సాధించుకున్నదంతా సవరణతో పోయింది..!
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:58 AM
పార్లమెంట్ గతవారంలో అమలులోకి తెచ్చిన ట్రాన్స్‌జెండర్ హక్కుల సంరక్షణ (సవరణ) చట్టం, గత దశాబ్దకాలంలో ట్రాన్స్ ప్రజల జీవితాల్లో వచ్చిన పరిమిత ప్రగతిని కూడా వెనక్కి నెట్టేదిగా ఉన్నది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని...
పార్లమెంట్ గతవారంలో అమలులోకి తెచ్చిన ట్రాన్స్‌జెండర్ హక్కుల సంరక్షణ (సవరణ) చట్టం, గత దశాబ్దకాలంలో ట్రాన్స్ ప్రజల జీవితాల్లో వచ్చిన పరిమిత ప్రగతిని కూడా వెనక్కి నెట్టేదిగా ఉన్నది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని కానీ, తామే ఏర్పాటు చేసిన జాతీయ ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కౌన్సిల్‌ను కానీ, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన న్యాయమూర్తుల అడ్వైజరీ కమిటీని కానీ సంప్రదించకుండా, ఒక్క ట్రాన్స్ ప్రతినిధి కూడా లేని భారత పార్లమెంట్ 2019లో తానే చేసిన చట్టంలో ఎవరూ అడగని సవరణలను తెచ్చింది.
అసలు ఆ చట్టమే కొంత లోపభూయిష్ఠం అనుకుంటే, ఇప్పటి సవరణలు 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన నల్సా తీర్పులోని ప్రధాన మార్గదర్శకాలను నీరుగార్చేలా ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రధానమైన మార్గదర్శకం– తమ జెండర్‌ను నిర్ణయించుకునే పూర్తి అధికారం వ్యక్తులకు మాత్రమే ఉండాలనీ, ఒకరి జెండర్‌ను నిర్ణయించే అధికారం ఏ డాక్టర్లకూ మెడికల్ బోర్డులూ లేదా ఏ ప్రభుత్వ కమిటీలకూ ఉండదనీ చెబుతోంది. ప్రస్తుత చట్ట మార్పులు దీనికి పూర్తి విరుద్ధంగా అటువంటి ‘పరీక్షలు చేసే అధికారాన్ని’ మెడికల్ బోర్డులకు కట్టబెట్టాయి.
ఉన్నత న్యాయస్థానం నల్సా తీర్పు ద్వారా వ్యక్తులందరికీ (‘ట్రాన్స్’ వ్యక్తులకు మాత్రమే కాదు) జెండర్‌ను నిర్ణయించుకునే అధికారాన్ని ఇచ్చింది. అంటే పుట్టుకతో ఆపాదించిన మగ, ఆడ అనే జెండర్‌ను కాకుండా తాము గుర్తించుకున్న జెండర్‌లో బతకాలనుకునే వ్యక్తులు, ఇతర జెండర్ వ్యక్తులుగా మారటమే కాకుండా ఈ రెండింటి అవతల, నాన్ బైనరీగా కూడా ఉండొచ్చు. పుట్టుకతో ఆపాదించే మగతనాన్ని వద్దనుకుని తమ లోపలి ఆడతనాన్ని స్వంతం చేసుకునే వ్యక్తి తనను తాను స్త్రీగా, ట్రాన్స్ మహిళగా, లేదా హిజ్రా, కిన్నెర, జోగ్తా... అనే వివిధ రకాలుగా పిలుచుకుంటారనీ; పుట్టుకతో ఆపాదించే ఆడతనాన్ని కాకుండా తమలోని పురుషత్వాన్ని గుర్తించుకుని దానితో బతకాలనుకునే ట్రాన్స్ పురుషులు కూడా ఉన్నారనీ, మూడో జెండర్‌గా కొంతమంది మాత్రమే తమను తాము గుర్తించుకుంటారన్న అవగాహన నుంచి వచ్చిన మార్గదర్శక సూత్రమిది. శరీరపరంగా ఆడ/మగ రెండు వర్గాల్లో ఇమడని శరీర లక్షణాలు ఉండే ఇంటర్ సెక్స్ వ్యక్తులు కూడా తమ శరీరాలపై పూర్తి హక్కులు కలిగి, తమ జెండర్‌ను నిర్ణయించుకునే హక్కును ఈ తీర్పు ప్రకారం పొందారు.
ఇదంతా వైద్యశాస్త్రం, లేదా జీవశాస్త్రజ్ఞులు ఇచ్చిన జ్ఞానం కాదు. అణగారిన ఇతర సమూహాల లాగే, ఆయా ట్రాన్స్ సమూహాలు తమ గురించి తాము ఉత్పన్నం చేసుకున్న జ్ఞానం. గత కొన్ని దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా ఈ సమూహాలే వైద్యులను, సైకాలజిస్టులను, పోలీసులను, బ్యూరోక్రాట్లను, మేధావులను, రచయితలను సమాజాన్ని మొత్తం చైతన్యవంతం చేసుకుంటూ వస్తున్నాయి.
వలస పాలనకు ముందు పురుషుల మధ్య సమ లైంగికతకు, స్త్రీ–పురుష చట్రంలో ఇమడని వ్యక్తులకు భారతీయ సమాజంలో, సంస్కృతిలో, రాచరిక వ్యవస్థలో చోటు ఉంది. బ్రిటిషు విక్టోరియన్ సంప్రదాయ భావజాలం ప్రభావంతో బ్రిటిష్ సమాజంతో పాటు, బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్న అన్ని చోట్లా పితృస్వామ్య జెండర్ వ్యవస్థలో ఇమడని వ్యక్తులను, సమూహాలను అనుమానితులుగా, నేరస్థులుగా పరిగణించే చట్టాలు వచ్చాయి. వాటిలో మొదటిది సమలైంగికత్వాన్ని నేరం చేసిన సెక్షన్ 377. ఈ చట్టాల అమలులో వైద్యులు, వారి జ్ఞానం, వారు తయారు చేసిన పరీక్షలు కీలక పాత్ర పోషించాయి.
1990ల తర్వాత వచ్చిన హిజ్రా, ట్రాన్స్, ఇతర క్వీర్ ఉద్యమాలు తమ పట్ల తమ కుటుంబాలు, విద్యా సంస్థలు, ఆఫీసులు, తోటి సమాజం చూపించే తీవ్ర వివక్ష, చేసే లైంగిక హింస గురించి వివరంగా చెప్పాయి. ‘సాధారణ’ మనుషులు తేలిగ్గా అసాధారణమైన క్రూరత్వాన్ని తమ మీద చూపించటానికి ఒక ప్రధాన కారణం ‘తమ ఉనికినే నేరమయం చేసిన వలసవాద చట్టాలేనని, వాటిని తొలగించి అందరిలా పౌరులుగా పరిగణించని భారత ప్రభుత్వమే’నని తేటతెల్లం చేశాయి. తమకు ఆపాదించిన ఆడ, మగ జెండర్‌లను తిరస్కరించే వారికి కూడా రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు వర్తిస్తాయని 2014లో ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పి, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆరు దశాబ్దాలకు వారికి పౌరసత్వాన్ని ప్రసాదించింది. తమిళనాడు, కేరళ, ఒరిస్సాతో పాటు అనేక రాష్ట్రాల్లో ట్రాన్స్‌జెండర్ సంక్షేమ బోర్డులు స్త్రీలు, బలహీన వర్గాల కోసం ఉండే కొన్ని సంక్షేమ పథకాల పరిధిలో ట్రాన్స్ సమూహాల వ్యక్తులకు కూడా కొంత అవకాశం కల్పించాయి. కానీ ఇవి తెలంగాణతో సహా అత్యధిక రాష్ట్రాల్లో అత్యంత పరిమితులతో కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఇప్పటికీ ట్రాన్స్ సమూహాల్లో అత్యధికులు జీవన పోరాటంలో చిక్కుకుని, సమాజం అంచుల్లో బ్రతుకుతూ, ఏ రకంగానూ ప్రభుత్వ సహాయాన్ని అర్థించరు.
వ్యక్తులకు తమ జెండర్‌ను నిర్ణయించుకునే అధికారం ఉంటుందని, లింగ, జెండర్ అస్తిత్వం శరీర అవయవాల నుంచి వచ్చేది కాదని సుప్రీంకోర్టు 2014లో ఒప్పుకున్న సత్యాన్ని పక్కకు తోసి, ఈ 2026 చట్ట సవరణలు ట్రాన్స్ జెండర్ల అస్తిత్వాన్ని, ఇంటర్ సెక్స్ శరీరాలతో ముడేసి, జెండర్, లింగపరమైన సోయి లేని శాస్త్ర జ్ఞానంతో పనిచేసే మెడికల్ టెస్టులకు అనుసంధానించి మనల్ని కొన్ని దశాబ్దాల వెనక్కు తీసుకెళ్తున్నాయి. ‘నిజమైన’ టాన్స్ వ్యక్తులను, ‘మోసపూరిత’ ట్రాన్స్ వ్యక్తుల నుంచి, సుప్రీంకోర్టు గతంలో వద్దన్న పరీక్షల ద్వారా, వేరు చేసే అధికారం ఈ మెడికల్ బోర్డులకు ఇచ్చింది. ఒక దశాబ్దానికి పైగా పోరాడుతున్న ట్రాన్స్ మగవాళ్ల ఉనికినే గుర్తించలేదు. ఆడ, మగ అస్తిత్వాల్లో ఇమడని వాళ్ళనూ గుర్తించలేదు. అసలు మేమే మీ జెండర్‌ను నిర్ణయిస్తామంటోంది. ట్రాన్స్ వ్యక్తులను కుటుంబం హింసించినా సరే, అక్కడే ఉండాలని, బయటికొచ్చి వేరే ట్రాన్స్ సమూహాల సహాయం తీసుకుంటే, అలా సహాయం చేసిన వారికి కఠిన శిక్ష వేసే ప్రకరణను పెట్టింది. ఈ శిక్షలు ట్రాన్స్ వ్యక్తులపై లైంగిక దాడి చేస్తే వేసే రెండేళ్లకంటే చాలా ఎక్కువ. 19వ శతాబ్దపు వలస చట్టాల లాగా ట్రాన్స్ ప్రజల ఉనికినే నేరమయం చేసే చట్టమిది.
ట్రాన్స్ ప్రజలు పెద్దగా ప్రభుత్వ సంక్షేమంపై ఆధారపడి బ్రతకట్లేదు. 2019 నుంచి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన వార్షిక బడ్జెట్‌లో అయిదు నుంచి పది శాతం మాత్రమే ఖర్చు చేసిందని పార్లమెంట్ సభ్యులు క్రిందటి వారం చర్చలో ఎత్తి చూపారు. చదువున్నా ఉద్యోగాలు, పనుల్లోకి రానివ్వరు కాబట్టి అనేకమందికి భిక్షాటనపై, సెక్స్ వర్క్‌పై ఆధారపడక తప్పట్లేదు. అయితే, 2014 తీర్పు తర్వాత వచ్చిన చిన్న వెసులుబాటుతో కొంతమంది ఉద్యోగాల్లోకి ప్రవేశించారు. తెలంగాణలో మెట్రోలోనూ, ట్రాఫిక్ కానిస్టేబుళ్లుగానూ ఉన్నారు. కొంతమంది సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. ట్రాన్స్ మహిళలు, ట్రాన్స్ పురుషులు తమ కంటూ కొన్ని సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు. ముందు తరాల వాళ్ళు, యువతరం వారిని చదువు పూర్తి చేసుకొమ్మని చెబుతున్నారు. గ్రేస్ బానో ప్రచురణ సంస్థ ప్రారంభిస్తే, తమిళనాడులో నర్తకి నటరాజ్ పద్మశ్రీ పొందారు.
ట్రాన్స్ కళాకారిణి రేవతిని ప్రభుత్వమే పిల్లల స్కూళ్లల్లో జెండర్ గురించి చైతన్యపరచమని అడిగింది. గత పదేళ్లలో కార్పొరేట్ సంస్థల్లో కొంత కదలిక వచ్చింది. ట్రాన్స్ జెండర్ కార్డు ద్వారా గుర్తింపు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొంత వైద్య సహాయం లభిస్తోంది. కొందరయినా సరే, ట్రాన్స్ వ్యక్తుల తల్లిదండ్రులు, స్వీకర్, క్వియర్ బంధు వంటి సంస్థల్లో సభ్యులై, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుని, తమ పిల్లలకు సహకారం అందిస్తున్నారు. ప్రభుత్వాధికారులతో పని చేసి, ఇతరులను కూడా చైతన్యపరుస్తున్నారు. కిరణ్ నాయక్ వంటి ట్రాన్స్ పురుష ఉద్యమకారులు ఇతర సామాజిక సంస్థలు, ఉద్యమకారులకు ట్రాన్స్ ప్రజల సమస్యలను అర్థం చేయించటమే కాకుండా, అనేక ఇతర సమస్యలపై కలిసి పనిచేస్తున్నారు. 2014 తీర్పు, 2019 చట్టం ఇచ్చిన అతి చిన్న వెసులుబాట్లతోనే ఇంత ప్రగతిని సాధించిన ట్రాన్స్ ప్రజలను 2026లో చేసిన దుర్మార్గమైన సవరణలతో మళ్ళా వెనక్కి నెట్టటం న్యాయమేనా?!
ఎ. సునీత
ఈ వార్తలు కూడా చదవండి..
పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి.. ఇంజనీర్లను సన్మానించిన మంత్రి
పార్లమెంట్‌లో అమరావతి బిల్లు ఆమోదం.. చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్
For More AP News And Telugu News