజ్ఞాపించడం వారి మత స్వేచ్ఛకు, సెక్యులర్ భావనలకు భంగకరం.

డా. పి.సి సాయిబాబు

ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ కుటుంబమే తిరుమల పవిత్రతని దెబ్బతీసింది.. అచ్చెన్నాయుడు ధ్వజం..

వేంకటేశ్వరస్వామితో ఆటలాడే వారెవరూ బతికి బట్టకట్టలేదు.. స్వామి శ్రీనివాసనంద సరస్వతి ఫైర్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 18 , 2026 | 12:49 AM