Share News

విద్యలో డిజిటల్ అంతరాన్ని తగ్గించాలి

ABN , Publish Date - Aug 13 , 2026 | 01:08 AM

డిజిటల్ ఇండియా కార్యక్రమం 2026 జూలై 1 నాటికి విజయవంతంగా పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) గణనీయంగా విస్తరించింది. గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్...

విద్యలో డిజిటల్ అంతరాన్ని తగ్గించాలి

డిజిటల్ ఇండియా కార్యక్రమం 2026 జూలై 1 నాటికి విజయవంతంగా పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) గణనీయంగా విస్తరించింది. గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తరణ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఈ–పాలన, దేశీయ ఎలక్ట్రానిక్ తయారీ వంటి రంగాల్లో విశేష పురోగతి సాధించింది. ఈ విజయాలు ప్రశంసనీయమైనవే. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలోనూ, కోట్లాది మంది పౌరులను డిజిటల్ వ్యవస్థలో భాగస్వాములను చేయడంలోనూ ఇవి కీలక పాత్ర పోషించాయి.

తెలుగు రాష్ట్రాలు కూడా డీపీఐని వినియోగించుకోవడంలో గణనీయమైన పురోగతిని సాధించాయి. డిజిటల్ పాలన, ఆర్థిక సమ్మిళితత, ఇంటర్నెట్ అనుసంధానాన్ని విస్తరించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముందడుగు వేశాయి. అయినా, నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లోనూ డిజిటల్ వ్యవస్థ ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉంది. తెలంగాణలో డిజిటల్ అభివృద్ధి ఎక్కువగా నగరాలకే పరిమితమవగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్నెట్ వినియోగం పెరిగినా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విద్యా ఫలితాల్లో అసమానతలు కొనసాగుతున్నాయి. ఇంకా అనేక ప్రభుత్వ పాఠశాలల్లో తగిన కంప్యూటర్ ల్యాబ్‌లు, విశ్వసనీయమైన ఇంటర్నెట్ సౌకర్యం, ఆధునిక డిజిటల్ అభ్యాస వనరులు అందుబాటులో లేవు. ఈ పరిస్థితిని వెంటనే సరిదిద్దకపోతే గ్రామీణ విద్యార్థులు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల్లో మరింత వెనుకబడే ప్రమాదం ఉంది.

అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ వినియోగించి విద్యార్థులకు డిజిటల్ సౌకర్యాలు కల్పించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. ప్రజా గ్రంథాలయాలు, డిజిటల్ అభ్యాస కేంద్రాలు, కమ్యూనిటీ కంప్యూటర్ కేంద్రాలు విస్తృత స్థాయిలో ఏర్పాటు చేస్తే మరింత మంది విద్యార్థులకు సాంకేతికత అందుబాటులోకి వస్తుంది. ప్రైవేటు సంస్థలు, విశ్వవిద్యాలయాలు, సేవా సంస్థల భాగస్వామ్యంతో వెనుకబడిన ప్రాంతాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయవచ్చు. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థలకు అధిక వేగం గల ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలి. అలాగే డిజిటల్ తరగతి గదులు, స్మార్ట్ బోర్డులు, ఆన్‌లైన్ అభ్యాస వేదికలను ప్రోత్సహించాలి. ఈ పరికరాలు ఏడాది పొడవునా వినియోగంలో ఉండేలా వాటి నిర్వహణకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి.


విద్యా సంస్థలు ప్రాంతీయ భాషల్లో డిజిటల్ పాఠాలు, వీడియోలు, వర్చువల్ ల్యాబ్‌లు, పరస్పర క్రియాశీల అభ్యాస మాడ్యూళ్లను అభివృద్ధి చేయాలి. స్థానిక అవసరాలకు అనుగుణమైన డిజిటల్ విద్యా కంటెంట్ లేకపోవడం కూడా సాంకేతికతను బోధన–అభ్యాసన ప్రక్రియలో సమర్థవంతంగా వినియోగించడంలో ప్రధాన అవరోధంగా ఉంది. ప్రస్తుతం చాలా తక్కువ మంది ఉపాధ్యాయులే డిజిటల్ సాంకేతికతను అర్థవంతంగా తరగతి గదుల్లో వినియోగిస్తున్నారు. వీరిలో కూడా చాలామంది తగిన శిక్షణ, అనుభవం లేకపోవడం వల్ల దానిని బోధనలో సమర్థవంతంగా అనుసంధానించలేకపోతున్నారు. అందువల్ల ఉపాధ్యాయులకు నిరంతర వృత్తిపరమైన డిజిటల్ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి, నైపుణ్యాలను అందించాలి. డిజిటల్ అంతరాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, ప్రైవేటు రంగం, పౌర సమాజం సమష్టిగా, దీర్ఘకాలిక దృష్టితో కృషి చేయాలి.

m యార్లగడ్డ శ్రీధర్‌రావు

ఇవి కూడా చదవండి...

రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్

చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 01:08 AM