Share News

ఇకనైనా ఇథనాల్, కోకాకోలా, డేటా సెంటర్లకు నీళ్లు ఆపండి!

ABN , Publish Date - Oct 16 , 2026 | 03:23 AM

రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ వ్యవసాయాన్ని ఎల్‌నినో తీవ్రంగా దెబ్బతీసింది. వర్షాభావం, అడుగంటిపోతున్న భూగర్భ జలాలు, ఖాళీ అవుతున్న రిజర్వాయర్లు రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులను...

ఇకనైనా ఇథనాల్, కోకాకోలా, డేటా సెంటర్లకు నీళ్లు ఆపండి!

రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ వ్యవసాయాన్ని ఎల్‌నినో తీవ్రంగా దెబ్బతీసింది. వర్షాభావం, అడుగంటిపోతున్న భూగర్భ జలాలు, ఖాళీ అవుతున్న రిజర్వాయర్లు రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పెసర, మినుము, సోయాబీన్ వంటి పంటలు కోతకు వస్తుండగా, మిగిలిన పంటలు నీరందక ఎండిపోతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో బావులు, బోర్లు ఎండిపోవడంతో పాటు విద్యుత్ కోతలు సర్వసాధారణమయ్యాయి. యూనిట్‌కు పది రూపాయలు చెల్లించి కొందామన్నా మార్కెట్‌లో విద్యుత్ లభించని పరిస్థితి ఉందని ప్రభుత్వమే ప్రకటించడం పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్ర వ్యవసాయానికి ఆధారమైన నైరుతి రుతుపవనాల కాలంలో వర్షపాతం తీవ్రంగా పడిపోయింది. ఈ రుతుపవనాల సాధారణ వర్షపాతం 740.6 మిల్లీమీటర్లు కాగా, గత సంవత్సరం జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 988.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కానీ ఈ ఏడాది అదే కాలంలో 615.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 16 జిల్లాలు మాత్రమే సాధారణ వర్షపాతాన్ని నమోదు చేయగా, ఏకంగా 17 జిల్లాల్లో 20శాతం నుంచి 59 శాతం వరకు లోటు వర్షపాతం నమోదైంది. గతేడాది సెప్టెంబర్ 30 నాటికి రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో 848.77 టీఎంసీల నీరు ఉండగా, ఈ ఏడాది అది 475.57 టీఎంసీలకు పడిపోయింది.

ఉపరితల నీటి లభ్యత తగ్గడంతో రైతులు బోర్లపై విపరీతంగా ఆధారపడ్డారు. దీనికి తోడు నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరి, పత్తి పంటలను విస్తృతంగా సాగు చేయడంతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటు భూగర్భ జలమట్టం గత ఏడాది ఆగస్టులో 5.78 మీటర్లు ఉండగా, ఈ ఏడాది ఆగస్టు నాటికి 7.87 మీటర్లకు పడిపోయింది.

ఈ ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం కూడా తగ్గింది. రాష్ట్ర సాధారణ సాగు విస్తీర్ణం 1,32,38,446 ఎకరాలు కాగా, ఈసారి 1,25,85,426 ఎకరాలకు పరిమితమైంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 65,95,645 ఎకరాలు కాగా, గతేడాది ఖరీఫ్‌లో 67,33,484 ఎకరాల్లో సాగై, ఈసారి 56,79,969 ఎకరాలకు అంటే దాదాపు 9 లక్షల ఎకరాలకు పైగా తగ్గింది. ధాన్యాల మొత్తం సాగు విస్తీర్ణం 72,48,771 ఎకరాలకు గాను 63,12,526 ఎకరాల్లో (87శాతం) మాత్రమే సాగైంది. నూనెగింజల సాగు 4,47,585 ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను 3,96,597 ఎకరాలకు పరిమితమైంది.


రాబోయే యాసంగి (రబీ) సీజన్‌లో వరి వంటి నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటలను సాగు చేయడం తీవ్ర ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి లభ్యతను బట్టి డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతుల ద్వారా తక్కువ నీటితో పండే జొన్న, సజ్జ, రాగి వంటి చిరుధాన్యాలు, శనగ, పెసర వంటి పప్పుధాన్యాలు, ఆముదం, వేరుశనగ వంటి నూనెగింజల ఆరుతడి పంటలను మాత్రమే వేయాలి. మరోవైపు ప్రభుత్వం శాస్త్రీయ అవగాహన లేకుండా ప్రోత్సహిస్తున్న ఆయిల్‌ పామ్ సాగు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఒక ఆయిల్ పామ్ చెట్టుకు రోజుకు 250 నుంచి 300 లీటర్ల నీరు, ఏటా 1500 నుంచి 1800 మి.మీ వర్షపాతం అవసరం. కరువు సమయంలో కొత్తగా ఆయిల్ పామ్ నాటితే 90శాతానికి పైగా లేత మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉంది.

ఈ క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరువు మండలాలను ప్రకటించి, కేంద్రానికి నివేదికలు పంపి ఎన్‌డీఆర్‌ఎఫ్ నిధులతో పాటు రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించాలి. ఇతర మౌలిక వసతుల కాంట్రాక్టర్లకు ఇచ్చే నిధులను కరువు పీడిత గ్రామాలకు మళ్లించాలి. రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని వెంటనే అమలులోకి తేవాలి. ఖరీఫ్‌లో సగటు దిగుబడులు పడిపోయిన రైతులందరికీ బీమా పథకం కింద నష్ట పరిహారం అందించాలి. గత ఆరు సీజన్లుగా పంటల బీమా పథకం లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి వీలుగా కౌలు రైతులను కూడా ప్రభుత్వం తక్షణమే గుర్తించాలి.

ఈ సీజన్‌లో పంటల సగటు దిగుబడులు బాగా తగ్గిన రైతులతో పాటు కూరగాయల రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి. కౌలు రైతులతో సహా, పంటలు ఎండిపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి. వరి, పత్తి లాంటి ప్రధాన పంటలకు 2026లో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం నిర్ణయించిన రుణ పరిమితిలో 50శాతం వరకూ రైతులకు పరిహారంగా అందించాలి. కౌలు రైతుల గుర్తింపు కోసం 2011 అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేయాలి. వ్యవసాయంలో కీలకపాత్ర పోషిస్తున్న మహిళా రైతులను గుర్తించడానికి మహారాష్ట్ర తరహాలో ప్రత్యేక చట్టాన్ని తేవాలి. పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. యాసంగికి ఆరుతడి విత్తనాలను ఉచితంగా సరఫరా చేయాలి. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడడంతో పాటు పశువుల మేతను సరఫరా చేయాలి.


వలసలను నివారించడానికి ఉపాధి హామీ పనులను తక్షణమే విస్తృతంగా ప్రారంభించాలి. ఎక్కువ మందికి పనులు కల్పించడానికి వీలుగా చిన్న, సన్నకారు రైతులకు, గ్రామీణ మౌలిక వసతులైన గిడ్డంగులు, డ్రయ్యింగ్ యార్డులు, స్కూల్ భవనాలు, లాంటి మౌలిక వసతుల మేలు జరిగేలా ఈ సీజన్‌లో ఉన్న ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా కొత్త పనులను ఉపాధి హామీ పథకానికి జోడించాలి. రైతుల, స్వయం సహాయక బృందాల బ్యాంకు అప్పుల వాయిదాలను ప్రభుత్వం ఒక ఏడాది పాటు వాయిదా వేసి, వడ్డీలను మాఫీ చేయాలి.

ఇప్పటికీ మిషన్ భగీరథ పథకం గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. చాలా చోట్ల ఈ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందడం లేదు. మిషన్ భగీరథ పూర్తి స్థాయి మంచి నీటి పథకం. ఈ పథకం అమలులోని సమస్యలను పరిష్కరించడానికి, తగిన స్థాయిలో తాగునీటిని ప్రజలకు సరఫరా చేయడానికి ప్రభుత్వం పూనుకోకపోవడం వల్ల, ప్రజలు ఎంతో డబ్బు వెచ్చించి నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇది ఆయా కుటుంబాలపై పెద్ద ఆర్థిక భారాన్ని మోపుతున్నది. అన్నింటికంటే ముఖ్యంగా, ప్రాజెక్టులలో నీటి కొరత ఉన్నందున మిషన్ భగీరథ నీటిని ఇథనాల్, కోకాకోలా, డేటా సెంటర్లు వంటి పరిశ్రమలకు మళ్లించకుండా, కేవలం ప్రజల తాగునీటికి, ఆరుతడి పంటలకు మాత్రమే వినియోగించాలి.

కన్నెగంటి రవి

రైతు స్వరాజ్య వేదిక

Also Read:

సిక్కిం గవర్నర్ నియామకంపై నిరసన.. అంకిత భండారీ తల్లిదండ్రుల విడుదల

జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు

గుజరాత్‌లో దారుణం.. నగల కోసం ప్రాణాలు తీసేశారు

Updated Date - Oct 16 , 2026 | 03:23 AM