Share News

Tripuraneni Ramaswamy: కలమే కవిరాజు కరవాలం

ABN , Publish Date - Jan 13 , 2026 | 05:04 AM

నూరేళ్ల క్రితమే మంచి కాలాన్ని ఆకాంక్షించిన త్రిపురనేని రామస్వామి, కొన్ని తరాల తెలుగు సాంస్కృతిక జీవనంపై చెరగని ముద్రవేసిన కవి పండితుడు. కలాన్ని కరవాలంగా మలచి మతమౌఢ్యంపై...

Tripuraneni Ramaswamy: కలమే కవిరాజు కరవాలం

‘‘ఎల్లజగముల, ఎల్లవేళల/ ఎల్లవస్తువులందునన్‌

మంచి కనబడి మంచి నిలబడు/ మంచి కాలము వచ్చెడిన్‌’’

నూరేళ్ల క్రితమే మంచి కాలాన్ని ఆకాంక్షించిన త్రిపురనేని రామస్వామి, కొన్ని తరాల తెలుగు సాంస్కృతిక జీవనంపై చెరగని ముద్రవేసిన కవి పండితుడు. కలాన్ని కరవాలంగా మలచి మతమౌఢ్యంపై విజయవంతమైన యుద్ధాన్ని నెరిపిన మహాజ్ఞాని.

బ్రాహ్మణులపై గాక బ్రాహ్మణవాదంపై పోరాడి ప్రత్యామ్నాయ సంస్కృతికి బాటలు వేసిన వ్యక్తి. తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిని గురువుగా ఎన్నుకొని ఆయనకు ప్రియశిష్యుడిగా మారిన త్రిపురనేని రామస్వామి, ఏనాడూ తన పేరు చివర కుల చిహ్నాన్ని జోడించుకోలేదు. ఆయన పేరు చివర ‘చౌదరి’ అనే తోకను జోడించింది ఆయన ప్రత్యర్థులే. ఇది తెలియని అమాయక అనుచరులు కూడా ఆయన్ని ‘త్రిపురనేని రామస్వామి చౌదరి’ గానే వ్యవహరిస్తున్నారు.

రాణాప్రతాప్‌, ఖూని, పల్నాటి పౌరుషం, సూత పురాణం, నరకము, అంపకము, భగవద్గీత లాంటి కావ్యాలు, నాటకాలతో పాటు, ‘ధూర్త మానవా’ అనే మకుటంతో ఒకటి, ‘గోపాల రాయా’ మకుటంతో ఒకటి, ‘చెన్నకేశవా’ మకుటంతో ఒకటి, ‘కుప్పుస్వామి శతకం’ ఒకటి... మొత్తం నాలుగు శతకాలు రాశారు.

1887 జనవరి 15న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో చలమయ్య, రామమ్మ దంపతులకు రామస్వామి జన్మించారు. 1943 జనవరి 16న తన 56వ ఏట కన్నుమూసిన ఈ ‘కవిరాజు’ గొప్ప సంస్కర్త, నాటకకర్త, కవి, స్వాతంత్య్ర సమరయోధుడు. పురాణేతిహాసాల గుట్టు రట్టు చేసిన వ్యక్తి. తన సాహిత్యకృషికి గాను దేశోద్ధారక కాశీనాథుని చేతుల మీదుగా 1929లో బెజవాడలో జరిగిన సభలో ‘కవిరాజు’ బిరుదును పొందాడు. 1942లో గుడివాడలో గజారోహణ చేయించి పుర ప్రజలు ఘన సన్మానం గావించారు. చిన్నప్పుడు గుడివాడలో బడికి వెళ్తూ మిఠాయి కొనుక్కున్నాడట. పక్కనే వున్న బ్రాహ్మణ కులానికి చెందిన బాలుడు అడగ్గా మరో పొట్లాం కొన్ని ఇవ్వబోగా ‘‘నీవు శూద్రుడవు నేను తినే ఆహారాన్ని తాకరాదు ఆ పొట్లాం అక్కడవుంచు నేను తీసుకుంటా’’నన్నాడట. ఈ చిన్న సంఘటన ఆ వయస్సులోనే రామస్వామిపై తీవ్ర ప్రభావం చూపి కులాధిపత్య ధోరణిపై జీవితాంతం అలుపెరుగని పోరాటం చేయటానికి దారి తీసింది.


ఐర్లాండ్‌లోని డబ్లిన్‌కి వెళ్లి బార్‌–ఎట్‌–లా చదివాడు. అక్కడ కూడా పంచెకట్టు, తలపాగాతోనే విశ్వవిద్యాలయానికి వెళ్లేవాడట. ఐర్లాండులో 13ని దురదృష్టకరమైన సంఖ్యగా భావించి ఇళ్ల వరసకు కూడా 12 ఎ అని రాసేవారట. భోజనాల టేబుల్‌పై కూడా 13 మంది కలిసి కూర్చునేవారు కాదు. అలా చేస్తే ముందు భోజనం ముగించి లేచేవారు మరణిస్తారని అక్కడి ప్రజల విశ్వాసం. ఆనాడే కావాలని 13 నంబర్‌ రూంని ఎంచుకుని అందులో ఉండటం, 13వ వాడిగా భోజనం బల్ల దగ్గర కూర్చుని అందరికంటే ముందు లేచేవాడు.

తెనాలి సమీపంలోని కూచిపూడికి చెందిన చంద్రమతిని వివాహం చేసుకోవటంతో గుంటూరు జిల్లా ప్రముఖులు జాగర్లమూడి కుప్పుస్వామి, పాములపాటి కృష్ణయ్యల ఒత్తిడితో తన కార్యక్షేత్రాన్ని తెనాలికి మార్చాడు. అంతకుముందు రెండు సంవత్సరాలు విజయవాడలో ఉన్నారు. తెనాలి మున్సిపల్‌ ఛైర్మన్‌గా పిల్లలమర్రి ఆంజనేయులుపై గెలవటమే గాక, మరో రెండు పర్యాయాలు కూడా గెలిచారు. 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్‌కి నండిపల్లి నరసింహారావుపై పోటీ చేసి గెలిచారు.

పెళ్లి చేయటానికి బ్రాహ్మణ పురోహితులే అక్కర్లేదని అనేకమంది బ్రాహ్మణేతర పురోహితుల్ని తయారు చేయటమేగాక ‘వివాహ విధి’ అనే పుస్తకాన్ని రాసి వారికి కరదీపికగా అందించారు. ఈనాటికీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బ్రాహ్మణేతర పురోహితులు పెళ్లిళ్లు చేస్తున్నారు. ‘రైతు’ అనే పేరిట పత్రిక నిర్వహించి రైతుల్ని చైతన్యపరచటానికి ప్రయత్నించారు. తన నివాసానికి ‘సూతాశ్రమం’ అని పేరు పెట్టి ‘సూతాశ్రమ గీతాల’ పేరుతో గీతాలు రాశారు.


వీరగంధము తెచ్చినారము/ వీరుడెవ్వరో తెల్పుడీ

తెలుగువారల వేడి నెత్తురు/ తుంగభద్రను గలిసినప్పుడు

దూరమందున్న సహ్యజ / కత్తినెత్తురు కడిగినప్పుడు

... లాంటి సుప్రసిద్ధ గీతాలు ఈ సూతాశ్రమ గీతాల్లోనివే.

గొప్ప సంస్కర్త, సామాజిక రుగ్మతలపై కలాన్ని కత్తిలా వాడి పోరాడిన ఈయన కేవలం 56 సంవత్సరాలు మాత్రమే జీవించటం తెలుగువారి దురదృష్టం.

మతములె పుట్టకున్న యెడ/ మారణ కర్మములిన్ని సాగునే

అని ఆక్షేపించి...

‘‘మలమల మాడు పొట్ట తెగ/ మాసిన బట్ట కలంతపెట్టగా

విలవిల యేడ్చుచున్న నిరుపేదకు / జాలిని’’ చూపటం ద్వారా ఈ మహాశయుణ్ణి గుర్తుపెట్టుకుందాం.

సి. సృజన

ప్రిన్సిపాల్‌, ఎన్‌.ఇ.ఎం. హైస్కూల్‌, యడ్లపాడు

(జనవరి 15: త్రిపురనేని రామస్వామి జయంతి)

ఇవి కూడా చదవండి..

డ్రోన్‌లతో సరిహద్దుల్లో పాక్ కవ్వింపులు... తిప్పికొట్టిన సైన్యం

ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 13 , 2026 | 05:05 AM