Share News

అంతులేని అమెరికా అమానుషాలు

ABN , Publish Date - Mar 06 , 2026 | 02:52 AM

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ఇరాన్‌ అగ్ర నాయకులను హతమార్చాయి. చిన్నారులపై బాంబులు వేయడంతో సహా ఇరాన్‌ ప్రజలను పలు విధాల భయభ్రాంతులకు....

అంతులేని అమెరికా అమానుషాలు

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ఇరాన్‌ అగ్ర నాయకులను హతమార్చాయి. చిన్నారులపై బాంబులు వేయడంతో సహా ఇరాన్‌ ప్రజలను పలు విధాల భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసిందేనని ఈ భయానక అమానుషాలను చూస్తే అనిపిస్తోంది. పాఠశాలలు, ఆసుపత్రులు, శరణార్థుల శిబిరాల పైన బాంబులు వేసి, మూకుమ్మడి హత్యలు చేయడం ఇజ్రాయెల్‌కు పరిపాటి. ఇరాన్‌లోనూ అటువంటి ఘోరాలు చేస్తున్నా ఇరానియన్లు తమను విమోచన ప్రదాతలుగా ఆహ్వానిస్తారని అమెరికా–ఇజ్రాయెల్ ద్వయం విశ్వసిస్తోంది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గత 80 సంవత్సరాల్లో, అనేక దేశాలలో ప్రభుత్వాల మార్పునకు అమెరికా ప్రయత్నించింది. ఈ క్రమంలో సంభవించిన ఏ ఒక్క యుద్ధంలో కూడా అమెరికా గెలవలేదు. ఊహకందనంత మారణహోమం తర్వాత కూడా అమెరికా తోక ముడుచుకుని పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వియత్నాం, అఫ్ఘానిస్థాన్‌లో అమెరికాకు ఎదురైన పరాజయాలే అందుకు ఉదాహరణలు. నిన్నగాక మొన్న వెనెజువెలా అధ్యక్షుడు మదురో, ఆయన భార్యను కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకువెళ్లారు. ఆ చర్య అమెరికా దురహంకారానికి ప్రతీక. సద్దాం హుస్సేన్‌ను భయంకరంగా ఉరితీశారు. లిబియా అధినేత గడాఫీని నడిరోడ్డు మీద హతమార్చారు. ఒసామాబిన్ లాడెన్‌ను అమెరికా సైనికులు కాల్చి చంపారు. ప్రపంచ ప్రజలు ఈ ఘటనలను టెలివిజన్‌లో చూశారు. తమ ఆధిపత్యాన్ని సవాల్‌ చేసిన ప్రతి ఒక్కరినీ నిర్దాక్షిణ్యంగా అంతమొందిస్తామని ఆ చర్యల ద్వారా ప్రపంచ దేశాలను అమెరికా హెచ్చరించింది.

తొలుత తమకు నమ్మకస్తుడైన మిత్రుడిగా ఉండి, ఆ తరువాత తమ ప్రయోజనాలను దెబ్బతీసినందుకు ఇరాక్‌ పాలకుడు సద్దాం హుస్సేన్‌ మెడ విరగ్గొట్టారు. అమెరికా సమకూర్చిన ఆయుధాలను కుర్దులకు వ్యతిరేకంగా సద్దాం ప్రయోగించాడు. వారిని ఊచకోత కోశాడు. ఆ హత్యాకాండను ఆపేందుకు అమెరికా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పైగా అమెరికా విషవాయువులను తయారుచేసే యంత్రాంగాలనూ సమకూర్చింది. కుర్దులకు వ్యతిరేకంగా జరిగిన అమానుష హత్యాకాండకు సద్దాం మాత్రమే బాధ్యుడు కాడు. అతడిని ప్రోత్సహించిన అమెరికా అధ్యక్షులు రీగన్, బుష్‌ (సీనియర్‌) కూడా బాధ్యులే.


లిండన్ జాన్సన్, జనరల్ వెస్ట్‌మోర్‌ల్యాండ్, రాబర్ట్ మెక్‌నమారా, రిచర్డ్ నిక్సన్‌లు వియత్నాంలో జరిగిన దారుణాలకు పరోక్షంగా ప్రత్యక్షంగా కారకులే. మరి ఆ పెద్దమనుషులను ఎందుకు ఉరితీయలేదు? కనీసం వీళ్లెవ్వరి మీద కేసులు కూడా నమోదు కాలేదు కదా. పాట్రిస్‌ లుముం, సాల్వడార్‌ అలెండే (చిలీ), చేగువేరా (క్యూబా) మొదలైన నాయకుల హత్యలు; ఇండోనేసియాలో కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, లక్షలాది కార్యకర్తలు, మద్దతుదారుల హత్యలు; వియత్నాం, కంబోడియా, లావోస్ ప్రజల దారుణ హత్యలు సీఐఏ పర్యవేక్షణలోనే జరిగాయి. తాలిబాన్‌కు మద్దతు ఇచ్చినందుకు, అల్–ఖైదాను సృష్టించినందుకు బాధ్యులైన అమెరికా అధ్యక్షులను ఉరితీశారా? అఫ్ఘానిస్థాన్ మొత్తాన్ని నాశనం చేసి మరీ నిష్క్రమించారు కదా.

సరే, పాలస్తీనియన్ల రక్తం తమ చేతులకు అంటని అమెరికా అధ్యక్షుడు ఒక్కరైనా ఉన్నారా? ఎంత మంది నియంతలను అమెరికా తన అక్కున చేర్చుకోలేదు? మార్కోస్‌ (ఫిలిప్పీస్స్‌), సమోజా (నికరాగ్వా), బాటిస్టా (క్యూబా), సుహార్తో (ఇండోనేషియా) మహా నరహంతకులు. వీరందరినీ వాషింగ్టన్‌ ప్రభువులు సమాదరించారు. సీఐఏ పర్యవేక్షణలో వారికి రక్షణ కల్పించారు. లక్షలాది ప్రజల హత్యలకు బాధ్యులైన ఈ నరహంతకులే అమెరికాకు స్నేహితులు! బాగ్దాద్‌లో అమలుపరిచిన న్యాయసూత్రాలను అమెరికా అధ్యక్షులకూ వర్తింపజేస్తే వారిలో ప్రతి ఒక్కరూ ఉరిశిక్షకు అర్హులే.

చిలీ అధ్యక్షుడు పినోచెట్ కనీసం 30 వేల మంది మేధావులను హతమార్చాడు. ప్రెసిడెంట్ జార్జ్ బుష్ (సీనియర్), జేమ్స్ బేకర్ సీఐఏ హెడ్‌ ఆఫీస్ నుంచి చిలీలో జరిగిన మారణహోమాన్ని నేరుగా పర్యవేక్షించారు. బాగ్దాద్ సూత్రం ప్రకారం పినోచెట్, అతని జనరల్స్‌ను కనీసం 200 సార్లు ఉరితీయాల్సింది. అదే విధంగా 1970 నుంచి 2000 వరకు అమెరికా అధ్యక్షులు, సీఐఏ అధికారులూ ఉరికంబం ఎక్కి ఉండాల్సింది. ఇది వినడానికి ఎంత భయంకరంగా ఉన్నా ఈ ‘న్యాయ’సూత్రాన్నే ప్రపంచమంతటికీ అమెరికా వర్తింపజేసింది. అమెరికా నుంచి నిరంతర మద్దతును పొందిన ఏరియల్ షారోన్, లెబనాన్‌లోని షటిలా, సబ్రా క్యాంప్‌లలో పాలస్తీనా పౌరులను హత్య చేశారు. 70 ఏళ్లుగా పాలస్తీనా జనాభాపై క్రూరమైన దౌర్జన్యాలకు పాల్పడినందుకు ఇజ్రాయెల్, రక్షణ మంత్రులు లేదా సైనికులు ఎవరూ ఉరితీయబడలేదు.


యూరోపియన్ ప్రభుత్వాలకు, అమెరికన్‌ మీడియాకు ఈ అమానుష సంఘటనలు ఏవీ కనబడవు. మిత్రరాజ్యాల ‘ప్రెసిషన్ బాంబ్స్‌’ వల్ల కాలి, కూలిపోయిన తన ఇంట్లో ముక్కలై వికృతంగా కాలిన మాంసపు ముద్దలుగా గోడలకు అతుక్కుపోయిన తన బిడ్డలను చూసి ఒక ఇరానియన్ తల్లి ఏడుస్తోంది. ఈ బాధ ఇంగ్లీషు లేదా అమెరికన్ తల్లి ఆవేదన కంటే తక్కువైతే ఉండదు. అయితే ఇరానియన్‌ తల్లి ఆంగ్లో–సాక్సన్ యాసలో ఇంగ్లీషులో ఏడవకపోవచ్చు కానీ, బ్లో–డ్రైడ్ హెయిర్, మేకప్, మెనిక్యూర్డ్ గోళ్లతో, సౌకర్యవంతమైన సౌండ్ బైట్‌లతో ఇంగ్లీష్‌లో ఏడ్వకపోవచ్చు. ఆమె అర్థంకాని విదేశీ భాషలో బుర్ఖా కింద అసహనంగా విలపించవచ్చు. కానీ ఆమె కన్నీళ్లు, వేదన, ఆమె హృదయ విదారకమైన బాధ, ఆమె కోపం అన్నీ అంతే నిజమైనవి, తీవ్రమైనవే. అసలైన విషాదం ఏమిటంటే, స్వేచ్ఛా ప్రపంచం అని పిలవబడే దేశాలు ఆ అమానుషాలను చూస్తూ మౌనంగా ఉండడమే. అమెరికా అజేయమైనది కాదు. సామాన్య ప్రజలే అంతిమ విజయం సాధిస్తారు. మానవాళికి వ్యతిరేకంగా జరిగిన ఈ నేరానికి నిరసనగా ప్రతి అమెరికా కంపెనీ, ఉత్పత్తులను బహిష్కరించాలి. తద్వారా అమెరికా సామ్రాజ్యవాదానికి పగ్గాలు వేయవచ్చు. అమెరికా పరిపాలన, సీఐఏ, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, న్యాయాన్ని స్థాపించడానికి ప్రయత్నించినప్పుడల్లా, వారు కనీసం లక్ష నుంచి 10 లక్షల మందిని చంపారు. బాగ్దాద్‌లో అమలుపరిచిన న్యాయ సూత్రాలను అమెరికాకు వర్తింపజేస్తే వాషింగ్టన్‌లోని పెన్సిల్వేనియా అవెన్యూలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన అమెరికా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సీఐఏ అధికారులు, సైనికాధికారులను ఉరితీయడానికి తగినన్ని చెట్లు, టెలిగ్రాఫ్ స్తంభాలు లేవు. ముందుగా ట్రంప్‌కు, అతని మిత్రుడు నెతన్యాహుకు ఈ శిక్ష అమలుపరచాలి.

డాక్టర్‌ పి.మిత్ర

ఇవి కూడా చదవండి...

లేట్‌ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన

అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 06 , 2026 | 02:52 AM