Share News

పరీక్షల మధ్య విరామం.. ఫలితం దక్కిందా?

ABN , Publish Date - Apr 21 , 2026 | 03:21 AM

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఈ విద్యాసంవత్సరంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో ప్రతి పరీక్షకు మూడు నుంచి ఐదు రోజుల వరకు విరామం కల్పించింది. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం, ప్రతి సబ్జెక్టుకు...

పరీక్షల మధ్య విరామం.. ఫలితం దక్కిందా?

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఈ విద్యాసంవత్సరంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో ప్రతి పరీక్షకు మూడు నుంచి ఐదు రోజుల వరకు విరామం కల్పించింది. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం, ప్రతి సబ్జెక్టుకు సిద్ధం కావడానికి తగిన సమయం ఇవ్వడం, పునశ్చరణకు అవకాశం కల్పించడం వంటి మంచి ఉద్దేశాలతో ఈ విధానాన్ని అమలు చేసింది. విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ, వారు ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి ఉపయోగపడే ఈ నిర్ణయం అభినందనీయం. అయితే, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులను పరిశీలిస్తే, ఇంకా కొద్ది మార్పులు చేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని అనిపిస్తోంది.

పరీక్షల మధ్య విరామం రోజుల్లో విద్యార్థులు పాఠశాలకు వచ్చి పునశ్చరణ తరగతులకు హాజరవ్వాలని సూచించినా అనేక చోట్ల హాజరు శాతం తగ్గింది. అలాగే, ఎక్కువ విరామం కారణంగా విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటోంది. చదివిన విషయాలు మర్చిపోవడం, పునశ్చరణలో నిర్లక్ష్యం పెరగడం, చదువు పట్ల అలసత్వం వంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో కొంతమంది విద్యార్థులు క్రికెట్ వంటి ఆటల వైపు దృష్టి పెట్టడం వల్ల చదువులో అంతరాయం కలుగుతున్నది. ఇంకా, కొన్ని ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమాలు, కుటుంబ వేడుకల వల్ల విద్యార్థులు చదువుకు సమయం కేటాయించలేకపోతున్నారు. తల్లిదండ్రులకు పరీక్షల షెడ్యూల్, పునశ్చరణ తరగతుల ప్రాముఖ్యతపై పూర్తి అవగాహన లేకపోవడం కూడా ఒక కారణం. ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలు, మోడల్ పేపర్లు, హోంవర్క్ వంటి అంశాలను విద్యార్థులు క్రమంగా అనుసరించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అనేకమంది తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడం లేదా ఉపాధి పనుల్లో నిమగ్నమై ఉండటం వల్ల పిల్లల చదువుపై పర్యవేక్షణ తగ్గిపోతోంది. దీంతో పిల్లల్లో క్రమశిక్షణ లోపించడం, సమయపాలన, అలసత్వం వంటి సమస్యలు పెరుగుతున్నాయి.


పరీక్షల మధ్య రోజులకు పాఠశాలల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. ముఖ్య ప్రశ్నలు, మోడల్ పేపర్లు, బిట్ ప్రాక్టీస్, బలహీన అంశాలపై దృష్టి, సందేహ నివృత్తి వంటి కార్యక్రమాలు క్రమబద్ధంగా నిర్వహిస్తే విద్యార్థులలో సంసిద్ధత మెరుగుపడుతుంది. ముఖ్యంగా విరామ రోజులలో విద్యార్థులు తప్పకుండా పాఠశాలకు హాజరై, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో చదివితే మంచి ఫలితాలు సాధించడం ఖాయం. ఉపాధ్యాయులు కూడా తల్లిదండ్రులకు ఈ విషయాలపై అవగాహన కల్పించాలి. అలాగే ప్రతి పరీక్ష మధ్య మూడు నుంచి ఐదు రోజుల బదులు, ఒకటి లేదా రెండు రోజుల విరామం ఉంటే విద్యార్థులు ఏకాగ్రతను కోల్పోకుండా ఉంటారు.

మీలా విజయ్‌కుమార్

తెలంగాణ రాష్ట్ర సోషల్ ఫోరం ఉపాధ్యక్షులు

ఈ వార్తలు కూడా చదవండి...

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఏం చర్చించారంటే..

కేసీఆర్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు: మంత్రి వివేక్

33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: కిరణ్ కుమార్ రెడ్డి

Read Latest Telangana News And AP News And International

Updated Date - Apr 21 , 2026 | 03:28 AM