Share News

నిబంధనల సంకెళ్లలో తెలంగాణ సౌర విప్లవం

ABN , Publish Date - May 06 , 2026 | 03:00 AM

రైతు తన బంజరు భూమి వైపు చూస్తూ.. ‘ఎప్పుడైనా దీన్నుంచి ఒక రూపాయి వస్తుందా?’ అని అనుకోవడం ఇప్పటికీ గ్రామాల్లో చూస్తూంటాం. కానీ అదే భూమి మీద పడే సూర్యకిరణాలను డబ్బుగా మారే శక్తి ఉందని...

నిబంధనల సంకెళ్లలో తెలంగాణ సౌర విప్లవం

రైతు తన బంజరు భూమి వైపు చూస్తూ.. ‘ఎప్పుడైనా దీన్నుంచి ఒక రూపాయి వస్తుందా?’ అని అనుకోవడం ఇప్పటికీ గ్రామాల్లో చూస్తూంటాం. కానీ అదే భూమి మీద పడే సూర్యకిరణాలను డబ్బుగా మారే శక్తి ఉందని చెప్పే పథకమే ‘PM–KUSUM COMPONENT A’. ఇది రైతును విద్యుత్ ఉత్పత్తిదారుడిగా మార్చే విప్లవాత్మక అవకాశం.

తెలంగాణకు ప్రకృతిపరంగా ఉన్న సానుకూలతలవల్ల, దేశంలోని అత్యధిక సౌరశక్తి సామర్థ్యం కలిగిన రాష్ట్రాలతో పోటీ పడగల స్థాయిలో ఉంది. ఇక్కడ దుమ్ము–ధూళి ప్రభావం తక్కువ, అధిక సోలార్ రేడియేషన్, స్థిరమైన వాతావరణం దీనికి అనుకూలంగా ఉన్నాయి. పవర్ కట్‌లు లేని విద్యుత్ మౌలిక వసతులు మరో అదనపు బలం. ఇన్ని అనుకూలతల కారణంగా, ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ ద్వారా సంవత్సరానికి సుమారు 20 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమని నిపుణుల అంచనా. అయితే, ఈ అవకాశాన్ని అందుకోవాల్సిన తెలంగాణ రైతులు తొలి అడుగు దగ్గరే ఆగిపోయారు. కారణం పాలసీ లోపమూ కాదు, అవకాశాలు లేకపోవడమూ కాదు. అసలు సమస్య ప్రాజెక్టు స్ర్టక్చర్లో ఉన్న డొల్లతనం.

కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడు అధికారులు చేసిన పాలసీలు కొన్నిసార్లు ప్రాజెక్టులను మింగేస్తాయి. ఇక్కడ అదే జరిగింది. తెలంగాణలో 1485 మెగావాట్ల పీపీఏలు రైతుల వ్యక్తిగత పేర్లతో చేశారు. ఈ ప్రాజెక్ట్ వైపు దృష్టి సారించినప్పుడు ఇన్వెస్టర్లకు, ఆర్థిక సంస్థలకు, నిపుణులకు ఎదురైన మొదటి ప్రశ్న– ‘కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌ను వ్యక్తిగత పేర్లలో ఎలా నడిపించగలం?’. దాదాపు ఒక మెగావాట్ సోలార్ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3.50–3.75 కోట్ల వరకూ వ్యయం అవుతుంది. రైతు వ్యక్తిగత పేరుపై పీపీఏ ఉంటే, ఏ నమ్మకంతో ఇన్వెస్టర్లు ఈ ప్రాజెక్ట్‌లో డబ్బులు పెట్టాలి? అందుకే ప్రాజెక్ట్ ఈ ప్రశ్న దగ్గరే ఆగిపోయింది. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. కానీ దానికి కావలసిన ముప్పై శాతం మార్జిన్ మనీ ఏర్పాటు చేసుకునే శక్తి రైతులందరికీ లేదు. ఆ సామర్థ్యం ఉన్న రైతులు మాత్రమే ముందుకు వెళ్లగలుగుతున్నారు.

ఈ ప్రాజెక్ట్‌లో రైతులకు మూడు మార్గాలు ఉన్నాయి: స్వయంగా పెట్టుబడి పెట్టి ప్లాంట్ నిర్మించడం, ఇన్వెస్టర్లతో భాగస్వాములు కావడం, లేదా భూమిని లీజుకు ఇవ్వడం. లీజు మోడల్‌లో ఎకరానికి రూ.60–70 వేల (లీజ్, పీపీఏపై ప్రీమియం కలిపి) వరకు స్థిర ఆదాయం లభించే అవకాశముంది. ప్లాంట్ లోన్ రీపేమెంట్ (10–12 సంవత్సరాలు) తర్వాత ఈ లీజ్ రూ.1 లక్ష వరకు పెంచుకోవచ్చు. అయితే మొదటి నమూనాలో వెళ్ళగలిగితే ఏ సమస్యా లేదు. వచ్చిన చిక్కల్లా రెండు, మూడు మోడల్స్‌లోనే. అక్కడ ఇన్వెస్టర్ తప్పనిసరి. వ్యక్తిగత పేర్లతో ఉన్న పీపీఏలు ఈ మార్గాలన్నింటికీ అడ్డంకిగా మారి, ఇన్వెస్టర్లను వెనక్కి నెడుతున్నాయి.


ఇన్వెస్టర్లు వ్యక్తిగత పేర్లతో ఉన్న పీపీఏలపై పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణం.. నమ్మకమైన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ లేకపోవడమే. వ్యక్తిగత ఒప్పందాల్లో లీగల్ భద్రత తక్కువ, ప్రాజెక్ట్‌పై నియంత్రణ స్పష్టంగా ఉండదు, దీర్ఘకాలం ఉండే సోలార్ ప్రాజెక్టులలో స్థిరత్వం, పారదర్శకత, సులభమైన ట్రాన్స్‌ఫర్ వంటి అంశాలు చాలా కీలకమైనవి. ఇవన్నీ వ్యక్తిగత పీపీఏ స్ట్రక్చర్‌లో బలహీనంగా ఉంటాయి. వ్యక్తిగత స్థాయిలో వివాదాలు వచ్చే అవకాశం వల్ల రిస్క్ ఉంది. ప్రాజెక్ట్ ట్రాన్స్‌ఫర్, ఎగ్జిట్ పాలసీలు కూడా క్లిష్టం. ఏ విధంగా చూసినా ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇన్వెస్టర్‌ను ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు.

రాజస్థాన్‌లో మొదట ఎల్‌ఓఏ (Letter of Award)లు రైతుల వ్యక్తిగత పేర్లలోనే జారీ అయ్యాయి. అయితే ప్రాజెక్ట్ స్ట్రక్చర్‌లో సమస్యలను గుర్తించిన ప్రభుత్వం, ప్రాజెక్టులను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల ద్వారా అమలు చేయాలని సూచించింది. రైతులు వెంటనే కంపెనీలు ఏర్పాటు చేసి, పీపీఏలను వాటి పేరు మీద తీసుకున్నారు. దీంతో ప్రాజెక్ట్ నిర్మాణం సులభమై, పెట్టుబడులు వచ్చి అమలు వేగవంతమైంది. ఫలితంగా దేశానికి రాజస్థాన్ ఒక విజయవంతమైన మోడల్‌గా, క్యాటలిస్ట్‌గా నిలిచింది. ఇప్పుడు ఇదే పాఠం తెలంగాణ ముందుంది.

పీపీఏలో ఆర్టికల్ 16.1 ప్రకారం, ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి వీలుగా వ్యక్తిగత పేరు మీద ఉన్న పీపీఏలను రైతులు తమ పేర ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టుకుని ఆ కంపెనీకి మార్చుకునే అవకాశం ఉంది. ఇది ప్రాజెక్ట్‌కు బలం చేకూర్చే కీలక నిబంధన. ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి MNRE పలు మార్పులు, చేర్పులు చేస్తూ కొత్త అమెండ్‌మెంట్స్‌ను జారీ చేస్తూ వచ్చింది. అదే క్రమంలో MNRE గైడ్‌లైన్స్‌లో కూడా అవసరమైన సవరణలు పొందుపరిచారు. అందుకే పీపీఏలో ప్రత్యేకంగా 16.1 ఆర్టికల్‌ను కూడా చేర్చారు.


అయితే ఎందుకు ఇది అమలు కావడం లేదు? ఎందుకంటే– అధికారులు దీనిని సమస్యగా గుర్తించడం లేదు. రైతుల వద్ద డబ్బు లేదు కాబట్టి ప్రాజెక్టు కదలడం లేదు అనే అభిప్రాయంతో ఉన్నారు. మరోవైపు రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. అసలు ఇలాంటి రూల్ ఉందని చాలామందికి తెలియదు. రాజస్థాన్‌లో అప్పటి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ‘ప్రాజెక్ట్ ఎందుకు ముందుకు రావడం లేదు?’ అని పదేపదే అధికారులను ప్రశ్నిస్తూ, ప్రతి దశలో సమస్యకు పరిష్కారం కనుగొనేలా చేసి, రైతుల సోలార్ విప్లవానికి బాటలు వేశారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అదే దిశగా తక్షణ నిర్ణయం తీసుకుని, వ్యక్తిగత పీపీఏలను రైతుల కంపెనీలకు మార్చే ప్రక్రియను అమలు చేయడం అవసరం. పీపీఏలు మార్చడానికి అవసరమైన లక్ష రూపాయల రుసుముపై రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవడం అవసరం. ఇంధనం ఇప్పుడు జాతీయ సమస్య. ఈ సమయంలో రాష్ట్రం ఏ చిన్న ఇంధన ఉత్పత్తి అవకాశాన్ని వదులుకున్నా అది అవివేకమే అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 300 కోట్ల యూనిట్ల పవర్ ఉత్పత్తి చేయించవచ్చు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ప్రాజెక్ట్ విజయం తథ్యం. ఈ పథకం ఒక సౌర విప్లవం. ఈ విప్లవం రావాలంటే, ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుని అమలుపరిస్తే ఆర్టికల్ 16.1 నిజమైన గేమ్‌ చేంజర్ అవుతుంది.

రుబీనా పర్వీన్

(రచయిత రాజస్థాన్‌లో ‘కుసుమ్ కాంపోనెంట్– ఎ’

సోలార్ ప్రాజెక్ట్స్ కోసం రైతులతో కలిసి పనిచేశారు)

ఈ వార్తలు కూడా చదవండి..

పాస్టర్లకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలపై విచారణ.. వాయిదా వేసిన హైకోర్టు

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్.. 56 మంది అరెస్ట్

For More AP News And Telugu News

Updated Date - May 06 , 2026 | 03:00 AM