ఒకే ఒక్కడు.. ‘మిస్టర్ బీబీసీ’!
ABN , Publish Date - Jan 30 , 2026 | 02:31 AM
మన కళ్లను టీవీ స్క్రీన్‌కు, మన చెవులను మొబైల్ ఫోన్‌కు అప్పగించని కాలంలో వినమ్ర రేడియో ఉండేది. 1960ల బంగారు బాల్యాన్ని దాటి 1970ల్లో కౌమార దశ, తొలి యవ్వనంలో ప్రస్థానించినవారు
మన కళ్లను టీవీ స్క్రీన్‌కు, మన చెవులను మొబైల్ ఫోన్‌కు అప్పగించని కాలంలో వినమ్ర రేడియో ఉండేది. 1960ల బంగారు బాల్యాన్ని దాటి 1970ల్లో కౌమార దశ, తొలి యవ్వనంలో ప్రస్థానించినవారు రేడియో అనే గవాక్షం ద్వారా విశాల ప్రపంచాన్ని వీక్షించేవారు, వినేవారు. నా జీవన విశ్వానికీ రేడియోనే కేంద్రం. వీనుల విందు చేసే హిందీ సినిమా పాటలను మన రేడియో (ఆకాశవాణి) వివిధ భారతి కార్యక్రమం ప్రతి రోజూ ప్రసారం చేసేది. వాటిని విన్న క్షణాలు నాకు ఇప్పటికీ సుమధుర జ్ఞాపకాలే. ఆదివారం మధ్యాహ్నం అమీన్ సయానీ అద్భుతంగా నిర్వహించే బోర్నవిటా క్విజ్ కార్యక్రమాన్ని వింటూ నేను స్వాయత్తం చేసుకున్న ఆనందం ఎనలేనది. 1975లో హాకీ వరల్డ్ కప్‌ను భారత్ గెలుచుకున్నప్పుడు జస్దేవ్ సింగ్ దేశభక్తి ప్రపూరిత భావోద్విగ్న వ్యాఖ్యానాన్ని నేను నా గుండెలో నింపుకున్నాను, నిలుపుకున్నాను. ఆ రోజుల్లోనే తాజా క్రికెట్ స్కోర్ తెలుసుకునేందుకు క్లాస్‌రూమ్‌లోనే నా పాకెట్ ట్రాన్సిస్టర్‌ను వింటూ ఉండేవాణ్ణి!
బీబీసీ రేడియో ప్రసారాలు వినడమూ ఆ రోజుల్లోనే నాకు అలవాటయింది. పోలీసు అధికారి అయిన మా తాతయ్య ప్రతి ఉదయమూ యోగాసనాలూ, ధ్యానం అనంతరం బీబీసీ న్యూస్ బులెటిన్ తప్పక వినేవారు. ‘వార్తలు వినదలుచుకున్నప్పుడు బీబీసీనే విను’ అని ఆయన నాకు చెబుతుండేవారు. ఆయన సూచన మేరకు బీబీసీ న్యూస్ వినడం నాకు ఒక వ్యసనమయింది. నాకేనా? నాలాంటి ఎంతో మందికి కూడా. ఇలా ఎందరినో బీబీసీకి అభిమానులుగా మార్చిన ఆ ఘనతను సాధించిపెట్టిన ఒకే ఒక్కడు మార్క్ టలీ (తదనంతర కాలంలో సర్ మార్క్ టలీ).
1984లో ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారన్న వార్తను అందరికంటే ముందుగా ప్రపంచానికి బీబీసీ తెలియజేసినప్పుడు నేను హెయిర్ సెలూన్‌లో ఉన్నాను. ఆకాశవాణి విషాద సంగీతాన్ని వినిపిస్తోంది. అయితే ఆ భయానక ఘటన గురించి టలీ అనర్గళమైన స్వరంతో వార్తా నివేదన చేసిన తరువాతే ఆ దుర్వార్తను ధ్రువీకరించుకున్నాను. 1992లో బాబ్రీ మసీదును కూల్చివేసినప్పుడు నేను ముంబైలో విలేఖరిగా ఉన్నాను. సంఘటన ప్రదేశం నుంచి విశ్వసనీయమైన వార్తా కథనాన్ని వినేందుకు అప్పుడూ నేను విన్నది బీబీసీనే. అయోధ్యలో కరసేవకులు టలీని వెన్నాడి, చంపేస్తామని బెదిరించారు. అయినా సంభవించిన ఘటన క్రమాన్ని ఆయన సంయమనంతో తేటతెల్లంగా విశదం చేశారు. మార్క్ టలీది విశ్వసనీయమైన వాణి. ఆయన స్వరంలో నిష్పాక్షికత భావోద్వేగ ప్రామాణికతతో మిళితమవుతుంది. సువిశాల భారతదేశంలో విస్తృతంగా పర్యటించి, అన్ని మతాల వారు, భాషల వారితో మనసు విప్పి మాట్లాడడం ద్వారా ఆయన తన వాణికి ఒక విశిష్టతను సముపార్జించుకున్నారు. ఆయన వార్తలు, వ్యాఖ్యానాలు శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవి. వాటిని వారెవ్వరూ మరచిపోలేరు. దశాబ్దాల పాటు బీబీసీ ఇండియా బ్యూరో చీఫ్‌గా పనిచేసిన టలీ, ఆ సంస్థను సమస్త భారతీయులకు సుపరిచితమైన, విశ్వసనీయమైన న్యూస్ బ్రాండ్‌గా మార్చివేశారు. 1990ల్లో నా కెమెరామ్యాన్‌తో కలిసి ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్నాను. లక్నో సమీపంలోని ఒక గ్రామానికి వెళ్లినప్పుడు మామిడి తోటల ఆసామి ఒకరు మమ్ములను తన గృహానికి ఆహ్వానించారు. అంతకు ముందు కొన్ని సంవత్సరాల క్రితం మార్క్ టలీతో తాను దిగిన ఫొటో నొకదాన్ని మాకు చూపారు. ‘టలీని కలవడం, ఆయనతో సంభాషించడం తనకొక చిరస్మరణీయమైన, భావోద్వేగ అనుభవం’ అని ఆ మామిడి రైతు నాకు చెప్పారు. పాత్రికేయ వృత్తి నిర్వహణలో మీరు ఒక ముద్రవేయడానికి మీ గొంతు పెంచాల్సిన అవసరంలేని కాలంలో టలీ సెలెబ్రిటీగా వెలుగొందారు. పువ్వులను పుట్టించేది వర్షమే కానీ, ఉరుములు కాదు కదా. ప్రభావాన్ని నెరపేందుకు ప్రశాంతంగా, సంయమనంతో, ఆలోచనాత్మకంగా మాట్లాడితే సరిపోయిన రోజలవి.
నాకూ ఈ గొప్ప పాత్రికేయుడుతో చిరస్మరణీయమైన, భావోద్వేగ అనుభవం ఉన్నది. 1994లో నేను ముంబై నుంచి ఢిల్లీకి మారాను. దేశ రాజధాని అధికార నడవాలు నాకు అపరిచిత ప్రదేశాలు. రాజకీయవేత్తలను కలుసుకోవాలనే ఆరాటం నాకు లేదు. మార్క్ టలీని కలవడానికే ప్రాధాన్యమిచ్చాను. నేను ఆయనకు ఫోన్ చేసినప్పుడు వెంటనే రమ్మని చెప్పారు. యువ పాత్రికేయులను కలవడం తనకెంతో సంతోషం కలిగించే విషయమని ఆయన అన్నారు. పటాటోపంతో వ్యవహరించే ఎడిటర్లు తమ విలేఖర్లను కలిసేందుకు తమ గదుల నుంచి బయటకు రారు కదా. మరి ఇరవైల ప్రాయంలో ఉన్న నన్ను టలీ సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో మరచిపోలేని పిచ్చాపాటీ చేశాను. పాత్రికేయంలో తన అనుభవాలను ఆయన ఆసక్తికరంగా వివరించారు. అంత గొప్ప జర్నలిస్టు వృత్తి జీవితం మొదటి దశలో ఉన్న యువ పాత్రికేయుడుతో అంత కలుపుగోలుగా మాట్లాడడం అపురూప విషయమే. తమకు అవసరమైన సమాచారం కోసం మాత్రమే భారతీయ పాత్రికేయులను కలుసుకునే ‘ఫిరంగ్’ తరహా జర్నలిస్టు కాదు టలీ. ఆయన తనను తాను భారతీయ పాత్రికేయ జగత్తులో అంతర్భాగంగా భావించుకునేవారు. ఈ కారణంగానే భారతదేశాన్ని తన సొంత దేశంగా మార్క్ టలీ భావించారు, గౌరవించారు. భారత్ అన్నా, భారతీయులు అన్నా ఆయనకు అవ్యాజమైన ప్రేమాభిమానాలు. అవి ఎటువంటి అభిజాత్యం లేనివి.
భారత్‌ను ఒక ప్రగాఢ ఆధ్యాత్మిక ప్రదేశంగా మార్క్ టలీ భావించారు. దేవునికి అనేక మార్గాలు ఉన్నాయనే సత్యాన్ని భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల నుంచే తాను నేర్చుకున్నానని ఆయన చెప్పేవారు. ‘రక్తంలోను, రంగులోను భారతీయులు; అభిరుచులు, ఆలోచనలు, అభిప్రాయాలు, మేధలో ఆంగ్లేయులు అయిన వ్యక్తులను సృష్టించే లక్ష్యంతో భారత్‌లో ఆంగ్ల మాధ్యమంలో నూతన విద్యా విధానాన్ని అమలుపరచాలని లార్డ్ మెకాలే 1835లో ప్రతిపాదించారు. మెకాలేను తలకిందులు చేసిన ఘటికుడు మార్క్ టలీ. ఆయన రక్తంలోను, రంగులోను ఆంగ్లేయుడు. అయితే చింతనా ధోరణిలో మాత్రం పరిపూర్ణ భారతీయుడు. ఇదే ఆయన్ని విశిష్టంగా నిలిపింది. విలక్షణ వ్యక్తిగా, విఖ్యాత విలేఖరిగా వెలుగొందేలా చేసింది.
టెలివిజన్ మాధ్యమం పట్ల మార్క్ టలీ పెద్దగా ఆకర్షితుడు కాకపోవడంపై ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. భారతీయ రైల్వే ప్రయాణాలపై సుప్రసిద్ధమైన డాక్యుమెంటరీ ఫిల్మ్ నొకదాన్ని ఆయన రూపొందించారు. మరికొన్ని డాక్యుమెంటరీలనూ రూపొందించినప్పటికీ ఆయన మొదటి ప్రేమ రేడియోనే. నేను ఎన్డీ టీవీలో ఉన్నప్పుడు ‘బిగ్ ఫైట్’ కార్యక్రమంలో చర్చకు ఆయన్ను ఆహ్వానించాను. ఎంతో నచ్చచెప్పిన తరువాత మాత్రమే ఆయన వచ్చారు. ఆ టీవీ అనుభవం ఆయనకు ఏమంత ఆనందకరంగా లేదని అనిపించింది. నైతిక విలువలు, వృత్తి నిబద్ధత వర్ధిల్లిన కాలంలో ప్రభవించిన పాత్రికేయుడు మార్క్ టలీ. శబ్దం కంటే వార్తలకు, సంచలనం కంటే భావాలకు, గందరగోళం కంటే విశ్వసనీయతకు ప్రాధాన్యమిచ్చిన పాత్రికేయుల తరానికి చెందినవాడు. ప్రస్తుత పాత్రికేయ ధోరణులను ఆయన ఆమోదించలేరు, అనుసరించలేరు. శాస్త్రీయ సంగీతవేత్త ఒకరు ఎవరైనా ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ బ్యాండ్‌లో పాల్గొనగలుగుతాడా? టెస్ట్ బ్యాట్స్‌మెన్ టెన్ ఓవర్స్ క్రికెట్ మ్యాచ్ ఆడగలుగుతారా? ఈ కారణంగానే టలీ తన జీవిత తుది దశను పూర్తిగా గ్రంథరచనతో గడిపారు.
రాజకీయ భారతదేశ కోలాహలానికి అతీతంగా తన వృత్తి విధులను నిష్పాక్షికంగా, నిశిత అవగాహనతో, సమగ్రంగా నిర్వర్తించగల స్థిర ప్రజ్ఞత టలీలో నిండుగా కనిపించే గుణ విశేషం. అత్యవసర పరిస్థితి కాలంలో ఆయనను భారత్ నుంచి బహిష్కరించారు. అయితే ఇందిరాగాంధీ జీవితాన్ని రాజకీయాలను సన్నిహితంగా, వ్యక్తిగతంగా, అదే సమయంలో నిష్పాక్షికంగా విశ్లేషించడంలో టలీకి ఆ ‘చీకటి రోజులు’ బాధాకర అనుభవం అడ్డు రాలేదు. అయోధ్య ఉద్యమకాలంలో హిందూత్వ శక్తులు ఆయనను వేధించాయి, దాడి చేశాయి. అయినా లాల్‌కృష్ణ ఆడ్వాణీతో నిష్కపటంగా మాటామంతీ జరిపేందుకు టలీని అవేమీ నిరోధించలేదు. ‘పాత్రికేయం అక్షరాలా చరిత్ర మొదటి చిత్తుప్రతి’ అని మార్క్ టలీ విశ్వసించారు. దైనందిన జీవితంలో సామాన్యుల సమస్యలు తెలుసుకోవడానికి, నడుస్తున్న చరిత్రపై ప్రజల మనోభావాలు వినడానికే ఆయనలోని విలేఖరి ప్రవృత్తులు అన్నిటికంటే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చాయి. తన కళ్లముందు సంభవిస్తోన్న ఘటనలపై ఎటువంటి పక్షపాతం లేకుండా వార్తలు నివేదించేందుకే టలీ నిబద్ధమై ఉన్నారు. అధికార ప్రాభవాలు ఉన్నవారి మెచ్చుకోలుకుగానీ గానీ ధన లబ్ధికిగానీ ఆయన ఎన్నడూ ఆరాటపడలేదు, ప్రాకులాడలేదు.
గోదీ మీడియా ప్రాభవ ప్రాబల్యాల పట్ల టలీ ప్రతిస్పందన ఏమిటి? పాలకపక్షం, ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకున్న పాత్రికేయుల గురించి ఆయన ఏమనుకుంటున్నారు? నేను ఎప్పుడూ ఆయన్ను ఈ అంశాలపై ప్రశ్నించలేదు. అయితే ఇండియా ఇంటర్నేషనల్‌లో టలీతో నేను చివరిసారి జరిపిన సంభాషణల్లో ఒకటి నాకు బాగా గుర్తు ఉన్నది. ‘నేటి భారతదేశంలో ఒక జర్నలిస్టుగా ఉండడం అంత తేలికైన విషయం కాదనుకుంటాను’ అని ఆయన చిరునవ్వుతో వ్యాఖ్యానించారు. భారత్‌లోని బీబీసీ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరిపిన రోజులవి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శనాత్మక డాక్యుమెంటరీ నొకదాన్ని ప్రసారం చేసినందుకే బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. టలీ వ్యాఖ్య విని నేను మందహాసం చేస్తూ మెల్లగా తల ఊపాను. భారతీయ జీవితం నిరంతరాయ ప్రవాహిని అన్న భావాన్ని ప్రస్ఫుట పరుస్తూ రాసిన తన సుప్రసిద్ధ గ్రంథానికి ఆయన ‘There are no full Stops in india’ అన్న సముచిత శీర్షిక పెట్టారు. వీడ్కోలు సర్ మార్క్, ఆవలి తీరానికి ప్రశాంతంగా ప్రయాణించండి.
రాజ్‌దీప్ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)
ఇవి కూడా చదవండి..
మందు కొడితే ఇలాగే ఉంటుందేమో.. సముద్రంలో చనిపోయిన తిమింగలంతో..
గేదెను చుట్టుముట్టిన సింహాల గుంపు.. ప్రాణం తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..