Share News

పెద్ద నేతల సరెండరే దెబ్బతీసింది!

ABN , Publish Date - May 12 , 2026 | 12:35 AM

మావోయిస్టుల ఉద్యమం చాలాకాలంగా పెద్ద సమస్యగా మారి కొన్ని రాష్ట్రాలకూ, కేంద్రానికీ శాంతిభద్రతల పరిరక్షణలో తలనొప్పులు తెచ్చి పెట్టింది. ఈ ఏడాది మొదట్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, నక్సల్‌ ఉద్యమం...

పెద్ద నేతల సరెండరే దెబ్బతీసింది!

మావోయిస్టుల ఉద్యమం చాలాకాలంగా పెద్ద సమస్యగా మారి కొన్ని రాష్ట్రాలకూ, కేంద్రానికీ శాంతిభద్రతల పరిరక్షణలో తలనొప్పులు తెచ్చి పెట్టింది. ఈ ఏడాది మొదట్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, నక్సల్‌ ఉద్యమం చివరి దశలో వుంది అని, తర్వాత మార్చి నెలలో దేశం నక్సల్‌ సమస్య నుంచి విముక్తి పొందిందని చెప్పటం భారీ ఊరటను కలిగించింది!

కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఒక చిన్న సంఘటన అనుకోని మలుపుతిప్పింది! లాపా కిషన్‌, రాటియా కిషన్‌, సంగు కిషన్‌ అనే ముగ్గురు రైతుకూలీలు కొంతమంది సహకారంతో ‘జోతేదార్‌’కు ఏమీ ఇవ్వకుండా 300 ధాన్యం బస్తాలను ఆయుధాలతో, ఎర్ర జెండాలతో అందరూ చూస్తుండగానే తీసుకొనిపోవటం నక్సల్‌బరీ ఉద్యమానికి దారితీసింది. ఉద్యమ నాయకుడు కానూ సన్యాల్‌ ‘అది భూమి కోసం కాదు రాజ్యాధికారం కోసం చేసిన ఆయుధ పోరాటం’ అనటంతో ఉద్యమానికి ఒక మార్గం, ధ్యేయం ఏర్పడ్డాయి! నక్సల్‌బరీ భౌగోళికంగా చాలా కీలక ప్రాంతంలో ఉంది. అటు నేపాల్‌, ఇటు బంగ్లాదేశ్‌, భారతదేశం... మూడు కూడళ్ళ మధ్య ఉండటం చేత ఉద్యమానికి ఆయువుపట్టు దొరికింది! చైనా కూడా ఈ ప్రాంతానికి ఎక్కువ దూరంలో లేకపోవటం చేత విప్లవోద్యమానికి రాజకీయాలతో ముడిపెడుతూ నిర్మించటానికి నక్సల్‌బరీ అనువుగా మారింది!

1946–1951 దాకా తెలంగాణలో జరిగిన కమ్యూనిస్టు ఉద్యమం విస్తృతంగా, బలంగా... భూమి కోసం, భుక్తి కోసం జరిగినా నక్సల్‌బరీ ఉద్యమం దేశం అంతటా విపరీతమైన ప్రాచుర్యాన్ని పొందటమే కాకుండా కమ్యూనిస్టు ఉద్యమాలపై అమిత ప్రభావాన్ని చూపింది! తెలంగాణలో కమ్యూనిస్టు ఉద్యమం సుమారు 3,000 గ్రామాల్లో ఆధిపత్యాన్ని సాధించింది! మరిన్ని గ్రామాల్లో కొద్దో గొప్పో ప్రభావాన్ని చూపింది! 4,000 మంది ఆ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారని ఒక అంచనా!

తెలంగాణ సాయుధ పోరాటంతో పోలిస్తే నక్సల్‌బరీ పోరాటం చిన్నదే! ఆ ప్రాంతంలో తిరుగుబాటు కేవలం 52 రోజులు మాత్రమే జరిగింది! అయినా దేశం మొత్తం మీద చూపిన ప్రభావం అంచనాకు మించిపోయింది! అయితే నక్సల్‌బరీ ఉద్యమానికి ముందే శ్రీకాకుళం ఉద్యమం మొదలైంది! అయినా నక్సల్‌ ఉద్యమానికి వచ్చిన ఊపు కానీ, ప్రాముఖ్యత కానీ శ్రీకాకుళం గిరిజన తిరుగుబాటు ఉద్యమం సాధించలేకపోయింది! ఉద్యమ నేపథ్యం లేకపోయినా, కమ్యూనిస్టుల ప్రభావం పెద్దగా లేకపోయినా, శ్రీకాకుళం జిల్లాలో ఉద్యమం బలపడటానికి వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, పంచాది కృష్ణమూర్తి, తేజేశ్వరావు, సుబ్బారావు పాణిగ్రాహి లాంటి నాయకులు కారణభూతులయ్యారు. గిరిజనుల్లో పెరిగిన అసంతృప్తి, పర్వతశ్రేణులతో అనువుగా వున్న ప్రాంతం, భూస్వాముల దుష్కృత్యాలు ఉద్యమానికి వేదికగా మారాయి! వెంపటాపు సత్యం గిరిజనులను కూడగట్టిన తీరు నక్సలిజానికి ప్రాణం పోసింది! ఉద్యమం ఆ తర్వాత కాలంలో బలహీనపడింది కానీ అంతం కాలేదు. ప్రభుత్వాలకు ప్రతిసారీ సవాలు విసురుతుండటమే మావోయిస్టుల సమస్య ప్రత్యేకత! కేంద్ర హోంమంత్రి మావోయిస్టుల ప్రకటనతో ప్రస్తుతం ఉద్యమం చివరి దశలో వుందేమో అన్న అనుమానం నక్సల్స్‌ను అభిమానించే వారికి కూడా కలిగింది!


నిజానికి లెఫ్ట్‌వింగ్‌ ప్రభావం వున్న జిల్లాలు దేశంలో 2014కి 126 వుంటే, అవి 2026కి కేవలం ఏడు జిల్లాలకే పరిమితమయ్యాయి. మావోయిస్టుల హింసాకాండ 2025 నాటికి 88శాతం పడిపోయింది. మరణాలు 2025లో కేవలం 100 మాత్రమే సంభవించాయి! ఈ ప్రభుత్వ విజయాలకు కారణాలు, వ్యూహం పటిష్ఠంగా ఉండటం, క్షేత్ర స్థాయిలో అణిచివేత చేపట్టటం, కోబ్రా, గ్రేహౌండ్స్‌, ఇతర ఆయుధాలతో కూడిన స్పెషల్‌ ఫోర్సెస్‌, మావోయిస్టుల ఎత్తుగడలను ధ్వంసం చేయగలిగాయి. మావోల ఆర్థిక కేంద్రాలను పసిగట్టి పెద్ద ఎత్తున కేంద్రంతో బాటు ఎన్‌ఐఏ వాటిని వశపర్చుకోవటంతో మావోలు మరింత బలహీనపడ్డారు.

బలగాల విషయంలో దేశమంతా ‘యూనిఫైడ్‌ కమాండ్‌ కంట్రోల్‌’ అమలుచేయటం వల్ల ఫలితాలు బాగా వచ్చాయి. స్లీపింగ్‌ సెల్స్‌, గెరిల్లా దళాలను, గుట్టు తెలియకుండా పనిచేసేవారిని, ఇంటలిజెన్స్‌ యంత్రాంగం బట్టబయలు చేయటంతో మావోలు నీరు వదిలిన చేపల్లా మారారు. నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాల సరిహద్దులను బలోపేతం చేయటమే కాకుండా, మావోయిజం వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసే వారికి సేఫ్‌ జోన్‌లు ఏర్పరచటంతో మావోయిస్టు ఉద్యమం కకావికలయింది!

లెక్కకు మించిన మావోయిస్టులు దేశం అంతటా, ముఖ్యంగా ప్రభావిత ప్రాంతాలలో సరెండర్‌ అయ్యారు. పెద్దపెద్ద నాయకులు అడవులు వదిలి బయటకు వచ్చి ‘‘మేము సరెండర్‌ అవుతున్నాం’’ అని చెప్పటం కూడా ఉద్యమ నైతిక స్ఫూర్తిని దెబ్బతీసింది! కేంద్ర ప్రభుత్వం మేము ఉద్యమాన్ని తుడిచేశాం అని చెప్పినప్పుడు వాస్తవ పరిస్థితులు అందుకు అనుగుణంగానే ఉన్నాయి! అందుకే మావోయిస్టుల ఉద్యమం దేశంలో పూర్తిగా అదుపులోకి వచ్చింది!

రావులపాటి సీతారాంరావు

ఈ వార్తలు కూడా చదవండి...

మా ఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో ఆలయాలకు భద్రత కొరవడింది: మంత్రి ఆనం

కైలాసగిరి త్రిశూలం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీక: మంత్రి నారా లోకేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 12 , 2026 | 12:35 AM