Share News

సాహిత్య సభల కాలం!

ABN , Publish Date - Feb 23 , 2026 | 05:58 AM

ఇటీవల వివిధ సాహితీ మహాసభలు జరిగిన, జరుగుతున్న సందర్భాలతో తెలుగు సాహిత్యం పులకరిస్తోంది. ‘సమూహ’ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ నిర్వహించిన యువజన సాహిత్యోత్సవం; వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వారు మహిళల ఆత్మకథలు, జీవిత చరిత్రలపై...

సాహిత్య సభల కాలం!

సాహిత్య వేదిక

బొమ్మలు: అక్బర్

ఇటీవల వివిధ సాహితీ మహాసభలు జరిగిన, జరుగుతున్న సందర్భాలతో తెలుగు సాహిత్యం పులకరిస్తోంది. ‘సమూహ’ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ నిర్వహించిన యువజన సాహిత్యోత్సవం; వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వారు మహిళల ఆత్మకథలు, జీవిత చరిత్రలపై నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు; ఉస్మానియా యూనివర్సిటీ పెట్టిన తెలుగు సాహితీ మహాసభలు; పదిహేడేళ్ళ ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నిర్వహించిన ద్రావిడ సమాజ సాహిత్యాలపై రెండు రోజుల సదస్సు; హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్; ఛాయ లిటరరీ ఫెస్ట్; బహుజన రైటర్స్ ఫోరం పెట్టిన కొత్త తరం కవుల మిలన్; పదిహేనేళ్ల కవి సంగమం; ఎండ్లూరి సుధాకర్ సాహిత్యంపై సమాలోచన; నందిని సిధారెడ్డి సాహిత్యంపై అంతర్జాల సదస్సు; తెలంగాణ సాహితీ వారు చేసిన దశాబ్ది సాహిత్యోత్సవాలు; తెలంగాణ సాహిత్య అకాడెమీ, నిజాం కళాశాల నిర్వహించిన అంతర్జాతీయ భాషా దినోత్సవం... ఇలా తెలుగు సాహిత్యంలో ఎన్నో అంశాలపై మహాసభలు విరివిగా జరుగుతున్నాయి.

పాత తరం నుంచి కొత్త తరం రచయితలందరూ ఎన్నో చర్చించాల్సిన విషయాలన్నీ ఎటువంటి భేషజాలు లేకుండా ప్రశ్నించడం, నచ్చనివి నచ్చనట్టు అభిప్రాయాలు వ్యక్తపరచడం ఎంతో అవసరం కూడా. ఉస్మానియా వారు ఆహ్వానించిన తెలుగు లిటెరరీ కాంగ్రెస్‌ సభలో ‘సాహిత్య పురస్కారాలు–యువత ఆలోచనలు’పై మాట్లాడమన్నప్పుడు నాకు తెలిసినంత వరకు ఉన్న నిజాలని, యువత ఉద్దేశాలని, రచయితగా ప్రయాణం ఆపకపోవడం కంటే పెద్ద పురస్కారాలు ఉండవని, పాఠకుల విమర్శలకంటే పెద్ద అవార్డులు ఉండవని నా అభిప్రాయం చెప్పాను. మా పానెల్‌లో ఉన్న మాతంగి మనోజ్, పరిశోధక విద్యార్థి కూడా కాస్త కఠినంగానే కొత్త తరం రాస్తున్న పుస్తకాలపై వ్యాఖ్యానించాడు. ఒకప్పుడు ఈ వాతావరణం ఇంత బహిర్గతంగా ఉండేదా లేక మర్యాదల ముసుగులో వేదికలు ప్రశంసించుకోడానికే పనికొచ్చేవా అన్న పరిశీలన కూడా జరుగుతోంది.

బెంగుళూరులో ప్రతి ఏటా జరిగే బుక్ బ్రహ్మ ద్రావిడ భాషల సాహితీ ఉత్సవంలో ఇప్పటికే పలు తెలుగు రచయితలు, పాత్రికేయులు పాల్గొంటూ ఉన్నారు. 2024లో రచయిత్రులు జూపాక సుభద్ర, చల్లపల్లి స్వరూప రాణి, వినోదిని, నేను ‘స్త్రీవాదం నుండి దళిత స్త్రీవాదం వైపు’ అంశంపై మాట్లాడాం.

ఈ నేపథ్యంలోనే బెంగుళూరులోని అలయన్స్ యూనివర్సిటీ వాళ్ళు 2022 నుంచి సాహిత్య సామాజిక అంశాలపై నిర్వహిస్తున్న ఉత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చరిత్ర నుంచి నేటి మీడియా వరకు అనేక అంశాలపై ఈ విశ్వవిద్యాలయం ప్రతి ఏటా ఒక జాతీయ వేదిక అవుతుంది. గత ఉత్సవాల్లో శశి థరూర్, రాజ్‌దీప్‌ సర్దేశాయ్, దేవ్‌దత్‌ పట్నాయక్, జావేద్ అక్తర్, ఉషా ఉతుప్, శ్రద్ధా జైన్, గీతాంజలి శ్రీ, అనిల్ కుంబ్లే, విక్రమ్ సంపత్ వంటి ప్రముఖ స్వరాలు ఉన్నాయి. కొనసాగింపులో సాహిత్యం, కళ, సంస్కృతి, ఆలోచనల కేంద్రంగా అలయన్స్ విశ్వవిద్యాలయం తన పాత్రను బలోపేతం చేస్తూ విద్యార్థులకు వివిధ విభాగాలలోని విశిష్ట ఆలోచనాపరులతో ప్రత్యక్ష కలయికను అందించడం అభినందనీయం.


ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగిన మూడు రోజుల మహాసభలలో నటి విద్యాబాలన్; నటి, నర్తకి శోభనలతో పాటు దేశవ్యాప్తంగా రచయితలు ‘అలయన్స్ లిటరరీ ఫెస్టివల్ 2026’కు తరలి వచ్చారు. ‘ఆమె కథ: నారీ శక్తి’ అనే ఈ ఏడాది అంశంపై ఎన్నో దృక్కోణాలతో ఆ విశాలమైన క్యాంపస్ మేధో మధనంతో హోరెత్తింది. మేధో, సాంస్కృతిక, సాహితీ, శాస్త్రీయ, రాజకీయ, సృజనాత్మక కథనాలలో మహిళలను గుర్తించడం, చర్చించడం అనే ఇతివృత్తంతో ఈ మూడు రోజుల సభలు నడిచాయి. ఈ వేదిక సాహిత్యం, తత్వశాస్త్రం, పాలన, ప్రజావిధానం, మీడియా, వ్యవస్థాపక, క్రియాశీలత, కళ, నాయకత్వం, సామాజిక పరివర్తన శిల్పులుగా మహిళలను చూపింది.

రెండవ రోజు నేను; తమిళ దళిత రచయిత్రి, ఉక్కు స్వరం సుకీర్త రాణి, ప్రముఖ కన్నడ రచయిత వివేక్ షాన్ బాగ్ ఒక ప్యానెల్‌లో ఉన్నాం. కేరళకు చెందిన ఆంగ్ల సాహిత్య పరిశోధకురాలు, అలయన్స్ యూనివర్సిటీ ఉపాధ్యాయురాలు భివితఏసో మా సెషన్‌కు అధ్యక్షత వహించింది. రచనలో, అనువాదాలలో రచయితలు వెతుక్కునే గుర్తింపు, తమవైన జ్ఞాపకాలు, సమకాలీనతలపై మాట్లాడాం. రాసే క్రమంలో జెండర్, కులం, ప్రాంతం పోషించే పాత్రల గురించి స్వీయనుభవాలతో వివరించారు సుకీర్త. తన చిన్నతనంలో టీచర్స్ కుల వివక్షతో ఆమెను పెట్టిన మానసిక హింసను గురించి చెప్పారు. అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చినా క్లాస్‌లో చివరి బెంచ్‌పై కూర్చోపెట్టడం, కులకారణ ద్వేషాన్ని చూపడం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. చదువును కొనసాగిస్తూ ఇప్పుడు అదే స్కూల్‌లో టీచర్‌గా ఆమె పాఠాలు చెప్తున్నారు. తమిళ దళిత సాహిత్యంలో ఉన్న పురుషస్వామికమైన భాష గురించి ఎన్నో విషయాలు చెప్పారు సుకీర్త.

నేరుగా రాసే భారతీయ ఆంగ్ల సాహిత్యం ఏదీ భారతీయ సాహిత్యం కాదనే వివేక్ షాన్ బాగ్ ఇప్పుడు బెంగుళూరులో ‘hyphen’ అనే అనువాద సాహిత్య సంస్థను స్థాపించి భారతీయ సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువాదాలుగా తీసుకొస్తూ సాహితీ సేవ చేస్తున్నారు. ‘హైఫన్’ అనే పదం కవి, అనువాదకుడు, మేధావి ఎ.కె. రామానుజన్ నుండి ప్రేరణ పొందింది. రామానుజన్ ఒకప్పుడు తనను తాను ఇండో–అమెరికన్‌లో ‘హైఫన్’గా అభివర్ణించుకున్నాడు. దాన్నే తన సంస్థకి పేరు పెట్టాడు వివేక్. సాహిత్యం అంటే భాష. రచయితలకి ఉండే ఏకైక ఆస్తి, ఆయుధం భాషే అంటారు వివేక్. అలాంటిది ఇక్కడి ప్రాంతీయ భాషల సాహిత్యం నేరుగా ఆంగ్లంలో రాయడాన్ని తాను అంగీకరించనని అంటారు.


శరణ్ కుమార్ లింబాలే మరాఠీలో రాసిన నవలల్లో రెండింటిని నేను అనువాదం చేశాను. ఒకటి ‘ఊరికి దక్షిణాన’ పేరుతో అన్వీక్షికి పబ్లిషర్స్‌ 2021లో ప్రచురించారు. రెండవది త్వరలో ఛాయా పబ్లిషర్స్‌ ద్వారా రానున్నది. దయా పవార్ మరాఠీలో రాసిన ‘బలూత’ దేశంలో వచ్చిన మొట్టమొదటి దళిత ఆత్మకథల్లో ఒకటి. అది కూడా త్వరలో అనువాదం పూర్తి చేయనున్నాను. ఈ సెషన్‌లో దళిత స్త్రీలు రాసిన ఆత్మకథల గురించి, వారు జీవితాన్ని, వివక్షని చూసిన తీరు గురించి నేను మాట్లాడాను. దళిత పురుషులు వారి జీవితాల్లో చూసిన ఎటువంటి విషయాన్నైనా సంకోచం లేకుండా రాయడాన్ని గమనించాను. ప్రతి భాషలోని దళిత రచయిత్రులు తమ రచనల్లో పక్క దోవ లేకుండా వివక్షకి, అవమానానికి, ఆత్మగౌరవ పోరాటానికి, తెగింపుకి, సమానత్వానికి పెద్ద పీట వేయడం చూస్తాం.

భాషలోని పురుషస్వామ్యాన్ని గురించి అడిగిన ఒక విద్యార్థిని ప్రశ్నకు చిన్న ఉదాహరణతో సమాధానం చెప్పాను. రచయితలు సైతం అలవోకగా ‘పాఠకుడు’ అని పాఠకలోకాన్ని సంబోధిస్తారు. ఈ సంబోధనకు స్త్రీలు, queer వారు వెంటనే disconnect అవుతారు. పాఠకులు అనే బహువచనం అందరినీ ఆహ్వానిస్తుందని నా అభిప్రాయం చెప్పాను.

అలయన్స్ లిటరరీ ఫెస్టివల్‌లో తెలుగు వారిగా నేనూ, యువ రచయిత్రి దివ్య కందుకూరి ఉన్నట్టు తెలిసింది. ఐశ్వర్య మొహంతి, ఐశ్వర్య సుస్మిత, జహ్నవి ఫాల్కే, ఎలిజబెత్ థామస్ వంటి అనేకమంది జర్నలిస్టులు, రచయితలు, చరిత్రకారులు, సినీనటుల వంటివారు మూడు రోజులు వక్తలుగా వచ్చారు. దక్షిణ భారతీయ ప్రాంతాల్లో ఇటువంటి సాహిత్య మహా సభలు జరగడం ద్రావిడ ఉనికిని, అస్తిత్వాన్ని దృఢంగా నిలబెడతాయన్న ఆశను ఇస్తున్నాయి.

మానస ఎండ్లూరి

manasaugc@gmail.com

ఈ వార్తలు కూడా చదవండి..

తపాలాశాఖ సేవలను మరువలేం: సీఎం చంద్రబాబు

శ్రీవారి లడ్డూలో నెయ్యికి బదులు రసాయనాలు కలిపారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 23 , 2026 | 05:59 AM