నీటి పొదుపు బాధ్యత సామాన్యుడికేనా?
ABN , Publish Date - Nov 11 , 2026 | 12:28 AM
తెలంగాణలో వర్షాలు తగ్గాయి. జలాశయాల్లో నిల్వలు క్షీణిస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం, అధికారులు ప్రజలకు ఒకే సందేశం ఇస్తున్నారు, నీటిని పొదుపు....
తెలంగాణలో వర్షాలు తగ్గాయి. జలాశయాల్లో నిల్వలు క్షీణిస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం, అధికారులు ప్రజలకు ఒకే సందేశం ఇస్తున్నారు, నీటిని పొదుపు చేయండి అని. అది సరైనదే. కానీ ఒక ప్రశ్న అడగాల్సిన సమయం వచ్చింది. నీటిని పొదుపు చేయాల్సింది కేవలం సామాన్యుడేనా? ఈ సంవత్సరం జూన్ నుంచి అక్టోబర్ వరకు తెలంగాణలో సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గింది. జలాశయాల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయితో పోలిస్తే తగ్గాయి. హైదరాబాద్‌కు కీలకమైన సింగూరు జలాశయంలో పూర్తి సామర్థ్యంతో పోలిస్తే నిల్వలు అత్యల్ప స్థాయికి చేరాయి. తాగునీటికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో నీటిని పొదుపు చేయాలని ప్రజలను కోరుతూ, మరోవైపు భారీగా నీటిని వినియోగించే పరిశ్రమలకు ఎలాంటి ప్రమాణాలు లేకుండా అవకాశాలు కల్పిస్తే... అది సమగ్ర నీటి విధానం ఎలా అవుతుంది?
బీరు తయారీలో నీరు ప్రధాన ముడిసరుకు మాత్రమే కాదు... శుభ్రపరిచే ప్రక్రియలు, శీతలీకరణ వంటి అనేక దశల్లో కూడా నీరు అవసరం. నీటి ఎద్దడి ప్రాంతాల్లో ఇటువంటి పరిశ్రమలు ఎంత నీటిని వినియోగిస్తున్నాయి? ఆ నీరు నదుల నుంచి వస్తోందా, భూగర్భ జలాల నుంచి వస్తోందా? వాటి వినియోగ వివరాలు ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండకూడదు? అలాగే హైదరాబాద్‌ను డేటా సెంటర్ల కేంద్రంగా తీర్చిదిద్దడం ఆర్థికంగా అవసరమే. అయితే, కొన్ని సంప్రదాయ శీతలీకరణ పద్ధతులు గణనీయమైన నీటిని వినియోగిస్తాయి. వాటి నీటి అవసరాలపై ముందస్తు లెక్కలు, ప్రజా చర్చ జరగకూడదా?
ఇక్కడ సమస్య పరిశ్రమలపై వ్యతిరేకత కాదు, నీటి వినియోగంలో పారదర్శకత. శుద్ధి చేసిన మురుగు నీటిని పరిశ్రమలు, డేటా సెంటర్లకు సరఫరా చేయడం వంటి ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం సరైన దిశ. నీటి రహిత లేదా తక్కువ నీటి శీతలీకరణ సాంకేతికతలను ప్రోత్సహించడం కూడా అవసరం. కానీ ఇవి కేవలం ప్రణాళికలుగా కాకుండా అనుమతులకు ముందస్తు షరతులుగా మారాలి. నీటి కరువు ప్రకృతి విపత్తు కావచ్చు. కానీ నీటి కొరతను తీవ్రం చేసే విధానపరమైన తప్పిదాలకు మనమే బాధ్యులం. అందుకే ఈ సంక్షోభంలో ఒకే సూత్రం ఉండాలి. పొదుపు సామాన్యుడి బాధ్యత మాత్రమే కాదు, ప్రభుత్వానిదీ పరిశ్రమలదీ కూడా.
కొలను వెంకటేశ్వరరెడ్డి
ఈ వార్తలు కూడా చదవండి..
416 గ్రామాల్లో భూ రీసర్వే పూర్తి.. భూదార్ నంబర్ల కేటాయింపుపై పొంగులేటి కీలక ఆదేశాలు
గూడూరులో దారుణం.. రూ.500 అప్పు తిరిగివ్వలేదని వ్యక్తిపై వేడి నూనె పోసిన మహిళ
Read Latest TG Govt And Telugu News