ఇరాన్‌పై ట్రంప్ దూకుడు
ABN , Publish Date - Jan 30 , 2026 | 02:21 AM
ఇరాన్ పాలకులను అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు. కనీవినీ ఎరుగనంతగా విరుచుకుపడతానని బెదిరిస్తున్నాడు. ట్రంప్ మాటమీద నమ్మకం లేకనో, తనమీద తనకు శ్రుతిమించిన...
ఇరాన్ పాలకులను అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు. కనీవినీ ఎరుగనంతగా విరుచుకుపడతానని బెదిరిస్తున్నాడు. ట్రంప్ మాటమీద నమ్మకం లేకనో, తనమీద తనకు శ్రుతిమించిన నమ్మకంవల్లనో ఇరాన్ ఎప్పటిలాగానే మాటకుమాట బదులిస్తోంది. ఈ అదిలింపులూ బెదిరింపులకు జడిసేది లేదని, ట్రిగ్గర్ బిగించి సర్వసన్నద్ధంగా ఉన్నామని ట్రంప్‌ను తీసిపారేస్తోంది. ఇరాన్ సీనియర్ నాయకులు లక్ష్యంగా ఈ మారు దాడులు జరిగి, ఈ ముట్టడితో కచ్చితంగా ట్రంప్ ఆశిస్తున్న నాయకత్వం మార్పు సాధ్యపడుతుందని పాశ్చాత్య మీడియా సంస్థల నమ్మకం. ఒకదశలో కాస్తంత తగ్గుముఖం పట్టినట్టుగా కనిపించిన ఖమేనీ వ్యతిరేక ఉద్యమం, తిరిగి తారస్థాయికి చేరడంతో ఇంతకుమించిన మంచిసమయం మళ్ళీ రాదని అమెరికా నమ్ముతోందట. సదరు అంతర్గత సంక్షోభాన్ని వాడుకొని అక్కడ అస్మదీయులను ప్రతిష్ఠించాలన్నది ట్రంప్ కోరిక.
గత ఏడాది ఇరాన్ అణుకేంద్రాలమీద తాము దాడులు చేసిన సంగతినీ, వందలాదిమందిని మట్టుబెట్టి రాత్రికి రాత్రి వెనెజువెలా అధ్యక్షుడిని తరలించిన ఇటీవలి దృశ్యాన్ని పదేపదే గుర్తుచేస్తూ, అంతకంటే ఘాటుగా, గట్టిగా దెబ్బకొడతాను జాగ్రత్త అని ఇరాన్ పాలకులను ట్రంప్ హెచ్చరిస్తున్నారు. దాడులకు పాల్పడేముందు చర్చలకు రమ్మని ఇరాన్‌ను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అణ్వస్త్రాలకు చోటులేని, సమన్యాయబద్ధమైన ఒప్పందం కుదరాలని అంటూనే, ఆ చర్చలు జరగాలంటే ఇరాన్ ముందుగా సంపూర్ణంగా అస్త్రసన్యాసం చేయాలట. యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయడం, ఖండాంతర క్షిపణుల తయారీపై అమెరికా కొత్త నిబంధనలకు తలొగ్గడం, పశ్చిమాసియాలో ఇరాన్ అనుకూల గ్రూపులకు సహాయసహకారాలు పూర్తిగా నిలిపివేయడం ఈ ఆంక్షల్లో కొన్ని. గత ఏడాది జూన్‌లో జరిగిన కొద్దిరోజుల యుద్ధంలో ఇరాన్ వందలాది క్షిపణులను ఇజ్రాయెల్‌మీదకు ప్రయోగించిన సంగతి తెలిసిందే. వాటివల్ల ప్రాణనష్టం పెద్దగా లేకున్నా, వాటిని నిలువరించి, నిరోధించి తనను తాను రక్షించుకొనే క్రమంలో ఇజ్రాయెల్ తన ఆయుధ సంపత్తిని ఎక్కువగా నష్టపోయిందట. ఇజ్రాయెల్ దగ్గరున్న క్షిపణి నిరోధక వ్యవస్థల బలహీనతలు, వైఫల్యాలను కూడా ఆ దాడులు మిగతా ప్రపంచానికి ఎత్తిచూపాయి. ఈ నేపథ్యంలో, శత్రువుచేతుల్లో ఇజ్రాయెల్‌ను చేరగలిగే ఆయుధాలే లేకుండా చేయాలని ప్రయత్నం.
ఇవి కూడా చదవండి..
మందు కొడితే ఇలాగే ఉంటుందేమో.. సముద్రంలో చనిపోయిన తిమింగలంతో..
గేదెను చుట్టుముట్టిన సింహాల గుంపు.. ప్రాణం తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇరాన్ చుట్టూ భారీ యుద్ధనౌకలను మోహరించిన ట్రంప్ అతివేగంగా లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటున్నారనీ, దీర్ఘకాలం యుద్ధం కాక, ఓ పెద్ద దెబ్బతో శత్రువును కూల్చి నాయకత్వమార్పిడి కలను నెరవేర్చుకోవాలని అనుకుంటున్నట్టు మీడియా విశ్లేషిస్తోంది. ఇరాన్‌తో వ్యవహారం ట్రంప్ మాటల్లాగా తేలిక కాదని అమెరికా సైనికాధిపతులకు తెలుసు. పాతకాలపు రష్యన్ ఆయుధాలను వాడే వెనెజువెలామీద క్షణాల్లో విజయం సాధించినట్టుగా ఇరాన్‌ను కూడా నిముషాల్లో నిర్వీర్యం చేయగలనని ట్రంప్ నమ్ముతున్నట్టుంది. ఇరాన్ స్వదేశీ, విదేశీ ఆయుధసంపత్తి గురించి బయటకు తెలిసింది తక్కువేననీ, యుద్ధం మొదలైతేగానీ చైనా అందించిన అధునాతన ఆయుధాలు బయటపడవని రక్షణరంగ నిపుణులు అంటున్నారు.
తన అణుకార్యక్రమం శాంతియుతమైనదని ఇరాన్ అనడం, అణ్వాయుధాలు తయారుచేస్తోందంటూ అమెరికా పాతపాటే పాడటం అనాదిగా సాగుతోంది. 2015లో అమెరికా చొరవతో జరిగిన అణుఒప్పందం మిగతా ప్రపంచానికి యుద్ధ భయాన్ని పొగొట్టింది. ఆ తరువాత ఇరాన్ యురేనియం శుద్ధిస్థాయి హద్దులు దాటినట్టుగా ఆధారాలు కూడా లేవు. అయినా, మూడేళ్ళలోనే ట్రంప్ ఆ ఒప్పందం నుంచి వైదొలిగి, ఇరాన్‌మీద మళ్ళీ ఆంక్షలతో పరిస్థితిని మొదటికి తెచ్చారు. ఆర్థికకష్టాల్లో మునిగిన ఇరాన్ కూడా పరిమితులను ఉల్లంఘించాల్సిన పరిస్థితి కల్పించారు. పశ్చిమాసియాకు యుద్ధవిమానాలు, నౌకలు తరలిస్తున్న ట్రంప్‌కు అనేకదేశాలు చెబుతున్న హితవు చెవికెక్కడం లేదు. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అన్నివేలమందిని ఊచకోతకోసిన ఇరాన్ పాలకులు అంతసులువుగా విదేశీశక్తులకు లొంగిపోతారనుకోవడం భ్రమ. తమకు అనుకూలంగా లేని పాలకులను అమెరికా గద్దె దించేసిన దేశాలన్నీ ఆ తరువాత యుద్ధాలు, అంతర్యుద్ధాలు, జాతులూ తెగల వైరాలతో కుప్పకూలి, ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేసిన గతం ట్రంప్‌కు తెలియందేమీ కాదు.
ఇవి కూడా చదవండి..
మందు కొడితే ఇలాగే ఉంటుందేమో.. సముద్రంలో చనిపోయిన తిమింగలంతో..
గేదెను చుట్టుముట్టిన సింహాల గుంపు.. ప్రాణం తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..