Share News

అంకెల్లో ఆధిక్యం అభివృద్ధిలో అగాధం

ABN , Publish Date - May 16 , 2026 | 02:18 AM

ముదిరాజ్/ముత్రాసి/తెనుగోళ్లు సామాజిక వర్గం విషయంలో ఇటీవలి ‘సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కుల (SEEEPC)’ సర్వే వెల్లడించిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ముదిరాజ్‌ సమాజం...

అంకెల్లో ఆధిక్యం అభివృద్ధిలో అగాధం

ముదిరాజ్/ముత్రాసి/తెనుగోళ్లు సామాజిక వర్గం విషయంలో ఇటీవలి ‘సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కుల (SEEEPC)’ సర్వే వెల్లడించిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ముదిరాజ్‌ సమాజం ‘అతి పేదరికం’లో లేదు, అలాగని ‘అభివృద్ధి చెందిన’ వర్గాల్లోనూ చేరలేదు. సరిగ్గా ఈ ‘మధ్యస్థాయి వెనుకబాటుతనం’ (Middle–tier Back-wardness) కారణంగానే, ఈ అతిపెద్ద సామాజిక వర్గం విధానకర్తల దృష్టిలో ఒక ‘అదృశ్య సమూహం’గా మారిపోయింది. సంఖ్యాబలం ఉన్నా రాజకీయ ప్రాబల్యం లేని ఈ వర్గం ఎదుర్కొంటున్న సామాజిక అంటరానితనంపై, విధానపరమైన నిర్లక్ష్యంపై లోతైన విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉన్నది.

తెలంగాణలోని బీసీల నిజమైన స్థితిని కొలవడానికి SEEEPC ఒక శాస్త్రీయ పరికరాన్ని ఉపయోగించింది. అదే సీబీఐ (The Composite Backwardness Index– సమ్మిళిత వెనుకబాటుతన సూచిక). మొత్తం 242 కులాలకు సంబంధించిన సమ్మిళిత వెనకబాటు తనం సూచికను 11 నుండి 116 వరకు ర్యాంకులను కేటాయిస్తే, ముదిరాజ్ సామాజిక వర్గం 94వ ర్యాంకులో నిలిచింది. ఇది పైకి చూడ్డానికి సానుకూల అంశంగా అనిపించినా, లోతుగా విశ్లేషిస్తే ఆందోళన కలిగించే అంశాలు కనిపిస్తాయి.

కులగణన గణాంకాలు తెలంగాణ సామాజిక ముఖచిత్రంలో ముదిరాజ్‌ల ప్రభావాన్ని కళ్లకు కడుతున్నాయి. ఈ గణాంకాల ప్రకారం రాష్ట్ర మొత్తం బీసీ జనాభాలో ముదిరాజ్ సామాజిక వర్గం అత్యధిక వాటా (13.5శాతం)ను కలిగి ఉండటమే కాకుండా, మొత్తం రాష్ట్ర జనాభాలోనూ 7.4శాతం పైగా ఉంటూ తిరుగులేని నిర్ణయాత్మక శక్తిగా నిలిచింది. రాష్ట్రంలోని ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ముదిరాజ్ బిడ్డ ఉన్నారు. ఇంతటి బ్రహ్మాండమైన సంఖ్యాబలం, దాదాపు 27 లక్షలకు చేరువలో ఉన్న జనవాహిని, రాష్ట్రంలోని 133 బీసీ కులాలన్నింటిలోనూ అగ్రభాగంలో ఉన్నప్పటికీ అధికార వాటా దగ్గరకు వచ్చేసరికి ఈ ‘మహాసముద్రం’ గ్లాసుడు నీటికీ నోచుకోకపోవడం సామాజిక అన్యాయానికి పరాకాష్ఠ.


ముదిరాజ్‌ సమాజం అభివృద్ధికి, వెనుకబాటుతనానికి మధ్య ఉన్న ఒక ‘స్తబ్ధత’లో చిక్కుకుపోయింది. ఈ పరిస్థితిని ఈ కింది ప్రధాన అంశాల ద్వారా లోతుగా విశ్లేషించవచ్చు: ముదిరాజ్ సమాజంలో చదువు పట్ల ఆసక్తి పెరిగింది, కానీ అది కేవలం ప్రాథమిక స్థాయికే పరిమితమవుతోంది. గణాంకాలను పరిశీలిస్తే, పదో తరగతి వరకు విద్యార్థుల సంఖ్య ఆశాజనకంగానే ఉంటోంది. కానీ, ఇంటర్మీడియట్‌, డిగ్రీ స్థాయికి వచ్చేసరికి ఈ సంఖ్య భారీగా పడిపోతోంది. ఉన్నత చదువులకు కావాల్సిన ఆర్థిక స్తోమత లేకపోవడం లేదా కుటుంబ బాధ్యతలు మీద పడటం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు సైతం చిన్న వయసులోనే కూలీలుగా మారుతున్నారు.

ఈ వర్గంలో చాలామంది ‘మొదటి తరం విద్యావంతులు’. అంటే, వారి ఇంట్లో చదువుకున్నవారు ఎవరూ ఉండరు. దీనివల్ల ఏ కోర్సు చదవాలి? ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలి? అనే విషయాల్లో సరైన మార్గదర్శకత్వం ఇచ్చే వారు లేరు. ఈ లోటు వల్ల వారు ఐఏఎస్, ఐపీఎస్ లేదా సాఫ్ట్‌వేర్ రంగం వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాల్లో తగినంతగా కనిపించడం లేదు. ఇంజనీరింగ్, మెడిసిన్, డేటా సైన్స్ వంటి ఖరీదైన సాంకేతిక కోర్సుల్లో వీరి ప్రాతినిధ్యం జనాభా నిష్పత్తి ప్రకారం ఉండటం లేదు. ఫలితంగా, వీరు కేవలం అసంఘటిత రంగాలకే పరిమితమవుతున్నారు.

ముదిరాజ్‌లు చారిత్రకంగా ప్రకృతి వనరులపై, ముఖ్యంగా జలవనరులపై ఆధారపడి బతుకుతున్నారు. కానీ నేడు ఆ మూలాలే బలహీనపడ్డాయి. ఒకప్పుడు చెరువులు ముదిరాజ్‌ల జీవనాధారం. కానీ నేడు పారిశ్రామిక వ్యర్థాలతో నీరు కలుషితమవ్వడం, ఆక్రమణల వల్ల చెరువులు కుచించుకుపోవడం వీరి ఉపాధిని దెబ్బతీసింది. ఆధునిక పద్ధతుల్లో చేపల పెంపకం చేపట్టేందుకు అవసరమైన పెట్టుబడి లేక, దళారుల చేతుల్లో మోసపోతూ లాభాలను కోల్పోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపల వృత్తి లాభసాటిగా లేకపోవడంతో యువత నగరాలకు వలస వెళ్తున్నారు. అక్కడ వీరు స్కిల్డ్ వర్కర్లుగా కాకుండా, నిర్మాణ రంగంలో దినసరి కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా లేదా డెలివరీ బాయ్స్‌గా చేరుతున్నారు. ఇది ఒక రకమైన ‘అభివృద్ధి చెందని వలస’.

చాలా కుటుంబాలకు అర ఎకరం లేదా ఎకరం భూమి ఉంటుంది. కానీ ఆ భూమి సేద్యానికి అనుకూలంగా లేకపోవడమో లేదా పెట్టుబడి పెట్టే శక్తి లేకపోవడమో జరుగుతోంది. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే, వీరి వద్ద ఆస్తులు ఉన్నాయి కానీ, వాటి ద్వారా ‘స్థిరమైన ఆదాయం’ రావడం లేదు. దీనివల్ల వీరు దారిద్ర్య రేఖకు అటు ఇటుగా కొట్టుమిట్టాడుతున్నారు.


ముదిరాజ్‌ల వెనుకబాటుతనం విలక్షణమైనది. ఇది ప్రభుత్వాలకు బ్లైండ్‌ స్పాట్‌ లాంటిది. వీరు దళిత, గిరిజన వర్గాల అంతటి సామాజిక వెలివేతను అనుభవించడం లేదు. అలాగని, అగ్రవర్ణాల లాగా రాజకీయ, ఆర్థిక పరపతిని కలిగి లేరు. ఈ ‘మిడిల్ క్లాస్ వెనుకబాటుతనం’ వల్ల ప్రభుత్వం ఎప్పుడూ అతిపేదలకు ఇచ్చే ప్రాధాన్యత వీరికి ఇవ్వదు. ముదిరాజ్ సమాజం ఎదుర్కొంటున్న ఈ ‘‘మధ్యస్థాయి వెనుకబాటుతనం’’ అత్యంత ప్రమాదకరమైనది. ఇది నెమ్మదిగా సామాజిక అసంతృప్తికి, ఆర్థిక అసమానతలకు దారితీస్తుంది. సంఖ్యాపరంగా ఇంత పెద్ద వర్గం స్తబ్ధతలో ఉంటే అది రాష్ట్ర ప్రగతికే గొడ్డలి పెట్టు. ఇప్పటికైనా ప్రభుత్వం SEEEPC సర్వేను కేవలం డేటాగా చూడకుండా, ఒక హెచ్చరికగా భావించాలి. సంక్షేమం నుంచి సాధికారత వైపు, గుర్తింపు నుంచి అవకాశాల కల్పన వైపు అడుగులు పడాలి.

పిట్టల రవీందర్

‘ముదిరాజ్ అధ్యయన వేదిక’ వ్యవస్థాపకులు

ఈ వార్తలు కూడా చదవండి...

రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల

వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు

Read Latest Telangana News And AP News And International News

Updated Date - May 16 , 2026 | 02:18 AM