స్వపరిపాలన స్ఫూర్తి కొరవడిన స్థానిక సంస్థలు
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:23 AM
తెలంగాణలో గ్రామ పంచాయతీ, పురపాలక సంఘాల ఎన్నికలు స్వావలంబన, స్వపరిపాలన లక్ష్యంగా జరగాలని, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల నుంచి పట్టణాల వరకు సర్వతోముఖాభివృద్ధి సాధ్యం కావాలని ప్రజాస్వామికవాదులు ఆశించారు. కానీ...
తెలంగాణలో గ్రామ పంచాయతీ, పురపాలక సంఘాల ఎన్నికలు స్వావలంబన, స్వపరిపాలన లక్ష్యంగా జరగాలని, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల నుంచి పట్టణాల వరకు సర్వతోముఖాభివృద్ధి సాధ్యం కావాలని ప్రజాస్వామికవాదులు ఆశించారు. కానీ అందుకు విరుద్ధంగా ఈ ఎన్నికల ప్రక్రియ ఒక జూదంగా మారిపోయింది. పదవి కోసం ఎంతటి స్థాయికైనా దిగజారే నాయకులతో తరతరాల నుంచి అందిపుచ్చుకున్న ఈ వ్యవస్థ మటుమాయమయ్యే పరిస్థితి ఏర్పడింది.
ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని కన్నబిడ్డను సైతం చంపుకున్న అమానవీయ, పైశాచిక ఘటనలు పతనమవుతోన్న ఎన్నికల ప్రక్రియకు పరాకాష్ఠ. ఎన్నికల్లో ఓడిపోతే– ఓటర్లకు పంచిన డబ్బులు, చీరలు తిరిగి ఇవ్వాలంటూ అభ్యర్థులు ఇల్లిల్లూ తిరగడం, ఓటర్లచే ప్రమాణాలు చేయించుకోవడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది. తెల్లవారితే ఎన్నికలనగా రాత్రి వీధుల్లో కుప్పలుతెప్పలుగా కనిపించే ఖాళీ కవర్లు ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే క్యాంపు రాజకీయాలు చేయడం, సిద్ధాంతాలను పక్కకుపెట్టి విరుద్ధ భావజాలం ఉన్నవారితో సంప్రదింపులు జరపడం, సొంత అభ్యర్థులను కాదని ఇండిపెండెంట్లకు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులను ఎర వేయడం మనం చూస్తూనే ఉన్నాం.
ఈ రాజకీయ విశృంఖలతను బాబాసాహెబ్ అంబేడ్కర్ ముందే ఊహించారు. 1948 నవంబర్ 4న రాజ్యాంగ సభలో భారత రాజ్యాంగం మొదటి ముసాయిదాను ప్రవేశపెట్టినప్పుడు, పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగబద్ధ హోదా ఇస్తే గ్రామాల్లో సామాజిక విభజనలు బలోపేతం అవుతాయని ఆయన హెచ్చరించారు. అయితే మహాత్మాగాంధీ, ఇతర పెద్దలు భారతదేశ రాజకీయ చట్రంలో పంచాయతీలు పరిపాలనా విభాగాలుగా ఉండాలని ఒత్తిడి తీసుకురావడంతో విధాన నిర్దేశక సూత్రాల కింద ఆర్టికల్ 40లో పంచాయతీల కోసం నిబంధనను చేర్చారు.
మన దేశంలో కొన్ని శతాబ్దాల పాటు వరుసగా కొనసాగిన ముస్లిం– బ్రిటిషర్ల పాలనలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైంది. వారు తమ అవసరాల కోసం ఈ వ్యవస్థను వాడుకొని, దేశాన్ని కొల్లగొట్టి, ప్రజల జీవన విధానాన్ని ఛిన్నాభిన్నం చేశారు. మొఘలుల పరిపాలనలో భూస్వామ్య వ్యవస్థ–కుల ఆధిపత్యం వేళ్లూనుకోవడం ప్రారంభమై, గ్రామ స్వయం పాలన వ్యవస్థ క్రమంగా దెబ్బతినడం మొదలైంది. ప్రజలు–పాలకుల మధ్య జమీందారీ–ఫ్యూడల్ వ్యవస్థ వచ్చి, వేయి సంవత్సరాలుగా భాసిల్లిన గ్రామ పంచాయతీ వ్యవస్థను కబళించివేసింది. బ్రిటిష్ కాలంలో వెలసిన స్థానిక సివిల్–క్రిమినల్ కోర్టుల నిర్మాణం, రెవెన్యూ, పోలీసు వ్యవస్థల వల్ల పంచాయతీలు తమకున్న స్వయం ప్రతిపత్తిని క్రమంగా కోల్పోయాయి. మొత్తం గ్రామ భూమిని పద్ధతి ప్రకారం కలిసి సాగు చేయటం పోయి, వ్యక్తిగతంగా భూమిని హస్తగతం చేసుకొని అధికారం చలాయించే వ్యవస్థకు అంకురార్పణ జరిగింది. క్రమంగా చేతివృత్తులు చేజారిపోయాయి. ఉపాధి లేని కుటుంబాల సంఖ్య పెరిగింది. బ్రిటిష్ వారు పంచాయతీ వ్యవస్థను తమ ఆధీనంలో ఉంచుకొని, శిస్తు వసూలు, వ్యాపార లావాదేవీలకు ఉపయోగపడే వ్యవస్థను తయారు చేసేందుకు తపించారు. అయితే, తమ మనుగడకు, తమ పరిపాలన కొనసాగింపునకు వ్యవస్థీకృత పంచాయతీ వ్యవస్థ అవసరమని గ్రహించి సంస్కరణలు మొదలుపెట్టారు.
18వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశ సంపద ప్రపంచ సంపదలో 23శాతం ఉండేదని, అది యూరప్ దేశాల మొత్తం సంపదతో సమానమని బ్రిటిష్ చరిత్రకారుడు అంగస్ మెడిసన్ రాశారు. ఈ గత వైభవానికి కారణం స్వావలంబన, స్వపరిపాలన. ఈ వ్యవస్థను పునరుద్ధరించాలని స్వాతంత్ర్యం తరువాత ఎన్నో విధానపరమైన చర్యలు తీసుకున్నా అనుకున్నది సాధించలేకపోతున్నాం.
ప్రజలు భాగస్వాములై గ్రామసభ ద్వారా ప్రతి గ్రామాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థగా తీర్చిదిద్దాలని మహాత్మాగాంధీ అన్నారు. కొందరు పైన కూర్చున్నంత మాత్రాన నిజమైన ప్రజాస్వామ్యం పనిచేయదని తెలిపారు. ప్రతి గ్రామంలో క్రింది స్థాయి నుంచి, పట్టణాల్లో వార్డు నుంచి ప్రజాసభలను నిర్వహించాలని, ప్రజలు భాగస్వాములైనప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. పండిట్ నెహ్రూ స్థానిక స్వపరిపాలన ఒక్కటే ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలమని, కింది స్థాయిలో సరైన పునాది లేకపోతే ప్రజాస్వామ్యం నిర్వీర్యమవుతుందని తెలిపారు. గ్రామసభనే ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, గ్రామపంచాయతీ – గ్రామసభల మధ్య సంబంధం క్యాబినెట్, అసెంబ్లీ మధ్య ఉండే సంబంధంలా ఉండాలని జయప్రకాశ్ నారాయణ ఉద్బోధించారు. ఓటున్న ప్రతి ఒక్కరూ గ్రామసభ, పురపాలక సంఘాలు, వార్డులవారీగా సమావేశమై చర్చించుకుంటేనే నిజమైన స్వరాజ్యం సాకారం అవుతుందని మన పెద్దలు విశ్లేషించారు.
వివిధ కమిటీలను నియమించి విస్తృతంగా చర్చించిన తర్వాత 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీరాజ్, పురపాలక సంఘాల ఎన్నికలు, రిజర్వేషన్లు, ఆర్థిక వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించారు. దానివల్ల 1993లోనే ఈ వ్యవస్థలు రాజ్యాంగబద్ధమయ్యాయి. కానీ ఈ సవరణల ద్వారా సంక్రమించిన అంశాలను మూడు దశాబ్దాల కాలం గడిచినా, మన రాష్ట్రంలో పంచాయతీలకు, మునిసిపాలిటీలకు, కార్పొరేషన్లకు బదిలీ చేయలేదు. అదేవిధంగా విధులు, నిధులు, అధికారాలు, సిబ్బందిని కూడా ఈ సంస్థలకు బదిలీ చేయలేదు. ఇవి ఇచ్చి ఉంటే ఈ సంస్థలకు చేతినిండా పని ఉండేది. పల్లెల నుంచి పట్టణాల వరకు స్వావలంబన, స్వపరిపాలన సాధించడానికి మార్గం సుగమం అయ్యేది. అన్ని రాజకీయ పార్టీలు చర్చించి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌లకు, కార్పొరేషన్ మేయర్లకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరిపిస్తే ప్రజాస్వామ్య విలువలను ఇనుమడింపజేసినవారమవుతాం.
73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన అంశాలను పూర్తిగా బదిలీ చేసి కేరళ, కర్ణాటక సహా మరికొన్ని రాష్ట్రాలు చక్కటి ఉదాహరణలుగా నిలిచాయి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశలో పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ పంచాయతీలలో కేవలం 29కి 14, పురపాలక సంఘాలలో 18కి 17 అంశాలనే, అదీ కాగితాలపైన మాత్రమే బదిలీ చేసి, వీటి మనుగడనే ప్రమాదంలోకి నెట్టే ఉత్తర్వులను జారీ చేసి, ప్రజాప్రతినిధులకు సంకెళ్లు వేశారు. దాంతో ఇటు ప్రభుత్వం–ప్రజాప్రతినిధులు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నుకున్న మునిసిపల్ చైర్‌పర్సన్‌లు, కార్పొరేషన్ మేయర్లు ఉత్సవ విగ్రహాల మాదిరిగా కొలువుదీరారు. ఈ పరిస్థితులను వెనువెంటనే మార్చడానికి ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సి.హెచ్.విద్యాసాగర్‌రావు
మహారాష్ట్ర మాజీ గవర్నర్
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు..
నకిలీ మద్యం కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగింపు
Read Latest Telangana News And AP News And Telugu News